
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దారుస్సలాం మైదానంలో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు. సోమవారం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ.. దారుస్సలాంలో జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభించడం మొదటిసారి జరిగిందని పేర్కొన్నారు. బారిస్టర్ చదివిన ఎంపీ అసద్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా లోక్‌సభలో బిల్లును చింపడంపై మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టానికి మసిపూసి మారేడు కాయ చేసి ప్రచారం చేస్తున్నారంటూ బాధపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంపై అనుమానాలుంటే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. భారత్‌లోని ముస్లింలకు ఉన్నంత స్వేచ్ఛ.. ఇస్లామిక్ దేశాల్లోని ముస్లింలకు కూడా లేదన్నారు. గతంలో అబ్దుల్ కలాంకు కాంగ్రెస్ రెండోసారి రాష్ట్రపతి పదవి ఇవ్వకపోవడంపై ఎందుకు స్పందించలేదని ఎంపీ అసదుదద్దీన్‌ను కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు.