
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాస్తవాలు రాసే జర్నలిస్టులపై దాడులు పెరిగాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ జర్నలిస్టుల సమాఖ్య(ఎన్‌ఏజే), ఢిల్లీ జర్నలిస్ట్ యూనియన్(డీజేయూ) ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని కేరళ హౌస్‌లో ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ పేరుతో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పినరయి విజయన్ మాట్లాడుతూ.. నిజాలు రాయడం వల్ల గౌరీలంకేశ్ వంటి జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అసలు ప్రతిపక్షమే ఉండకూడదన్న రీతిలో బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
వ్యతిరేక వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొంత మంది పత్రికాధిపతులు సైతం బీజేపీకి కొమ్ముకాస్తూ.. వాస్తవాలను ప్రజలకు చూపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడి అక్రమ సంపాదనపై కథనాలు ప్రచురించినందుకు ‘ది వైర్’ అనే వెబ్‌సైట్ నిర్వాహకులపై బీజేపీ ముప్పేట దాడిని ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. సదస్సులో ఎన్‌ఏజే తెలంగాణ శాఖ కన్వీనర్ ఎన్.కొండయ్య, ఏపీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శులు కె.మంజరి, ఎ.అమరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment