pinarayi viyajan
-
విషాదం.. కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నేత కె. శంకరనారాయణన్(89) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనార్యోగ కారణాలతో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం కేరళలో పాలక్కాడ్లోని తన నివాసంలో మృతిచెందారు. కాగా, శంకరనారాయణన్.. మహారాష్ట్ర, నాగాలాండ్, జార్ఖండ్ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. అలాగే, కేరళ శాసనసభకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్థిక, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ సహా రాజకీయ రంగాలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు. శంకరనారాయణన్ మృతి పట్ల కేరళ అసెంబ్లీ స్పీకర్ ఎంబీ రాజేష్ సంతాపం తెలుపుతూ.. రాష్ట్రం సీనియర్, ప్రముఖ రాజకీయ నేతను కోల్పోయిందని అన్నారు. "శంకరనారాయణ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన నాకు గురువు లాంటి వారు. 16 ఏళ్ల పాటు యూడీఎఫ్ని నడిపించారు. తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూడా శంకరనారాయణన్ అన్నింటిని సులభంగా, ఆదర్శప్రాయంగా ఎదుర్కొన్నారు" అని కాంగ్రెస్ నేత సతీశన్ అన్నారు. ఇది కూడా చదవండి: మోదీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు -
నిజాలు రాస్తే దాడులు చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాస్తవాలు రాసే జర్నలిస్టులపై దాడులు పెరిగాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ జర్నలిస్టుల సమాఖ్య(ఎన్ఏజే), ఢిల్లీ జర్నలిస్ట్ యూనియన్(డీజేయూ) ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని కేరళ హౌస్లో ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ పేరుతో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పినరయి విజయన్ మాట్లాడుతూ.. నిజాలు రాయడం వల్ల గౌరీలంకేశ్ వంటి జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అసలు ప్రతిపక్షమే ఉండకూడదన్న రీతిలో బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వ్యతిరేక వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొంత మంది పత్రికాధిపతులు సైతం బీజేపీకి కొమ్ముకాస్తూ.. వాస్తవాలను ప్రజలకు చూపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడి అక్రమ సంపాదనపై కథనాలు ప్రచురించినందుకు ‘ది వైర్’ అనే వెబ్సైట్ నిర్వాహకులపై బీజేపీ ముప్పేట దాడిని ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. సదస్సులో ఎన్ఏజే తెలంగాణ శాఖ కన్వీనర్ ఎన్.కొండయ్య, ఏపీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శులు కె.మంజరి, ఎ.అమరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు ఝలక్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు సుప్రీంకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వం తొలగించిన డీజీపీ టీపీ సేన్కుమార్ను మళ్లీ అదే పదవిలో నియమించాలని ఆదేశించింది. తనను తిరిగి నియమించాలంటూ సేన్కుమార్ దాఖలుచేసిన పిటిషన్ విచారణ అనంతరం జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అయితే తనకు వెంటనే డీజీపీగా చేరిపోవాలన్న తొందర ఏమీ లేదని సేన్కుమార్ అన్నారు. 11 నెలలుగా తానేమీ తొందరపడలేదని ఆయన చెప్పారు. తన కేసును వాదించేందుకు అంగీకరించిన న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, దుష్యంత్ దవేలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చాలా సందర్భాల్లో తనలాంటి అధికారులు సుప్రీంకోర్టు వరకు రాలేరని, ప్రధానంగా అంత ఖర్చు తాము భరించలేమని అన్నారు. జిషా హత్యకేసు, పుట్టింగల్ ఆలయంలో బాణసంచా పేలుడు దుర్ఘటన కేసులను సరిగా విచారించలేదంటూ 2016 మే నెలలో కొత్తగా వచ్చిన పినరయి విజయన్ ప్రభుత్వం సేన్కుమార్ను ఆ పదవి నుంచి తీసేసి, అంతగా ప్రాధాన్యం లేని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. కానీ ఆయన ఆ పదవిలో చేరకుండా కోర్టుకెక్కారు. పుట్టింగల్ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మంది మరణించారని, ఆ కేసులో తప్పుచేసిన పోలీసు అధికారులను సేన్కుమార్ కాపాడారని సుప్రీంకోర్టులో కేరళ సర్కారు వాదించింది. కానీ కోర్టు మాత్రం సేన్కుమార్కు అనుకూలంగానే తీర్పు వెల్లడించింది.