వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్
సాక్షి, సిటీబ్యూరో: రద్దీగా ఉన్న బహిరంగ ప్రదేశాలతో పాటు భారీ సభలు, ర్యాలీలతో పాటు కిటకిటలాడుతున్న బస్సుల్ని టార్గెట్‌గా చేసుకుని చేతివాటం చూపిస్తున్న ఇద్దరు ఘరానా నేరగాళ్లను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరు నేరం చేసేప్పుడు ‘పోషించే పాత్రలకు’ ప్రత్యేక పరిభాషక పదాలు సైతం ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. వీరిద్దరిపై ఇప్పటికే పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. టోలిచౌకీ, మిరాజ్ కాలనీకి చెందిన మహ్మద్ రిజ్వాన్ అలియాస్ కైలాష్ ప్రస్తుతం మాన్గార్‌బస్తీలో ఉంటూ బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆసిఫ్‌నగర్‌లోని జిర్రా ప్రాంతానికి చెందిన వాటర్ బాటిల్స్ సప్లయర్ మహ్మద్ రిజ్వాన్ అలియాస్ వీరుతో ఇతడికి చిన్ననాటి స్నేహితుడు. వ్యసనాలకు బానిసలైన వీరు గతంలో ఎవరికి వారుగా పిక్ పాకెటింగ్ నేరాలకు పాల్పడేవారు. ఈ నేపథ్యంలోనే కైలాష్‌పై లంగర్‌హౌస్, చార్మినార్, ఉప్పల్, హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్లలో, వీరుపై లంగర్‌హౌస్, బేగంబజార్, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, ఉప్పల్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. వీరు పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారు.
వీరు నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించగా 2016 జూలై 21 నుంచి ఏడాది పాటు జైల్లో ఉండి బయటికి వచ్చాడు. కొన్నాళ్ల క్రితం జట్టు కట్టిన వీరిద్దరూ కలిసి పిక్‌పాకెటింగ్స్, చైన్ కటింగ్స్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరిద్దరూ ప్రధానంగా జనసమర్థం ఎక్కువగా ఉన్న బహిరంగ ప్రదేశాలతో పాటు భారీ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు జరిగే ప్రాంతాలతో పాటు రద్దీ బస్సులను ఎంచుకునేవారు. ఓ వ్యక్తిని టార్గెట్‌గా చేసుకున్న అనంతరం అతడి వద్దకు వెళ్లి అటు ఇటు కదులుతూ హడావుడి చేసి దృష్టి మళ్లిస్తారు. ఇతడిని పరిభాషికంగా ‘ఆడి’గా పిలుస్తారు. ఈ నేపథ్యంలోనే అదును చూసుకునే కైలాష్ ఆ వ్యక్తి మెడలో ఉన్న బంగారు గొలుసుని తన పంటితో కత్తిరించేసి తస్కరిస్తాడు. ఇలా చేసే ఇతడిని షాను అని పిలుస్తుంటారు. తమ ‘పని’ పూర్తయిన వెంటనే ఇద్దరూ క్షణం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి ఉడాయిస్తాయి. ఇదే తరహాలో నేరం చేస్తూ గతంలో ఉప్పల్, హబీబ్‌నగర్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత తమ పంథా మార్చుకోకుండా ఇద్దరూ కలిసి మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్, బంజారాహిల్స్, మార్కెట్ ఠాణాల పరిధిలో ఏడు నేరాలకు పాల్పడ్డారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, మహ్మద్ ముజఫర్ అలీ, ఎన్.రంజిత్‌కుమార్ వలపన్ని సోమ వారం పట్టుకున్నారు. వీరి నుంచి 14.4 తులాల బంగా రం తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment