pink cards
-
30,156 తేలిన బోగస్ తెల్ల రేషన్‌కార్డుల సంఖ్య తక్కువే
నల్లగొండ : రేషన్‌కార్డుల్లో బోగస్ కార్డులను ఏరివేసే ప్రక్రియకు జూలై 31వ తేదీ వరకు గడువు విధించినా, పూర్తిస్థాయిలో గుర్తించలేకపోయారు. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో వీఆర్ఓ, వీఆర్ఏలతో ఇంటింటి సర్వే చేపట్టి, మిగతా బోగస్‌కార్డులు ఏరివేసేం దుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో 8.38 లక్షల కుటుంబాలకు గాను, బోగస్‌కార్డులు తొలగించిన తర్వాత కూడా 9.71 లక్షల తెల్లకార్డులు, 60 వేల గులాబీకార్డులు ఉన్నాయి. కుటుంబాల కంటే కార్డులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జూలై 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30,156 బోగస్ రేషన్‌కార్డులు తొలగించారు. తొలగించిన రేషన్‌కార్డులకు సంబంధించి 2.32 లక్షల యూనిట్లు రద్దయ్యాయి. జిల్లాలో 10.02 లక్షల రేషన్ కార్డులకు గాను 30,156 కార్డులు బోగస్‌గా తేలడంతో, ప్రస్తుతం 9,71,844 కార్డులు ఉన్నాయి. అదేవిధంగా 32,49,226 యూనిట్లకు గాను 2,32,000 యూనిట్లు (బోగస్ కార్డులలో ఉన్నవి) తొలగించగా 30,17,226 ప్రస్తుతం యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లకే ఆగస్టులో పీడీఎస్ సరుకులు అందజేస్తారు. అయినా జిల్లాలో కుటుంబాలకంటే రేషన్‌కార్డులు ఇంకా 1,93,844 ఎక్కువున్నాయి. తగ్గనున్న రేషన్ కోటా బోగస్ తెల్ల రేషన్‌కార్డులు ఏరివేయడంతో జిల్లాకు కేటాయించే పీడీఎస్ కోటా తగ్గనుంది. దీంతో ప్రభుత్వానికి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాకు 14,500 మెట్రిక్ టన్నుల బియ్యం, 1542 లీటర్ల కిరోసిన్, 500 టన్నుల చక్కర అందజేస్తున్నారు. కాగా ప్రస్తుతం బోగస్ రేషన్ కార్డుల తొలగింపు వల్ల బియ్యంలో 928 మెట్రిక్ టన్నులు, కిరోసిన్‌లో 60.31 లీటర్లు, 15.07 టన్నుల చక్కర కోటా తగ్గనుంది. తెల్లకార్డులు ఉన్న 25 మంది ఉద్యోగుల గుర్తింపు బీపీఎల్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం తెల్లరేషన్ కార్డులు పొందారు. ఇలా కార్డులు పొందిన 25 ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించారు. తెల్లకార్డుకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తుండడం వల్ల ఉద్యోగులు సైతం ఈ కార్డులు పొందారు. వీరి నుంచి తెల్ల రేషన్‌కార్డులు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి కసరత్తు నిర్వహిస్తున్నారు. -
బోగస్ ఏరివేత..వేగిరం
వారం రోజుల్లో 5,500 రేషన్ కార్డులు స్వాధీనం డీలర్ల ద్వారానే గుర్తింపు రంగంలోకి దిగిన పౌరసరఫరాల శాఖ లక్షన్నర కార్డులు బోగస్..! నెలవారీగా సరుకులు విడుదల చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తే పలువురు కార్డుదారులు సరుకులు తీసుకోవట్లేదని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈక్రమంలో ఆయా కార్డుదారులు అర్హులా.. లేక వలసపోయి ఉంటారా.. అనే కోణంలో అధికారులు పరిశీలన మొదలు పెట్టారు. ఈ తంతంతా గతంలో నిర్వహించినప్పటికీ స్పష్టత రాకపోవడంతో కార్డుల ఏరివేతకు అప్పట్లో బ్రేకు పడింది. తాజాగా కొత్త రాష్ట్రంలో కొలువుదీరిన సర్కారు ఈ అంశంపై దృష్టి సారించి ఏరివేతకు ఉపక్రమించింది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 10.87లక్షల రేషన్ కార్డుల్లో దాదాపు పదిశాతం అర్హత లేనివి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: బోగస్ కార్డుల ఏరివేత ప్రక్రియను సర్కారు వేగిరం చేసింది. అర్హత లేకున్నా తెల్ల రేషన్ కార్డులు పొందిన అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని తొలగించి ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో బోగస్ కార్డులు ఏరివేసేందుకు పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. జిల్లాలో 13.78లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో 10.86లక్షల కార్డుదారులకు రేషన్ సరుకులు నెలవారీగా పంపిణీ చేస్తున్నారు. వీటిలో 10.18లక్షల తెల్లరేషన్ కార్డులు, 67,550 అంత్యోదయ కార్డులు, 873 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఇవిగాకుండా 2.91లక్షల గులాబి(పింక్) కార్డులున్నాయి. పింక్ కార్డులపై ప్రభుత్వం రాయితీపై సరుకులు ఇవ్వట్లేదు. కేవలం తెల్ల రేషన్ కార్డుల ద్వారానే పలు రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జనాభా ఉన్న జిల్లాలో కార్డుల సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్కారు భావిస్తోంది. దీంతో బోగస్ కార్డులు ఏరివేసే క్రమంలో జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతి రోజు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ రోజువారీ పురోగతిని తెలుసుకుంటుండడం గమనార్హం. డీలర్ల ద్వారా ఏరివేత.. కార్డుల ఏరివేత క్రమంలో రేషన్ డీలర్లనే భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే పూర్తి పారదర్శకంగా ఈ బాధ్యతలు నిర్వహించాలంటూ వారికి స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితి తెలిసి ఉన్న డీలరు ఈ పనిని సులువుగా చేయగలడని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. బోగస్ కార్డు అంశం డీలరు దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారికి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా బోగస్ కార్డులున్నవారు స్వచ్ఛందంగా వారి కార్డును సంబంధిత డీలరుకు సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గత గత వారంరోజుల్లో 5,500 కార్డులు స్వచ్ఛందంగా రేషన్ డీలర్లకు సమర్పించారని జిల్లా పౌరసరఫరాల శాఖ ఏఎస్ఓ తనూజ ‘సాక్షి’తో పేర్కొన్నారు. సీడింగ్ కాకుంటే అంతే సంగతి... ప్రస్తుతం ఆధార్ కార్డుకు సీడింగ్ అంశాన్ని పెద్దగా పట్టించుకోనప్పటికీ.. రేషన్ కార్డులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ప్రక్రియ మాత్రం వేగవంతంగా సాగుతోంది. అయితే రేషన్ కార్డులో ఉన్న సభ్యుల్లో.. ఏ ఒక్క సభ్యుడి వివరాలైనా అనుసంధానం కావాలి. అలాంటి వాటికి సరుకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే పట్టణ ప్రాంతంలో అమల్లోకి తెచ్చింది. దీంతో పలువురు కార్డుదారులకు రేషన్ సరుకులు అందలేదు. ఈ నేపథ్యంలో ఆయా కార్డుదారులు ఆధార్ వివరాలతో అనుసంధానం చేయించుకుంటే సరుకులు విడుదల చేయనుంది. ఈ నిర్ణయాన్ని వచ్చే నెలనుంచి జిల్లా మొత్తంగా అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోగస్ కార్డుల సంఖ్య బయటపడే అవకాశం ఉంది.