సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద అర్ధరాత్రి వేళ కాపుకాసి... బస్సులు, రైళ్లు దిగి ఇళ్లకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్న ఒంటరి ప్రయాణికులను టార్గెట్‌గా చేసుకుని... ఆటోల్లో ఎక్కించుకుని పిక్‌పాకెటింగ్‌లకు పాల్పడుతున్న వ్యవస్థీకృత ముఠాకు ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. చోరులు, రిసీవర్‌తో సహా మొత్తం నలుగురిని పట్టుకున్నామని, వీరి నుంచి ఫోన్లతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు గతంలో పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సెమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
వృత్తి పాన్‌షాప్... ప్రవృత్తి నేరాలు...
రెయిన్‌బజార్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇబ్రహీం హుస్సేన్ అలియాస్ సజ్జు ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. స్థానికంగా పాన్‌షాపు నిర్వహించే అతను వ్యసనాలకు బానిసై తేలిగ్గా డబ్బు సంపాదించేందుకుగాను 2015 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడు. 10 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిపై 2018లో సిటీ పోలీసులు పీడీ యాక్ట్ ప్రమోగించారు. యాకత్‌పురకు చెందిన మహ్మద్ షరీఫ్ 2009 నుంచి పిక్‌పాకెటింగ్‌లకు పాల్పడుతన్నాడు. ఇతడిపై ఇప్పటి వరకు 12 కేసులు నమోదు కావడంతో 2015లో సిటీ పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. వీరిద్దరికీ తన ఆటోతో రావడం ద్వారా సహకరిస్తున్న సయ్యద్ గయాజ్ హష్మిపై నాలుగు కేసులు ఉన్నాయి. గత ఏడాది ఆగస్టు 12న జైలు నుంచి విడుదలైన ఇబ్రహీం మిగిలిన ఇద్దరితో కలిసి మళ్లీ చోరీలకు పాల్పడుతున్నాడు.
డిన్నర్ చేసి ఆటోలో...
వీరు ముగ్గురు సాధారణంగా రాత్రి తమ తమ ఇళ్లల్లోనే భోజనం చేసి బయటికి వస్తారు. గయాజ్ ఆటో నడుపుతుండగా... మిగిలిన ఇద్దరూ ప్యాసింజర్ల మాదిరిగా వెనుక కూర్చుంటారు. ముగ్గురూ కలిసి సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లోని సీబీఎస్, ఎంజీబీఎస్ తదితర ప్రధాన బస్టాండులతో పాటు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్ల వద్ద కాపుకాసేవారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటరిగా దిగే ప్రయాణికుల వద్దకు వెళ్లి అతడు వెళ్లాల్సిన మార్గంలోనే ఆటో వెళ్తోందని నమ్మించడంతో పాటు తక్కువ రేటుకే అంటూ ఆకర్షించి ఎక్కించుకుంటారు. ఇబ్రహీం, షరీఫ్‌లకు మధ్యలో సదరు ప్యాసింజర్ కూర్చునేలా చేస్తారు. ఆపై ఒకరు మాట్లాడుతుంటే మరొకరు అదును చూసుకుని అతడి జేబులోని సెల్‌ఫోన్ లేదా పర్సు తస్కరిస్తారు. ఈ విషయం అతడు గమనించడానికి ముందే ఏదో ఒక కారణం చెప్పి ఆటో దింపేసి ఉడాయిస్తారు.
ఎనిమిది ఠాణాల పరిధిలో 11 నేరాలు
గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పంథాలో రెచ్చిపోయిన ఇబ్రహీం గ్యాంగ్‌పై నగరంలోని ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో 11 కేసులు నమోదయ్యాయి. బేగంబజార్, బేగంపేట, మొఘల్‌పుర, సంతోష్‌నగర్, సుల్తాన్‌బజార్, చార్మినార్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఠాణాల పరిధుల్లో ఇవి రిజిస్టర్ అయ్యాయి. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్‌రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్‌లతో కూడిన బృందం రంగంలోకి దిగింది. సోమవారం నిందితులు ముగ్గురితో పాటు వీరి నుంచి చోరీ సెల్‌ఫోన్లను ఖరీదు చేసి, మొబైల్ షాపులకు విక్రయిస్తున్న గౌలిపుర వాసి సయ్యద్ రషీద్ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.54,500 నగదు, 19 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా దృష్టి మళ్లించి పిక్ ప్యాకెటింగ్‌లకు పాల్పడే ముఠాలు నగరంలో మరికొన్ని ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment