‘పీలా’హలం
స్వల్ప ఘర్షణకు రాజకీయ రంగు పులమబోయిన ఎమ్మెల్యే పీలా గోవింద
మామిడిపాలెంలో ఉద్రిక్తతలు సృష్టించిన స్వల్ప వివాదం
తొలుత వైఎస్ఆర్సీపీ మద్దతు దారులే దాడి చేశారని దేశం ప్రచారం
వందపడకల ఆస్పత్రి వద్ద అనకాపల్లి ఎమ్మెల్యే హల్చల్
ఒక వర్గానికి ఎమ్మెల్యే మద్దతు
రెండో వర్గం మంత్రి గంటా అనుయాయులు కావడంతో దేశం ప్రచారం తప్పని తేలిన వైనం
ఇరు వర్గాలపై కేసు నమోదు చేసిన పోలీసులు
రంగంలోకి రూరల్ జిల్లా ఎస్పీ
అనకాపల్లి/అనకాపల్లి రూరల్ : ఒక గ్రామంలో జరిగిన చిన్న ఘర్షణను ఆసరాగా చేసుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లాలని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. అనకాపల్లి మండలంలోని మామిడిపాలెంలో దీపావళి బాణ సంచా కాల్చే విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదం చివరకు కత్తులతో దాడి చేసుకునే వరకూ వచ్చింది. దాడి చేసిన వారు ైవె ఎస్సార్ సీపీ వారేనని దేశం పార్టీ నేతలు అనకాపల్లి వంద పడకల ఆస్పత్రి ముందు హల్చల్ చేశారు. ఎమ్మెల్యే సైతం హడావిడి చేశారు.
శనివారం రాత్రి ఈ వార్త కొన్ని చానళ్లలో హల్చల్ కూడా చేసింది. పోలీసులపై విరుచుకుపడిన ఎమ్మెల్యేకు తెలియని రహస్యం ఏంటంటే...ఆయన నిందిస్తున్న వర్గీయులు మంత్రి గంటా శ్రీనివాసరావు అనుయాయులు కావడం. గ్రామానికి చెందిన టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఉన్న వివాదంలోకి వైఎస్సార్ సీపీని లాగాలనుకున్న ఎమ్మెల్యే అసలు విషయం తెలిశాక ఏమంటారో? ఈ విషయంపై ఎమ్మెల్యే చేసిన హడావిడితో తెలుగు తమ్ముళ్లలో గందరగోళం కొనసాగగా... ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన రూరల్ ఎస్పీ అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించి, గాయాల పాలైన వారిని పరామర్శించారు. దోషులను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దిగువ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
స్వల్ప ఘర్షణతో మొదలు : దీపావళికి జరిగిన చిన్నపాటి ఘర్షణ దాడికి దారితీసింది. మండలంలోని మామిడిపాలెంలో కరణం రమణ అనే వ్యక్తి ఇంటి వద్ద అతని స్నేహితులతో కలిసి దీపావళి రోజుబాణ సంచా కాలుస్తుండగా గొల్లవిల్లి సూరిబాబు, చిన్నారావులు ఇక్కడ కాల్చవద్దని ఆవులు బెదురుతున్నాయని అడ్డు తగిలారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా యధావిధిగా బాణ సంచా కాల్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది.
ఈ నేపథ్యంలో మామిడిపాలేనికి చెందిన గొల్లవిల్లి సూరిబాబు, గౌరి నాగరాజు, గొల్లవిల్లి చిన్నారావు, అప్పలరాజులు తమపై శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన పూడి పరదేశినాయుడు, కోరుకొండ శ్రీనివాసరావు, కరణం వెంకట్, కోరుకొండ వెంకట్, పూడి వెంకటరమణ, సూరి అప్పారావు, చంద్రరావు, రాము, కరణం రమణలు కత్తులతో దాడి చేశారని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారులు అనకాపల్లి వందపడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులపై ఎమ్మెల్యే ఆగ్రహం
మామిడిపాలెంలో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో గాయపడిన క్షతగాత్రులను ఇక్కడి ఏరియా ఆస్పత్రిలో ఎమ్మెల్యే పీలా గోవింద ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె.ప్రవీణ్‌తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి రూరల్ పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా తీసుకోవడం లేదన్నారు. కేవలం రూరల్ పోలీసులు నిర్లక్ష్యం వల్లనే గ్రామాలలో గొడవలు జరుగుతున్నాయన్నారు. తాను స్వయంగా పలుసార్లు మాట్లాడినా పరిస్థితిలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన వెంట టీడీపీ నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, డాక్టర్ కె.నారాయణరావు, మళ్ల సురేంద్ర, బొలిశెట్టి శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.
ఇరువర్గాలపై కేసు నమోదు : ఈ విషయపై రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ హత్యానేరం కింద ఇరువర్గాలపై కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
బాధితులకు ఎస్పీ పరామర్శ
అనకాపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న నలుగురిపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పట్టుబట్టడంతో రూరల్ ఎస్పీ ప్రవీణ్ ఆదివారం మధ్యాహ్నం వంద పడకల ఆస్పత్రిని సందర్శించారు. ఎస్పీ వచ్చి రావడంతోనే మామిడిపాలెం గ్రామానికి చెందిన మహిళలు ఎస్పీని న్యాయం చేయాలని వేడుకున్నారు. వెంటనే ఎస్పీ ప్రవీణ్ తో ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద సత్యనారాయణలు ఒక చాంబర్లో కొద్దిసేపు మంతనాలు జరిపారు. ఎస్పీ గాయాల పాలైన నలుగురిని పరామర్శించారు. రోదనలు మిన్నంటాయి. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ దోషులెవరైనా రాజకీయాలతో సం బంధం లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్పీ సమక్షంలోనే మామిడిపాలెం బాధితులు రూరల్ సీఐను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.