సాక్షి, సిటీబ్యూరో: కంటికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడికి శస్త్ర చికిత్స చేయించేందుకు నగరానికి వచ్చిన ఓ ఆఫ్ఘానీ జేబులో డబ్బు కొట్టేశాడో పిక్ పాకెటర్. మరో వారంలో ఆపరేషన్ ఉండగా ఉన్న డబ్బంతా పోవడంతో లబోదిబోమంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆ డబ్బు దొరక్కపోతే తన కుమారుడికి జీవితంలో ఆపరేషన్ చేయించలేనని ప్రాధేయపడ్డాడు. ఇతడి పరిస్థితిని గమనించిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసుకు కీలక ప్రాధాన్యం ఇస్తూ దర్యాప్తు చేశారు. ఫలితంగా మూడు రోజుల్లో దొంగను పట్టుకోవడంతో పాటు మొత్తం నగదు రికవరీ సాధ్యమైందని అదనపు డీసీపీ చైతన్యకుమార్ సోమవారం తెలిపారు.
కుమారుడి కోసం అప్పులు చేసి...
ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫరాష్థ్ హర్సా జిల్లా, సమన్‌గమ్ గ్రామానికి చెందిన సయ్యద్ మీర్వాస్ రహేమి ఓ చిన్న రైతు. అతడి ఆరేళ్ల కుమారుడికి కంటికి సంబంధించిన వ్యాధి వచ్చింది. అక్కడ వైద్యం చేయించడం సాధ్యం కాకపోవడంతో గత నెల 29న నగరానికి వచ్చాడు. వైద్య ఖర్చుల కోసం అప్పులు చేసి డబ్బు తెచ్చుకున్నాడు. బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో సోమ వారం శస్త్ర చికిత్స నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా గత శుక్రవారం ప్రార్థనల నిమిత్తం అతను పాతబస్తీలోని మక్కా మసీదుకు వెళ్లాడు. అనంతరం బయటకు వచ్చే సమయంలో తన కుర్తా జేబు ఖాళీగా ఉండటాన్ని గుర్తించాడు. కుమారుడి వైద్యం కోసం తీసు కువచ్చిన డబ్బు ఎవరో కొట్టేయడంతో లబోదిబోమంటూ హుస్సేనిఆలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీ కెమెరాల ఫీడ్ అధ్యయనంతో...
మక్కా మసీదులో రహేమికి చెందిన 1400 అమెరికా డాలర్లు, 5 వేల ఆఫ్ఘానీ కరెన్సీ చోరుల పాలు కావడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇన్‌స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్‌వర్మ, మహ్మద్ తఖీవుద్దీన్, వి.నరేందర్ ప్రాథమికంగా మసీదుకు చుట్టూ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో గేటు ఎదురుగా ఉన్న కెమెరాలో పాత నేరగాడైన మీర్జా రెహ్మత్ బేగ్ కదలికలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. గతంలో చంద్రాయణగుట్ట, బేగంబజార్ ఠాణాల్లో జేబు దొంగతనాలకు పాల్పడిన మీర్జాను సోమ వారం అదుపులోకి తీసుకున్నారు. విదేశీ కరెన్సీలు మార్చుకోవడం అతడికి సాధ్యం కాకపోవడంతో ఆ మొత్తాన్ని యథాతథంగా రికవరీ చేశారు. నిందితుడిని హుస్సేనిఆలం అధికారులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న రహేమి హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
కొత్త బైకులంటే సరదా...
వట్టేపల్లికి చెందిన మీర్జా (20) నాలుగేళ్ల క్రితం ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి ఏటా పరీక్ష రాస్తూనే ఉన్నాడు. ఇతగాడికి కొత్త, హైఎండ్ బైకులంటే మహా మక్కువ. దీంతో పాటు అనునిత్యం హుక్కా పార్లర్స్‌లో ఎంజాయ్ చేయడం, తన గర్ల్‌ఫ్రెండ్‌తో (ఇటీవలే వివాహం చేసుకున్నాడు) కలిసి షికార్లు చేయడానికి ఇష్టపడేవాడు. అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఇందుకు సహకరించకపోవడంతో జేబు దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. గతంలో కొన్నిసార్లు జైలుకు వెళ్లి వచ్చినా ఇతడిలో మార్పు రాలేదు. హుస్సేనిఆలం డిటెక్టివ్ సబ్–ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘కుమారుడి వైద్యం కోసం నగరానికి వచ్చిన ఓ విదేశీయుడు బాధితుడిగా ఉండటంతో కేసుకు ప్రాధాన్యం ఇచ్చాం. రహేమి కుమారుడికి సోమవారం జరగాల్సిన ఆపరేషన్ వాయిదా పడింది. అతడి డబ్బు మొత్తం దొరికినప్పటికీ న్యాయస్థానం ద్వారానే అప్పగించాల్సి ఉంటుంది. వీలైనంత త్వరలో అది పూర్తి చేసి ఆయన కుమారుడికి శస్త్రచికిత్స జరిగేలా చూస్తాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment