
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతీ ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపు ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరజాబితా (ఎన్నార్సీ) చట్టాలంటే గాంధీజీ, అంబేద్కర్ ఆశయాలను అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం దారుస్సలాంలో జరిగిన భారీ సభలో అసద్ ప్రసంగించారు. ఎన్నార్సీ వల్ల నష్టాలే తప్ప ప్రయోజనాలు ఏమీ ఉండవన్నారు. దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకుతీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరితో రాజ్యాంగ ప్రవేశిక చదివించిన అసద్.. జాతీయ గీతాలాపనతో సభ ముగించారు.