సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇంటింటిపై త్రివర్ణ పతాకాలను రెప రెపలాడించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరా బాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘మహత్మాగాంధీ, అంబేద్కర్, మౌలానా అజాద్, నేతాజీ సుభాస్ చంద్రబోస్‌లు జీవించి లేనప్పటికీ వారి ఆశయాలు సజీవంగా ఉన్నాయి.
మనమంతా భారతీయులమని బీజేపీ, సంఘ్‌పరివార్‌లకు ఘాటైన సమాధానం చెప్పేందుకు ఇంటింటిపై త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలి. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ ఉపసంహరించే వరకు జెండాలు అలాగే ఉంచాలి’ అని పిలుపునిచ్చారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజా స్వామ్యయుతంగా, హింసకు తావివ్వకుండా, శాం తియుతంగా కనీసం ఆరుమాసాలైనా ఆందోళన కొనసాగించాలన్నారు. భారతీయులందరిని రక్షించేందుకే ఈ పోరాటమన్నారు. కేరళలో మాదిరిగా తెలంగాణలో కూడా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్‌ఆర్‌సీ) అమలు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
జమాత్–ఇ–ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతో కేంద్ర పాలకుల మెడలు వంచినట్లు.. అమిత్‌షా మెడలు వంచి చట్టం ఉపసంహరించేలా ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. అస్సాంకు చెందిన సామాజిక కార్యకర్త అబ్ధుల్ వదూర్ అమాన్ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలోని సీఎంలు వీటి అమలును నిలిపివేయాలని పలువురు వక్తలు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో ఢిల్లీకి చెందిన జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్దులు కూడా పాల్గొన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఈ సభను జాతీయ గీతంతో ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment