Pick packets
-
ఒంటరి ప్రయాణికులే టార్గెట్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద అర్ధరాత్రి వేళ కాపుకాసి... బస్సులు, రైళ్లు దిగి ఇళ్లకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్న ఒంటరి ప్రయాణికులను టార్గెట్‌గా చేసుకుని... ఆటోల్లో ఎక్కించుకుని పిక్‌పాకెటింగ్‌లకు పాల్పడుతున్న వ్యవస్థీకృత ముఠాకు ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. చోరులు, రిసీవర్‌తో సహా మొత్తం నలుగురిని పట్టుకున్నామని, వీరి నుంచి ఫోన్లతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు గతంలో పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సెమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. వృత్తి పాన్‌షాప్... ప్రవృత్తి నేరాలు... రెయిన్‌బజార్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇబ్రహీం హుస్సేన్ అలియాస్ సజ్జు ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. స్థానికంగా పాన్‌షాపు నిర్వహించే అతను వ్యసనాలకు బానిసై తేలిగ్గా డబ్బు సంపాదించేందుకుగాను 2015 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు. 10 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిపై 2018లో సిటీ పోలీసులు పీడీ యాక్ట్ ప్రమోగించారు. యాకత్‌పురకు చెందిన మహ్మద్ షరీఫ్ 2009 నుంచి పిక్‌పాకెటింగ్‌లకు పాల్పడుతన్నాడు. ఇతడిపై ఇప్పటి వరకు 12 కేసులు నమోదు కావడంతో 2015లో సిటీ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. వీరిద్దరికీ తన ఆటోతో రావడం ద్వారా సహకరిస్తున్న సయ్యద్ గయాజ్ హష్మిపై నాలుగు కేసులు ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 12న జైలు నుంచి విడుదలైన ఇబ్రహీం మిగిలిన ఇద్దరితో కలిసి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు. డిన్నర్ చేసి ఆటోలో... వీరు ముగ్గురు సాధారణంగా రాత్రి తమ తమ ఇళ్లల్లోనే భోజనం చేసి బయటికి వస్తారు. గయాజ్ ఆటో నడుపుతుండగా... మిగిలిన ఇద్దరూ ప్యాసింజర్ల మాదిరిగా వెనుక కూర్చుంటారు. ముగ్గురూ కలిసి సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లోని సీబీఎస్, ఎంజీబీఎస్ తదితర ప్రధాన బస్టాండులతో పాటు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ల వద్ద కాపుకాసేవారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటరిగా దిగే ప్రయాణికుల వద్దకు వెళ్లి అతడు వెళ్లాల్సిన మార్గంలోనే ఆటో వెళ్తోందని నమ్మించడంతో పాటు తక్కువ రేటుకే అంటూ ఆకర్షించి ఎక్కించుకుంటారు. ఇబ్రహీం, షరీఫ్‌లకు మధ్యలో సదరు ప్యాసింజర్ కూర్చునేలా చేస్తారు. ఆపై ఒకరు మాట్లాడుతుంటే మరొకరు అదును చూసుకుని అతడి జేబులోని సెల్‌ఫోన్ లేదా పర్సు తస్కరిస్తారు. ఈ విషయం అతడు గమనించడానికి ముందే ఏదో ఒక కారణం చెప్పి ఆటో దింపేసి ఉడాయిస్తారు. ఎనిమిది ఠాణాల పరిధిలో 11 నేరాలు గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పంథాలో రెచ్చిపోయిన ఇబ్రహీం గ్యాంగ్‌పై నగరంలోని ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో 11 కేసులు నమోదయ్యాయి. బేగంబజార్, బేగంపేట, మొఘల్‌పుర, సంతోష్‌నగర్, సుల్తాన్‌బజార్, చార్మినార్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠాణాల పరిధుల్లో ఇవి రిజిస్టర్ అయ్యాయి. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్‌లతో కూడిన బృందం రంగంలోకి దిగింది. సోమవారం నిందితులు ముగ్గురితో పాటు వీరి నుంచి చోరీ సెల్ఫోన్లను ఖరీదు చేసి, మొబైల్ షాపులకు విక్రయిస్తున్న గౌలిపుర వాసి సయ్యద్ రషీద్ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.54,500 నగదు, 19 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా దృష్టి మళ్లించి పిక్ ప్యాకెటింగ్లకు పాల్పడే ముఠాలు నగరంలో మరికొన్ని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
బ్లేడ్‌బాబ్జీ.. ఈ దొంగోడు.. చో'రిచ్'
అతని పేరు థానేదార్‌సింగ్ కుశ్వ అలియాస్ రాజు (33). చందానగర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఫ్లాట్‌లో జీవనం. నెలకు రూ.30 వేలు అద్దె. ఇద్దరు పిల్లలకు రూ.లక్షలు ఫీజు చెల్లించి ఇంటర్నేషనల్ స్కూళ్లలో విద్యాభ్యాసం. భార్యకు కిలోకు పైన బంగారు ఆభరణాలు. లెక్కలేనన్ని ఆస్తులు. ఇంతకీ ఈ థానేదార్‌సింగ్ కుశ్వ వృత్తి..ప్రవృత్తి ఏంటో తెలుసా. దొంగతనాలు(పిక్‌పాకెటర్). అవును మీరు చదువుతున్నది నిజమే. రైళ్లలో రాత్రి వేళల్లో మాత్రమే కూల్‌గా బ్లేడునే ఆయుధంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కుశ్వ ఇప్పటికి 400 నేరాలకు పాల్పడి రూ.కోట్లు మూటగట్టుకున్నాడు. సట్టా జూదం, క్రికెట్ బెట్టింగ్‌ల్లోనూ పాల్గొన్నాడు. చోరీ సొమ్ముతో జల్సా జీవితం గడుపుతున్నాడు. ఇటీవల తనకు తానే ఓ ఘటనలో ఇరుక్కుని బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పోలీసులకు చిక్కాడు. అతని నేర చరిత్ర..విలాసవంతమైన జీవనం గురించి తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడి నుంచి రూ.13 లక్షల నగదు, 668 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్: బ్లేడ్‌ను ఆయుధంగా చేసుకుని రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ రూ.కోట్లు కూడగట్టుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఓ ఘరానా చోరుడిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. కూల్‌గా చోరీలు చేస్తూ..ఎవరికీ అనుమానం రాకుండా గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్న ఇతడి చరిత్రను తెలుసుకున్న పోలీసులే అవాక్కయ్యారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ డాక్టర్ అనురాధ వివరాలు వెల్లడించారు యూపీ నుంచి వచ్చి... ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, అలీఘడ్ జిల్లా, అర్ణి గ్రామానికి చెందిన థానేదార్‌సింగ్ కుశ్వ అలియాస్ రాజు (33) చిన్నతనం నుంచే నేరాలకు అలవాటు పడ్డాడు. 2004లో అతను బతుకుదెరువు నిమిత్తం తన స్నేహితుడు రామ్ స్వరూప్‌తో కలిసి పూణే వెళ్లాడు. మొదట్లో రైల్వే ఫ్లాట్‌ఫాంలపై స్వీట్లు, తదితర వస్తువులు విక్రయించేవాడు. ఆ తర్వాత అదే ప్రాంతంలో సిగరెట్లు, తంబాకు విక్రయానికి శ్రీకారం చుట్టాడు. ఈ నేపథ్యంలో పలువురు దొంగలు పిక్ప్యాకెటింగ్లు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతుండటాన్ని గుర్తించిన కుశ్వ వాటి పట్ల ఆకర్శితుడయ్యాడు. అయితే అప్పటికే విలాసవంతమైన జీవితం గడపాలని భావిస్తున్న కుశ్వ రైళ్లలో చోరీకి పాల్పడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో 2006లో పూణే నుంచి సికింద్రాబాద్ వస్తుండగా రైల్లో వికారాబాద్‌కు చెందిన పిక్‌పాకెటర్ చంద్రకాంత్‌తో పరిచయం ఏర్పడింది. చంద్రకాంత్ బ్లేడ్‌తో జేబులను కత్తిరించడంలో సిద్ధహస్తుడు. అతడి శిక్షణలో రాటుదేలిన కుశ్వ అప్పటి నుంచి రైళ్లల్లో ప్రయాణిస్తూ పిక్పాకెటింగ్లు, చైన్‌స్నాచింగ్‌లకు తెగబడుతున్నాడు. ఈ క్రమంలో 2007లో బంజారాహిల్స్‌లోని ఓ లాడ్జిలో బస చేసి ఉండగా అదే సమయంలో తనిఖీలకు వెళ్లిన పోలీసులపై దాడి చేసి పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 15 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న అతను జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం వికారాబాద్ వెళ్లి చంద్రకాంత్ గ్యాంగ్‌తో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్న కుశ్వకు అరుణ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఓ ముఠాగా ఏర్పడి నేరాలకు పాల్పడేవారు. కొద్ది మొత్తం సంపాదించిన అనంతరం తన స్వగ్రామానికి వెళ్లిన అతను ఆగ్రాలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. 2009లో వివాహం చేసుకున్న అనంతరం మళ్లీ నగరానికి తిరిగివచ్చాడు. అయితే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో సట్టా, బెట్టింగ్‌లకు పాల్పడేవాడు. నైట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లే టార్గెట్... నగరంలోని మూడు ప్రధాన రైల్వేస్టేషన్లను అడ్డాలుగా మార్చుకున్న థానేదార్‌సింగ్ కుశ్వ అలియాస్ రాజు రాత్రి వేళల్లో వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లను టార్గెట్ చేసుకునేవాడు. రైలులోని అన్ని బోగీల్లో కలియదిరుగుతూ ప్రయాణికులను ముందే టార్గెట్ చేసుకునేవాడు. అర్థరాత్రి దాటాక వారు ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో తనపని పూర్తి చేసుకుని ఆ తరువాతి స్టేషన్లో దిగిపోయేవాడు. యూపీ, మహారాష్ట్ర పోలీసులు గతంలో అతడిని అరెస్టు చేసి ఎరవాడ జైలుకు తరలించారు. కాగా ఉగ్రవాది కసబ్‌ను ఉరితీసిన సమయంలో కుశ్వ కూడా అదే జైలులో ఉండటం గమనార్హం. అక్కడి నుంచి విడులైన తర్వాత ఆగ్రాకు మకాం మార్చిన అతను క్రికెట్ బుకీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. 2014లో భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన అతను చందానగర్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అదే సమయంలో తన గ్యాంగ్‌తో కలిసి దొంగతనం చేసే క్రమంలో ఔరంగాబాద్ పోలీసులపై బ్లేడ్‌తో దాడి చేసి అక్కడినుంచి పరారై నేరుగా ఆగ్రా చేరుకున్నాడు. అప్పటి నుంచి పలు నేరాలకు పాల్పడిన కుశ్వ సోమవారం తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు. 400 పైగా నేరాలు... ఇప్పటి వరకు 400పైగా నేరాలకు పాల్పడినట్లు థానేదార్‌సింగ్ కుశ్వ పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ నేరాలన్నీ కేవలం రైళ్లలో చేసినవే కావడం గమనార్హం. ఆయా చోరీల్లో నిందితుడు రూ.2 కోట్ల వరకు నగదు, ఆభరణాలు దొంగిలించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతడి నుంచి రూ.13 లక్షల నగదు, 668 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సట్టా... బెట్టింగులు.... చోరీల ద్వారా పెద్దమొత్తంలో డబ్బు కూడగట్టుకున్న థానేదార్‌సింగ్ కుశ్వ రూ. లక్షలు సట్టా ఆటకు, క్రికెట్ బెట్టింగ్‌లకు వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది. ఇటీవలే అతను ఎనిమిది మంది క్రికెట్ బుకీలకు రూ. 17 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. తన భార్యకు సంబందించిన కిలో బంగారు ఆభరణాలు ఆగ్రాలోని ఒక వ్యాపారి వద్ద ఉంచినట్లు వెల్లడైంది. పట్టుబడిందిలా.. నవంబర్ 26న బేగంపేట రైల్వేస్టేషన్ సమీపంలో నిలుచున్న థానేదార్‌సింగ్ కుశ్వపై అనుమానంతో ఆర్పీఎఫ్ పోలీసులు అతడిని పట్టుకునేందుకు వెళ్లగా ఓ కానిస్టేబుల్‌పై బ్లేడ్‌తో దాడిచేసిన కుశ్వ బైక్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడటంతో ఎడమచేయి ఎముక విరిగింది. నెల రోజులుగా రైల్వేస్టేషన్ సమీపంలో వదిలేసిన బైక్‌ను అక్కడే ఉంచిన పోలీసులు నిఘావేసి ఉంచారు. ఇటీవల కోలుకున్న కుశ్వ ఈ నెల 23న మరోవ్యక్తి సహాయంతో బైక్ తీసుకెళ్లేందుకు బేగంపేట రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. ఈ క్రమంలో కుశ్వ పోలీసులకు పట్టుబడగా, సహాయకుడిగా వచ్చిన మరో వ్యక్తి పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా సదరు హోండా యాక్టివా కూడా దొంగిలించిన వాహనంగానే పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పీడీ యాక్టు నమోదు.. నిందితుడి పేరిట పలు ఆస్తులు ఉన్నాయని, వివిధ రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లు ఎస్పీ డాక్టర్ అనురాధ తెలిపారు. అతడిపై పీడీ యాక్టు ప్రయోగిస్తున్నామని త్వరలో కస్టడీకి తీసుకుని పూర్తి వివరాలు రాబడతామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పెద్దమొత్తంలో రికవరీ చేసిన జీఆర్పీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, కే.ఆదిరెడ్డి, వెంకటరాములు , ఎస్ఐ బి.ప్రమోద్కుమార్లను రైల్వే పోలీస్ అధికారులు అభినందించారు. సమావేశంలో ఆర్పీఎఫ్ చీఫ్ సెక్యురిటీ కమిషనర్ ఆర్.రామకృష్ణ, రైల్వే డీఎస్పీలు ఎస్.రాజేంద్రప్రసాద్, ఎం.శ్రీనివాస్‌రావు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బాణయ్య పాల్గొన్నారు. విలాసవంతమైన జీవితం.... నిందితుడు థానేదార్‌సింగ్ కుశ్వకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందానగర్‌లోని గేటెడ్ కమ్యునిటీలోని విలాసవంతమైన మై హోం జెవెల్ అపార్ట్మెంట్లో ఉంటున్న ఇతను సదరు ఫ్లాట్‌కు నెలకు రూ.30 వేలు అద్దె చెల్లిస్తున్నాడు. తన కుమార్తె, కుమారుడిని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు. ఇందుకుగాను రూ. లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నాడు. -
ఆడి... షాను! నేరగాళ్లకు పరిభాషక పేర్లు
సాక్షి, సిటీబ్యూరో: రద్దీగా ఉన్న బహిరంగ ప్రదేశాలతో పాటు భారీ సభలు, ర్యాలీలతో పాటు కిటకిటలాడుతున్న బస్సుల్ని టార్గెట్‌గా చేసుకుని చేతివాటం చూపిస్తున్న ఇద్దరు ఘరానా నేరగాళ్లను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరు నేరం చేసేప్పుడు ‘పోషించే పాత్రలకు’ ప్రత్యేక పరిభాషక పదాలు సైతం ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. వీరిద్దరిపై ఇప్పటికే పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. టోలిచౌకీ, మిరాజ్ కాలనీకి చెందిన మహ్మద్ రిజ్వాన్ అలియాస్ కైలాష్ ప్రస్తుతం మాన్గార్బస్తీలో ఉంటూ బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆసిఫ్‌నగర్‌లోని జిర్రా ప్రాంతానికి చెందిన వాటర్ బాటిల్స్ సప్లయర్ మహ్మద్ రిజ్వాన్ అలియాస్ వీరుతో ఇతడికి చిన్ననాటి స్నేహితుడు. వ్యసనాలకు బానిసలైన వీరు గతంలో ఎవరికి వారుగా పిక్ పాకెటింగ్ నేరాలకు పాల్పడేవారు. ఈ నేపథ్యంలోనే కైలాష్‌పై లంగర్‌హౌస్, చార్మినార్, ఉప్పల్, హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్లలో, వీరుపై లంగర్‌హౌస్, బేగంబజార్, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, ఉప్పల్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. వీరు పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు. వీరు నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించగా 2016 జూలై 21 నుంచి ఏడాది పాటు జైల్లో ఉండి బయటికి వచ్చాడు. కొన్నాళ్ల క్రితం జట్టు కట్టిన వీరిద్దరూ కలిసి పిక్పాకెటింగ్స్, చైన్ కటింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ ప్రధానంగా జనసమర్థం ఎక్కువగా ఉన్న బహిరంగ ప్రదేశాలతో పాటు భారీ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు జరిగే ప్రాంతాలతో పాటు రద్దీ బస్సులను ఎంచుకునేవారు. ఓ వ్యక్తిని టార్గెట్‌గా చేసుకున్న అనంతరం అతడి వద్దకు వెళ్లి అటు ఇటు కదులుతూ హడావుడి చేసి దృష్టి మళ్లిస్తారు. ఇతడిని పరిభాషికంగా ‘ఆడి’గా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే అదును చూసుకునే కైలాష్ ఆ వ్యక్తి మెడలో ఉన్న బంగారు గొలుసుని తన పంటితో కత్తిరించేసి తస్కరిస్తాడు. ఇలా చేసే ఇతడిని షాను అని పిలుస్తుంటారు. తమ ‘పని’ పూర్తయిన వెంటనే ఇద్దరూ క్షణం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి ఉడాయిస్తాయి. ఇదే తరహాలో నేరం చేస్తూ గతంలో ఉప్పల్, హబీబ్‌నగర్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత తమ పంథా మార్చుకోకుండా ఇద్దరూ కలిసి మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్, బంజారాహిల్స్, మార్కెట్ ఠాణాల పరిధిలో ఏడు నేరాలకు పాల్పడ్డారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, మహ్మద్ ముజఫర్ అలీ, ఎన్.రంజిత్‌కుమార్ వలపన్ని సోమ వారం పట్టుకున్నారు. వీరి నుంచి 14.4 తులాల బంగా రం తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. -
పునరావాసం లేకే పునరావృతం
సాక్షి, సిటీబ్యూరో: మాన్గార్‌బస్తీ... ఈ పేరు వింటే పోలీసులు సైతం ఉలిక్కిపడతారు. చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్, దోపిడీ, దొంగతనాలు చేసే నేరగాళ్లకు ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్. ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా, చివరకు పీడీ యాక్ట్‌లు ప్రయోగించినా వీరిలో మార్పు రాలేదు. ఆ ప్రాంతంలో రైడింగ్‌కు వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చిన పోలీసులూ ఉండరు. వీరిలో మార్పు తీసుకురావడానికి హబీబ్‌నగర్ పోలీసులు అహర్నిశలు కృషి చేశారు. అయితే ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో వారు మళ్లీ నేరబాటపట్టారు. ఉప్పల్ స్టేడియం కేంద్రంగా చేతివాటం చూపిస్తున్న ముఠాను ఇటీవల రాచకొండ సీసీఎస్ పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. ఎనిమిది గ్యాంగులు...25 మంది సభ్యులు... మహారాష్ట్రకు చెందిన మాన్గరోడి కులానికి చెందిన వారు గండిపేట చెరువు నిర్మాణం సమయంలో నగరానికి వలస వచ్చారు. ఆపై హబీబ్‌నగర్ పరిధిలో స్థిరపడిపోవడంతో అది మాన్గార్బస్తీగా మారిపోయింది. కొన్నాళ్లకు వీరు నేరగాళ్ళుగా మారిపోయి గ్రేటర్ పరిధిలో పంజా విసరడం మొదలెట్టారు. ఏటా వందల సంఖ్యలో నేరాలు చేçస్తూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. దీంతో గత ఏడాది వీరిలో మార్పు తీసుకురావాలని హబీబ్‌నగర్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఎనిమిది ప్రధాన గ్యాంగుల్ని గుర్తించిన పోలీసులు వాటినే ‘టార్గెట్’గా చేసుకున్నారు. వివిధ నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న వీటిలోని 25 మంది సభ్యులను సన్మార్గంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు. ఫలితంగా ఆ 25 మందీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరు అప్పటికే సిటీలోని 32 ఠాణాల పరిధిలో నమోదైన 200 కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లివచ్చారు. వివిధ పోలీసుస్టేషన్లలో 106 నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 194 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారు. ఒక్కొ క్కరి పైగా పదుల సంఖ్యలోనే కేసులు ఉన్నాయి. వీటిలో జేబు దొంగతనాల నుంచి దోపిడీల వరకు వివిధ నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. వీలున్నంత వరకు వీటిని క్లియర్ అయ్యేలా హబీబ్‌నగర్ పోలీసులు ప్రయత్నించారు. ఇందుకు గాను ఈ ఠాణా మాజీ ఇన్స్పెక్టర్ పరవస్తు మధుకర్‌స్వామి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. శిక్షణ ఇప్పించినప్పటికీ... ‘మాన్గార్’ నేరగాళ్లలో మార్పు తీసుకురావడం, పోలీసులకు లొంగిపోయేలా చేయడం ఒక ఎత్తయితే... వారు మళ్లీ పాతబాట పట్టకుండా చూడటం మరో ఎత్తని మధుకర్‌స్వామి భావించారు. ఇందుకుగాను వారికి మరో జీవనాధారం చూపించాలని ప్రయత్నించారు. అయితే కేవలం నేరాలు చేయడం మాత్రమే తెలిసిన మాన్గార్‌బస్తీ వాసులకు ఏ ఇతర స్కిల్ లేవు. ఎక్కడైనా చిన్నాచితక పనులు ఇప్పిద్దామని ప్రయత్నించినా వీరి ప్రవర్తన, గత చరిత్ర తెలిసిన వారు దగ్గరకు రానీయలేదు. వీటిని దృష్టిలో పెట్టుకున్న ఆయన విడతల వారీగా వారికి చిలుకూరులోని ఆర్ఎస్ఈటీఐలో వృత్తి విద్యా శిక్షణ ఇప్పించారు. వైద్య శిబిరాల నిర్వహణతో పాటు యోగ, ధ్యానం, ప్రాథమిక విద్యలతో పాటు కారు డ్రైవింగ్, బేసిక్ మెకానిజం నేర్పించారు. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురైనా మళ్లీ నేరబాట పట్టకుండా ఉండేలా వీరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ క్లాసులు ఏర్పాటు చేయించారు. తమ పేరు, కుటుంబీకుల పేర్లు ఇంగ్లీషులో రాయడం, సంతకం చేయడంతో పాటు క్యాబ్ డ్రైవర్లుగా మారితే జీపీఎస్ పరిజ్ఞానం వినియోగించడాన్నీ నేర్పారు. బస్తీ మహిళల కోసం ఫుడ్ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి మాన్గార్బస్తీలోని కమ్యూనిటీ హాల్లోనే శిబిరం ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నాలు సైతం చేశారు. ప్రభుత్వ విభాగాలు స్పందించకపోవడంతో... పోలీసుల సహకారంతో డ్రైవింగ్‌లో పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు దొరికే ఆస్కారం లేదు. దీంతో అనివార్యంగా కొందరు క్యాబ్ డ్రైవర్లుగా మారాల్సి వచ్చింది. మాన్గార్బస్తీకి చెందిన వీరంతా మహారాష్ట్ర నుంచి వలసవచ్చారు. అక్కడ వీరిని ఎస్సీలుగా పరిగణిస్తూ ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని సేకరించిన పోలీసులు రెవెన్యూ అధికారుల సాయం తో అందరికీ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయించడానికి ప్రయత్నించారు. ఇలా చేస్తే ఆ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇప్పించి జీవనోపాధి కల్పించవచ్చని భావించారు. అయితే ఓ పక్క ఈ కులధ్రువీకణ పత్రాలు జారీ, మరోపక్క ప్రభుత్వ విభాగాల స్పందన సైతం అంతంత మాత్రంగానే ఉండటంతో సన్మార్గం పట్టిన వారు సైతం పునరావాసం లేక కనీస అవసరాల కోసం అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ లోగా ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి సైతం బదిలీ కావడంతో ‘మార్పు కార్యక్రమాలూ’ మూలనపడ్డాయి. దీంతో కొత్త జీవితాలపై ఆశ కోల్పోయిన మాన్గార్‌బస్తీ వాసులు మళ్లీ పాతబాటే పట్టారు. ఈ నేపథ్యంలోనే జుబ్బా ఆకాష్ గ్యాంగ్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం కేంద్రంగా నేరాలు చూస్తూ రాచకొండ సీసీఎస్‌కు చిక్కి జైలుకు వెళ్ళింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పోలీసు విభాగంతో కలిసి పని చేయకపోతే మాన్గార్‌బస్తీ మార్పునకు ఆమడదూరంలో ఉండిపోతుంది. -
ఫైనల్ మ్యాచ్ రోజూ రెచ్చిపోయిన పిక్పాకెటర్లు..
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్‌ల్లో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగింది. మే 12న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్‌లో తారాస్థాయికి చేరింది. మార్చి 29 నుంచి మే 12 వరకు ఉప్పల్ స్టేడియం వేదికగా సాగిన మ్యాచ్‌లకు టికెట్లను బ్లాక్‌లో అమ్మిన 93 మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 304 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. మ్యాచ్‌లు వీక్షించేందుకు వచ్చిన యు వతులను వేధిస్తున్న ఐదుగురు ఈవ్‌టీజర్లను మఫ్టీలో ఉన్న రాచకొండ షీ బృందాలు పట్టుకున్నాయి. అలాగే క్రికెట్ అభిమానుల నుంచి డబ్బులు, బంగారు ఆభరణాలు కొట్టేసిన ఐదు గురు దొంగలను కూడా అదుపులోకి తీసుకున్నా రు. మద్యం తాగి ఇతరులకు ఇబ్బందులు కలిగించిన న్యూసెన్స్ కేసులు కూడా పరిమిత సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒకరి అక్రిడేషన్ కార్డును మరొకరు వాడిన కేసులో ఒకరిపై 420 కేసు కూడా నమోదైనట్లు తెలిపారు. మొత్తంగా ఈ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 116 కేసులు నమోదయ్యాయన్నారు. అయితే ఆయా పెట్టీ కేసులు మినహా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేదని, భద్రతపరంగా పోలీసులు బాగా పనిచేశారని రాచకొండ పోలీ సు ఉన్నతాధికారి పేర్కొన్నారు. వాహనదారుల కు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, క్రికెట్ అభిమానుల కోసం ఆర్టీసీ, మెట్రోలు ప్రత్యేక సేవలు అందించడంతో ఎవరి ఇళ్లకు వారు సక్రమంగా చేరుకోగలిగారన్నారు. -
ఐపీఎల్ మ్యాచ్ కోసం ఉప్పల్ వెళ్తున్నారా..?
ఉప్పల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను టార్గెట్‌గా చేసుకుని క్రీడాభిమానుల జేబులను కొల్లగొడుతున్న పిక్పాకెటర్లను సీసీఎస్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, క్రైం అడిషనల్ డీసీపీ సలీమా, ఏసీపీ సందీప్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. గత నెల 29న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పోలీసులు క్రికెట్ స్టేడియం లోపల, బయట దాదాపుగా 300 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించి వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. వారిని ఘరానా పిక్ పాకెటర్స్‌గా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలు అంగీకరించారు. మహారాష్ట్రకు హత్‌వలీ రవి మల్లెపల్లిలోని మణిగిరి బస్తీలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. చిన్నతనం నుంచే పిక్‌పాకెటింగ్‌కు అలవాటు పడిన అతడిపై పలు పోలీస్‌స్టేషన్ పరిధిలో 16 కేసులు ఉన్నాయి. పలుమార్లు జువైనల్ హోమ్‌కు వెళ్లి వచ్చాడు. స్కూటర్ మెకానిక్‌గా పని చేస్తున్న ఇదే ప్రాంతానికి చెందిన కాంబ్లే ఆకాష్‌పై వివిధ పోలీస్స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరు కాంబ్లే కిరణ్, హత్‌వలీ కిరణ్, కాంబ్లే లక్ష్మణ్‌తో కలిసి ముఠాగా ఏర్పడి పర్సులు, బంగారు గొలుసుల చోరీకి పాల్పడుతున్నారు. చోరీ సొత్తును మల్లెపల్లికి చెందిన బొల్లెపల్లి హారతికి విక్రయించేవారు. వీరి నుంచి రూ.5.78,000 నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా బొల్లెపల్లి హారతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సీసీఎస్ మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ లింగయ్య, జగన్నాధంరెడ్డి, ఇన్స్పెక్టర్లు శివశంకర్‌రావు, శ్రీదర్‌రెడ్డి, రవిబాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మూడు రోజుల్లో పట్టేశారు..!
సాక్షి, సిటీబ్యూరో: కంటికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడికి శస్త్ర చికిత్స చేయించేందుకు నగరానికి వచ్చిన ఓ ఆఫ్ఘానీ జేబులో డబ్బు కొట్టేశాడో పిక్ పాకెటర్. మరో వారంలో ఆపరేషన్ ఉండగా ఉన్న డబ్బంతా పోవడంతో లబోదిబోమంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ డబ్బు దొరక్కపోతే తన కుమారుడికి జీవితంలో ఆపరేషన్ చేయించలేనని ప్రాధేయపడ్డాడు. ఇతడి పరిస్థితిని గమనించిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసుకు కీలక ప్రాధాన్యం ఇస్తూ దర్యాప్తు చేశారు. ఫలితంగా మూడు రోజుల్లో దొంగను పట్టుకోవడంతో పాటు మొత్తం నగదు రికవరీ సాధ్యమైందని అదనపు డీసీపీ చైతన్యకుమార్ సోమవారం తెలిపారు. కుమారుడి కోసం అప్పులు చేసి... ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫరాష్థ్ హర్సా జిల్లా, సమన్గమ్ గ్రామానికి చెందిన సయ్యద్ మీర్వాస్ రహేమి ఓ చిన్న రైతు. అతడి ఆరేళ్ల కుమారుడికి కంటికి సంబంధించిన వ్యాధి వచ్చింది. అక్కడ వైద్యం చేయించడం సాధ్యం కాకపోవడంతో గత నెల 29న నగరానికి వచ్చాడు. వైద్య ఖర్చుల కోసం అప్పులు చేసి డబ్బు తెచ్చుకున్నాడు. బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో సోమ వారం శస్త్ర చికిత్స నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా గత శుక్రవారం ప్రార్థనల నిమిత్తం అతను పాతబస్తీలోని మక్కా మసీదుకు వెళ్లాడు. అనంతరం బయటకు వచ్చే సమయంలో తన కుర్తా జేబు ఖాళీగా ఉండటాన్ని గుర్తించాడు. కుమారుడి వైద్యం కోసం తీసు కువచ్చిన డబ్బు ఎవరో కొట్టేయడంతో లబోదిబోమంటూ హుస్సేనిఆలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఫీడ్ అధ్యయనంతో... మక్కా మసీదులో రహేమికి చెందిన 1400 అమెరికా డాలర్లు, 5 వేల ఆఫ్ఘానీ కరెన్సీ చోరుల పాలు కావడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇన్స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్‌వర్మ, మహ్మద్ తఖీవుద్దీన్, వి.నరేందర్ ప్రాథమికంగా మసీదుకు చుట్టూ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో గేటు ఎదురుగా ఉన్న కెమెరాలో పాత నేరగాడైన మీర్జా రెహ్మత్ బేగ్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. గతంలో చంద్రాయణగుట్ట, బేగంబజార్ ఠాణాల్లో జేబు దొంగతనాలకు పాల్పడిన మీర్జాను సోమ వారం అదుపులోకి తీసుకున్నారు. విదేశీ కరెన్సీలు మార్చుకోవడం అతడికి సాధ్యం కాకపోవడంతో ఆ మొత్తాన్ని యథాతథంగా రికవరీ చేశారు. నిందితుడిని హుస్సేనిఆలం అధికారులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న రహేమి హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త బైకులంటే సరదా... వట్టేపల్లికి చెందిన మీర్జా (20) నాలుగేళ్ల క్రితం ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి ఏటా పరీక్ష రాస్తూనే ఉన్నాడు. ఇతగాడికి కొత్త, హైఎండ్ బైకులంటే మహా మక్కువ. దీంతో పాటు అనునిత్యం హుక్కా పార్లర్స్‌లో ఎంజాయ్ చేయడం, తన గర్ల్‌ఫ్రెండ్‌తో (ఇటీవలే వివాహం చేసుకున్నాడు) కలిసి షికార్లు చేయడానికి ఇష్టపడేవాడు. అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇందుకు సహకరించకపోవడంతో జేబు దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. గతంలో కొన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చినా ఇతడిలో మార్పు రాలేదు. హుస్సేనిఆలం డిటెక్టివ్ సబ్–ఇన్స్పెక్టర్ ప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘కుమారుడి వైద్యం కోసం నగరానికి వచ్చిన ఓ విదేశీయుడు బాధితుడిగా ఉండటంతో కేసుకు ప్రాధాన్యం ఇచ్చాం. రహేమి కుమారుడికి సోమవారం జరగాల్సిన ఆపరేషన్ వాయిదా పడింది. అతడి డబ్బు మొత్తం దొరికినప్పటికీ న్యాయస్థానం ద్వారానే అప్పగించాల్సి ఉంటుంది. వీలైనంత త్వరలో అది పూర్తి చేసి ఆయన కుమారుడికి శస్త్రచికిత్స జరిగేలా చూస్తాం’ అన్నారు. -
పర్సులు వదిలి సెల్ఫోన్ల వైపు!
* పంథా మార్చిన పిక్‌పాకెటింగ్ గ్యాంగ్స్ * నగరంలో ప్రతి నెలా వందల ఫోన్లు చోరీ * కేసు నమోదు కోసమూ బాధితుల అష్టకష్టాలు * హైకోర్టు తీర్పుతో ఊరట లభిస్తుందనే ఆశలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో జేబుదొంగల (పిక్ పాకెటర్స్) పంథా మారింది... ఒకప్పుడు పర్సులను మాత్రమే టార్గెట్ చేసిన వీళ్లు ప్రస్తుతం సెల్ఫోన్లపై పడ్డారు... నెలనెలా వందల సంఖ్యలో సెల్‌ఫోన్ బాధితులు ఉంటున్నారు. రికవరీ మాట పక్కన బెడితే... కేసుల నమోదుకే బాధితులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అయితే, ‘కేసు నమోదు తప్పనిసరి’ అంటూ రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలతో బాధితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్లాస్టిక్ కరెన్సీ ఎఫెక్ట్‌తో... జంట కమిషనరేట్ల పరిధిలోని పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ రద్దీ ప్రాంతాలు, బస్సులు, రైళ్లలో పంజా విసురుతున్నాయి. ఒకప్పుడు ఓ పర్సును చోరీ చేస్తే కనీసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ‘గిట్టుబాటు’ అయ్యేది. అయితే ఇటీవల కాలంలో క్రెడిట్/డెబిట్ కార్డుల వంటి ప్లాస్టిక్ కరెన్సీ వినియోగం పెరిగిపోవడం, పర్సుల్లో డబ్బుకు బదులు ‘కార్డు’లే ఉంటుండటంతో జేబు దొంగలు పర్సుల జోలికి వెళ్లకుండా... సెల్ఫోన్లపై పడ్డారు. చోరీలకు పాత పంథాలనే అనుసరిస్తూ సెల్ఫోన్లు మాయం చేస్తున్నారు. ఫోనంటే వేల రూపాయలే... నగరంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సెల్‌ఫోన్ వినియోగం, వాటి విలువ గణనీయంగా పెరిగిపోయింది. కొన్నేళ్ల క్రితం వరకు ధనికులు మాత్రమే ఖరీదైన సెల్ఫోన్లు వినియోగించేవారు. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర కారణాల నేపథ్యంలో సామాన్యులతో పోటు విద్యార్థులు సైతం కనిష్టంగా రూ.20 వేల ఖరీదైన సెల్‌ఫోన్‌ను చేత్తోపట్టుకు తిరుగుతున్నారు. ఈ కారణంగానే ఓ సెల్‌ఫోన్ చోరీకి గురైందంటే దాని విలువు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ ఉంటోంది. వ్యక్తిగతంగా... వ్యవస్థీకృతంగా... హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో పిక్‌పాకెటింగ్ గ్యాంగ్స్ ఎన్నో ఉన్నాయి. పేరు మోసిప పిక్ పాకెటర్లలోనూ ఎవరికి వారు వ్యక్తిగతంగా నేరాలు చేసే వారితో పాటు కొందరితో ముఠా కట్టి వ్యవస్థీకృతంగా నేరాలు చేయించే లీడర్లూ ఉన్నారు. వీరు చోరీ చేసిన సెల్ఫోన్లలో అత్యధికం స్థానికంగానే చేతులు మారుతుండగా... కొన్ని రాష్ట్రం దాటేస్తున్నట్లూ పోలీసులు గుర్తించారు. చోరీ అయిన సెల్ఫోన్లను గుర్తించి, రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం అత్యంత అరుదైన విషయంగా మారిపోయింది. సెల్‌ఫోన్ చోరీ బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడమూ పెద్ద ప్రహసనమే. పెండింగ్ భయంతోనే అధికం... ఓ బాధితుడు పోలీసులకు ఆశ్రయించి ఎలాంటి ఫిర్యాదు చేసినా దాన్ని జీడీ ఎంట్రీ చేసి... తప్పనిసరిగా సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)లోని 154వ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేయాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం దీనికి న్యాయపరమైన సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పోలీసులు మాత్రం దీన్ని పూర్తిగా అమలు చేయట్లేదు. ముఖ్యంగా జేబు దొంగతనాలు, స్నాచింగ్స్, సెల్‌ఫోన్ చోరీలు, వాహనాల దొంగతనాలకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారం కావని, పెండింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వీటిని చాలా వరకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు. కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతో సరిపెడుతున్నారు. బాధితులకు ఎంతో నష్టం... ఈ జీడీ ఎంట్రీ విధానాల వల్ల బాధితులు ఎంతో నష్టపోతున్నారు. ఇటీవల కాలంలో ఖరీదైన సెల్ఫోన్లకు కచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటోంది. దీన్ని క్లైమ్ చేసుకోవడానికి ఆయా సంస్థలు ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతున్నాయి. పోలీసులు ఇస్తున్న లాస్ట్ రిపోర్ట్ లేదా నాన్-ట్రేస్డ్ సర్టిఫికెట్లు డూప్లికేట్ సిమ్‌కార్డులు తీసుకోవడానికి పూర్తి స్థాయిలో ఉపకరిస్తున్నాయి. అయితే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వీటి ఆధారంగా క్లైమ్స్ అంగీకరించకపోవడం బాధితులకు నష్టాన్ని మిగులుస్తోంది. వాహనచోరీలు వంటి నేరాల్లోనూ బాధితులకు ఇదే ఇబ్బంది ఎదురవుతోంది. ఇకపై ఎఫ్ఐఆర్లు కచ్చితమయ్యేనా? పోలీసులు తమ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం లేదంటూ వి.మహేంద్ర, మరికొందరు హైకోర్టులో పిటిషన్ ఇటీవల దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్‌కుమార్ ప్రత్యేక సందర్భాల్లో మినహా కచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ తీర్పునిచ్చారు. దీంతో బాధితులకు ‘కేసు కష్టాలు’ తీరినట్లేనని నిపుణులు చెప్తున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓ ఫిర్యాదు అందిన తరవాత దాన్ని నమోదు చేయడానికి, చేయకపోవడానికి కారణాలను సైతం స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) స్పష్టం చే యాల్సి ఉంటుంది. బాధితులకు ఎంతో ఊరట కలిగించే ఈ అంశాలతో కూడిన సర్క్యులర్‌ను డీజీపీలు త్వరలో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.