తక్కువ ఖర్చుతో క్యాన్సర్ చికిత్స...
నెక్స్ట్‌జెనరేషన్ ఫోటోడైనమిక్ క్యాన్సర్ థెరపీ
త్వరలో భారత్‌లో అందుబాటులోకి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక వైద్య విధానం నెక్స్ట్ జెనరేషన్ ఫోటోడైనమిక్ క్యాన్సర్ థెరపీ (ఎన్‌జీపీడీటీ) ఈ ఏడాదే భారత్‌లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానంతో పోలిస్తే తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో చికిత్స పూర్తి అవుతుందని ఎన్‌జీపీడీటీ గ్లోబల్ వ్యవస్థాపకులు డాక్టర్ స్కాట్ వాటర్స్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. వృత్తి నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్యులతో కలిసి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశామన్నారు. క్యాన్సర్ రోగులకు చేసే కీమో థెరపీతో క్యాన్సర్ కణాలతోపాటు మంచి కణాలు కూడా చనిపోతాయి. దీంతో రోగి ఎక్కువ కాలం బతకలేరని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఎన్‌జీపీడీటీ విధానంలో క్యాన్సర్ కణాలే చనిపోతాయని తెలిపారు.
అతి తక్కువ ఖర్చుతో..
అమెరికా వంటి దేశాల్లో స్టేజ్-4 క్యాన్సర్ రోగులు చికిత్సకు రూ.1 కోటి వరకు ఖర్చు చేయాల్సిందే. ఎన్‌జీపీడీటీ విధానంలో రూ.20 లక్షలు మాత్రమే వ్యయం అవుతుందని ఎన్‌జీపీడీటీ గ్లోబల్ కంపెనీ ఆసియా భాగస్వామి సుధీర్‌కుమార్ పూదోట (జాన్) వెల్లడించారు. భారత్‌లో చార్జీలు ఇంకా తగ్గుతాయని చెప్పారు. చైనాలో ఎన్‌జీపీడీటీ పద్ధతిలో 1,000కిపైగా రోగులకు విజయవంతంగా చికిత్స పూర్తి అయిందన్నారు. తొలుత హైదరాబాద్‌లో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ పద్ధతిని పరిచయం చేస్తామని వెల్లడించారు. ఆసుపత్రులతో కలిసి పనిచేస్తామన్నారు. నిపుణులైన వైద్యులు ఎవరైనా తమ సంస్థ వద్ధ శిక్షణ తీసుకుని చికిత్స అందించొచ్చని చెప్పారు.
ఇదీ చికిత్స పద్ధతి..
రోగికి ద్రావణం రూపంలో ఔషధాన్ని ఇస్తారు. ఈ ద్రావణం క్యాన్సర్ కణాలకు అతుక్కుపోతుంది. స్కానర్ ద్వారా పరీక్షిస్తే ఈ కణాలు మెరుస్తుంటాయి. కణం ఏ స్థాయిలో ఉందో గుర్తించి లేజర్ ద్వారా చంపుతారు. చికిత్స కాలం స్టేజ్-1 రోగులకు 8 రోజులు, స్టేజ్-4 రోగులకు 8 వారాలు మాత్రమే. ప్రతిసారి ఒక గంట మాత్రమే క్లినిక్‌లో ఉంటే చాలు. ఎన్‌జీపీడీటీ టెక్నాలజీ కోసం చైనాలో పలు ఆసుపత్రులు దరఖాస్తు చేసుకున్నాయని కంపెనీ ప్రతినిధి కిరణ్ తనమల వెల్లడించారు.