పర్సులు వదిలి సెల్‌ఫోన్ల వైపు!
* పంథా మార్చిన పిక్‌పాకెటింగ్ గ్యాంగ్స్
* నగరంలో ప్రతి నెలా వందల ఫోన్లు చోరీ
* కేసు నమోదు కోసమూ బాధితుల అష్టకష్టాలు
* హైకోర్టు తీర్పుతో ఊరట లభిస్తుందనే ఆశలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో జేబుదొంగల (పిక్ పాకెటర్స్) పంథా మారింది... ఒకప్పుడు పర్సులను మాత్రమే టార్గెట్ చేసిన వీళ్లు ప్రస్తుతం సెల్‌ఫోన్లపై పడ్డారు... నెలనెలా వందల సంఖ్యలో సెల్‌ఫోన్ బాధితులు ఉంటున్నారు. రికవరీ మాట పక్కన బెడితే... కేసుల నమోదుకే బాధితులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అయితే, ‘కేసు నమోదు తప్పనిసరి’ అంటూ రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలతో బాధితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ప్లాస్టిక్ కరెన్సీ ఎఫెక్ట్‌తో...
జంట కమిషనరేట్ల పరిధిలోని పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ రద్దీ ప్రాంతాలు, బస్సులు, రైళ్లలో పంజా విసురుతున్నాయి. ఒకప్పుడు ఓ పర్సును చోరీ చేస్తే కనీసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ‘గిట్టుబాటు’ అయ్యేది. అయితే ఇటీవల కాలంలో క్రెడిట్/డెబిట్ కార్డుల వంటి ప్లాస్టిక్ కరెన్సీ వినియోగం పెరిగిపోవడం, పర్సుల్లో డబ్బుకు బదులు ‘కార్డు’లే ఉంటుండటంతో జేబు దొంగలు పర్సుల జోలికి వెళ్లకుండా... సెల్‌ఫోన్లపై పడ్డారు. చోరీలకు పాత పంథాలనే అనుసరిస్తూ సెల్‌ఫోన్లు మాయం చేస్తున్నారు.
ఫోనంటే వేల రూపాయలే...
నగరంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సెల్‌ఫోన్ వినియోగం, వాటి విలువ గణనీయంగా పెరిగిపోయింది. కొన్నేళ్ల క్రితం వరకు ధనికులు మాత్రమే ఖరీదైన సెల్‌ఫోన్లు వినియోగించేవారు. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, ఇతర కారణాల నేపథ్యంలో సామాన్యులతో పోటు విద్యార్థులు సైతం కనిష్టంగా రూ.20 వేల ఖరీదైన సెల్‌ఫోన్‌ను చేత్తోపట్టుకు తిరుగుతున్నారు. ఈ కారణంగానే ఓ సెల్‌ఫోన్ చోరీకి గురైందంటే దాని విలువు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ ఉంటోంది.
వ్యక్తిగతంగా... వ్యవస్థీకృతంగా...
హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో పిక్‌పాకెటింగ్ గ్యాంగ్స్ ఎన్నో ఉన్నాయి. పేరు మోసిప పిక్ పాకెటర్లలోనూ ఎవరికి వారు వ్యక్తిగతంగా నేరాలు చేసే వారితో పాటు కొందరితో ముఠా కట్టి వ్యవస్థీకృతంగా నేరాలు చేయించే లీడర్లూ ఉన్నారు. వీరు చోరీ చేసిన సెల్‌ఫోన్లలో అత్యధికం స్థానికంగానే చేతులు మారుతుండగా... కొన్ని రాష్ట్రం దాటేస్తున్నట్లూ పోలీసులు గుర్తించారు. చోరీ అయిన సెల్‌ఫోన్లను గుర్తించి, రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం అత్యంత అరుదైన విషయంగా మారిపోయింది. సెల్‌ఫోన్ చోరీ బాధితులకు ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకోవడమూ పెద్ద ప్రహసనమే.
పెండింగ్ భయంతోనే అధికం...
ఓ బాధితుడు పోలీసులకు ఆశ్రయించి ఎలాంటి ఫిర్యాదు చేసినా దాన్ని జీడీ ఎంట్రీ చేసి... తప్పనిసరిగా సీఆర్‌పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)లోని 154వ సెక్షన్ ప్రకారం ఎఫ్‌ఐఆర్‌గా రిజిస్టర్ చేయాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం దీనికి న్యాయపరమైన సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పోలీసులు మాత్రం దీన్ని పూర్తిగా అమలు చేయట్లేదు. ముఖ్యంగా జేబు దొంగతనాలు, స్నాచింగ్స్, సెల్‌ఫోన్ చోరీలు, వాహనాల దొంగతనాలకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారం కావని, పెండింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వీటిని చాలా వరకు ఎఫ్‌ఐఆర్ చేయట్లేదు. కేవలం జనరల్ డైరీ (జీడీ) ఎంట్రీతో సరిపెడుతున్నారు.
బాధితులకు ఎంతో నష్టం...
ఈ జీడీ ఎంట్రీ విధానాల వల్ల బాధితులు ఎంతో నష్టపోతున్నారు. ఇటీవల కాలంలో ఖరీదైన సెల్‌ఫోన్లకు కచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటోంది. దీన్ని క్లైమ్ చేసుకోవడానికి ఆయా సంస్థలు ఎఫ్‌ఐఆర్ కాపీ అడుగుతున్నాయి. పోలీసులు ఇస్తున్న లాస్ట్ రిపోర్ట్ లేదా నాన్-ట్రేస్డ్ సర్టిఫికెట్లు డూప్లికేట్ సిమ్‌కార్డులు తీసుకోవడానికి పూర్తి స్థాయిలో ఉపకరిస్తున్నాయి. అయితే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వీటి ఆధారంగా క్లైమ్స్ అంగీకరించకపోవడం బాధితులకు నష్టాన్ని మిగులుస్తోంది. వాహనచోరీలు వంటి నేరాల్లోనూ బాధితులకు ఇదే ఇబ్బంది ఎదురవుతోంది.
ఇకపై ఎఫ్‌ఐఆర్‌లు కచ్చితమయ్యేనా?
పోలీసులు తమ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం లేదంటూ వి.మహేంద్ర, మరికొందరు హైకోర్టులో పిటిషన్ ఇటీవల దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్‌కుమార్ ప్రత్యేక సందర్భాల్లో మినహా కచ్చితంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ తీర్పునిచ్చారు. దీంతో బాధితులకు ‘కేసు కష్టాలు’ తీరినట్లేనని నిపుణులు చెప్తున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓ ఫిర్యాదు అందిన తరవాత దాన్ని నమోదు చేయడానికి, చేయకపోవడానికి కారణాలను సైతం స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) స్పష్టం చే యాల్సి ఉంటుంది. బాధితులకు ఎంతో ఊరట కలిగించే ఈ అంశాలతో కూడిన సర్క్యులర్‌ను డీజీపీలు త్వరలో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.