సాక్షి, హైదరాబాద్: దళిత బంధు తరహాలో పేద ముస్లిం కుటుంబాలకు కూడా నగదు బదిలీ లబ్ధి చేకూర్చాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్‌లో ‘తెలంగాణలో ముస్లిం‘లు అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రం మొత్తం మీద 8.8 లక్షల ముస్లిం కుటుంబాలు ఉండగా, అందులో రెండు శాతం మంది అత్యంత దుర్భర జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిలో కనీసం ఒక శాతం కుటుంబాలకైనా దళిత బంధు తరహా పథకం వర్తింపజేయాలని కోరారు. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందిస్తే రూ.900 కోట్లు దాటదని, బడ్జెట్‌లో సైతం 0.8 శాతం మించదని చెప్పారు. ఒకే విడతగా సాధ్యం కాని పక్షంలో రెండు విడతలుగా నగదు బదిలీ చేయవచ్చని సూచించారు.
అసెంబ్లీలో సీఎంను కోరతాం..
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు పథకం చర్చకు వచ్చినప్పుడు పేద ముస్లిం వర్గాలకు కూడా ఆర్థిక చేయూత అమలు కోసం సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తామని అసదుద్దీన్ చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని వర్గాలతో పాటు ముస్లిం కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల ఆర్థిక స్థితిగతులపై సుధీర్ కమిషన్ సమర్పించిన నివేదిక సైతం దళితుల కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నారని పేర్కొందని గుర్తుచేశారు.
ముస్లిం వర్గాలు అక్షరాస్యతలో సైతం వెనుకబడ్డారని, పై తరగతులకు వెళ్తున్న కొద్దీ డ్రాప్ అవుట్ శాతం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు శాతం మించి ముస్లింలు లేరని, భూములు కలిగిన వారు 9 శాతం మాత్రమే ఉన్నారని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ చర్చా వేదికలో ముస్లిం ఆర్థిక సామాజిక స్థితిగతుల విచారణ కమిషన్ చైర్మన్ జి.సుధీర్, ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ తదితరులు పాల్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment