Pinnamaneni
-
సీటు బెల్టే శ్రీరామ రక్ష
కారు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేది అదే.. తేలికపాటి వాహనాల ప్రతి మూడు ప్రమాదాల్లో రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడంతోనే.. పిన్నమనేని కారు ప్రమాదమే ఇందుకు తాజా ఉదాహరణ లాల్‌జాన్ బాషా, శోభానాగిరెడ్డిల మృతికీ సీటు బెల్ట్ ధరించకపోవడమే కారణం సీటు బెల్ట్ విషయంలో వాహన చోదకులు చూపుతున్న చిన్న నిర్లక్ష్యం తమ విలువైన ప్రాణాలను హరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తేలికపాటి వాహనాలకు జరుగుతున్న ప్రతి మూడు ప్రమాదాల్లో రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు, వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరిస్తే కలిగే లాభం, ధరించకపోతే కలిగే నష్టాలకు సోమవారం అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వాహన ప్రమాదమే ఉదాహరణ. గంటకు 120 కి.మీ పైగా వేగంతో వెళ్తున్న ఆ వాహనం రెయిలింగ్‌ను (క్రాష్ బారియర్) ఢీకొట్టింది. ఈ ఘటనలో సీటు బెల్ట్ ధరించిన పిన్నమనేని సురక్షితంగా బయటపడగా, సీటు బెల్ట్ ధరించని ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు అక్కడిక్కడే మృతి చెందారు. - సాక్షి, సిటీబ్యూరో ఆ రెండు ఘటనల్లోనూ.. టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా, వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ఇద్దరూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే కారు ప్రమాదాల్లో మృతి చెందారు. 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న లాల్‌జాన్ బాషా ఇన్నోవా వాహనం 150 కి.మీ వేగంతో వెళ్తూ జాతీయ రహదారి 65పై నార్కెట్‌పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. సీటు బెల్ట్ ధరించకపోవడంతో బాషా ఎగిరి బయటపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 2014 ఏప్రిల్ 24న ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం వరికుప్పను తప్పించే ప్రయత్నంలో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. శోభా సైతం సీటు బెల్ట్ ధరించకపోవడంతో కారులో నుంచి ఎగిరి బయటపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సీటు బెల్ట్ ఎలా కాపాడుతుంది.? కారులో ప్రయాణిస్తున్న వారు అందులో కూర్చున్నప్పటికీ ఆ వాహన వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వేగంగా వెళ్తున్న వాహనం దేనినైనా ఢీకొట్టినా లేదా హఠాత్తుగా వేగం కోల్పోయినా అందులోని ప్రయాణికులు అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్‌ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి ఎగిరి బయట పడతారు. లాల్‌జాన్ బాషా విషయంలో కారులో ఉండగానే ఆయన కుడి కాలుకి డివైడర్ రాడ్ గుచ్చుకుంది. పల్టీల ప్రభావంతో ఆయన బయటపడేప్పుడు కాలు తెగిపోయింది కూడా. ఇలా పడటం ఫలితంగానే తల, ముఖం తదితర చోట్ల తీవ్రగాయాలై మృతి చెందారు. సీటు బెల్ట్ ధరిస్తే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడతారు. ఆరవ్రెడ్డిని కాపాడింది సీటు బెల్టే.. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్, సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనా స్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీటు బెల్ట్ ధరించడంతో బతికి బయటపడ్డాడు. ప్రమాదం కారణంగా ఏర్పడిన కుదుపుతో తలభాగం ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చింది. అయితే భుజం పైనుంచి సీట్‌బెల్ట్ ఉండటంతో ఆ ఒత్తిడి మెడపై పడింది. అందుకే ఆరవ్రెడ్డికి ఆ భాగంలోనే గాయమైంది. కేవలం సీటు బెల్ట్ ధరించడం వలనే అతనికి మరెక్కడా గాయాలు కాలేదు. సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు లింకు.. కార్ల లాంటి వాహనాల్లోని భద్రతా ప్రమాణాలు సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ చోదకులు, ప్రయాణికులకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. దేశంలో ఉన్న కార్లలో 70 శాతం లోఎండ్ మోడల్స్ కావడంతో ఎయిర్‌బ్యాగ్స్ సౌకర్యం ఉండదు. ఈ నేపథ్యంలో వాహన చోదకులు, అందులోని వారు కచ్చితంగా సీటు బెల్ట్ ధరించాలి. కొన్ని కంపెనీలకు చెందిన హైఎండ్ కార్లలో సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు మధ్య లింకు ఉంటుంది. డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ కాదు. ఫలితంగా ప్రమాదం జరిగినా బ్యాగ్స్ ఓపెన్ కావు. ఏదేమైనా సీటు బెల్ట్ నిత్యం వాడటం మంచిది. - ఫెరోజ్, ఆటో కన్సల్టెంట్ -
ఔడర్!
ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగని రోడ్డు ప్రమాదాలు రాత్రిళ్లు పరిస్థితి మరింత ఘోరం మొబైల్ ఐసీయూ లేక పోతున్న ప్రాణాలెన్నో సరైన రూట్ ఇండికేటర్లు...స్ట్రీట్ లైట్లు లేకే యాక్సిడెంట్లు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు ఆగడం లేదు. రాకపోకలు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా.. ఔటర్ ఇంకా రక్తమోడుతూనే ఉంది. రాత్రి వేళ పరిస్థితి దారుణంగా మారుతోంది. సోమవారం రాత్రి జరిగిన మూడు ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. అతివేగం, రహదారి వెంట సరైన సూచికలు, నిబంధనలు సూచించే బోర్డులు, లైట్లు, నైట్ గస్తీ లేకపోవడమే ప్రమాదాలకు కారణం. 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వేళ్లేలా ఔటర్‌ను తీర్చిదిద్దామని అధికారులు చెబుతున్నా...ప్రమాదాల నివారణకు, వేగ నియంత్రణకు సంబంధించి ఎలాంటి సాంకేతిక చర్యలు లేవు. - సాక్షి, సిటీబ్యూరో తెల్లవారుజామున... నానక్‌రామ్‌గూడ సమీపంలో జరిగిన ప్రమాదంలో రాజు... రాత్రి... తుక్కుగూడ వద్ద జరిగిన ప్రమాదంలో నాగారం వాసి మాధురి... అర్ధరాత్రి ఇదే ప్రాంతంలో పిన్నమనేని భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాస్ ....24 గంటల వ్యవధిలో ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) మింగిన ప్రాణాలివి. రాకపోకలు ప్రారంభమైన ఏళ్ల తర్వాత పగటిపూట ప్రమాదాలను కొంత వరకు అదుపు చేయగలిగినా... రాత్రి వేళల్లో ఓఆర్ఆర్పై రక్తతర్పణం తప్పట్లేదు. ఔ‘డర్’ రోడ్‌గా మారి ప్రాణాలను హరిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)ను సేఫ్ జోన్‌గా మార్చడంలో సర్కారు కక్కుర్తిగా ప్రవర్తిస్తోంది. ఈ బాధ్యత చేపట్టాల్సిన హెచ్ఎండీఏ తమ పనికానట్లు వ్యవహరిస్తుండగా... రక్తధారల్ని చూసి స్పం దించిన సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చర్యలు పూర్తి ఫలితాలు ఇవ్వట్లేదు. పగలు అదుపు చేసినప్పటికీ... తొలినాళ్లల్లో జరిగిన ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు ప్రాథమికంగా కొన్ని మౌలికవసతులు సమకూర్చుకుని ఓఆర్ఆర్పై తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమతి లేని వాహనాలను అడ్డుకోవడం, అతివేగంతో వెళ్లే వాహనాలను గుర్తించడం తదితర చర్యలు తీసుకుంటున్నారు. అయితే భద్రతతో పాటు ఇతర అంశాల నేపథ్యంలో ఇవన్నీ పగటిపూట మాత్రమే చేపట్టగలుగుతున్నారు. దీంతో రాత్రి వేళల్లో దూసుకుపోతున్న వాహనాలు ప్రమాదాలకు గురికావడం, ప్రమాద హేతువులుగా మారడం పరిపాటిగా మారిపోయింది. గచ్చిబౌలి, పెద్దఅంబర్‌పేట్ మధ్యలో నాలుగు ఔట్ పోస్ట్ భవనాల నిర్మాణం సహా మరికొన్ని కీలక ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. ఓఆర్ఆర్పై జరుగుతున్న ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గించడానికి మొబైల్ ఐసీయూ సైతం అవసరమని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు కేవలం అంబులెన్స్‌లు మాత్రమే అందుబాటులో ఉండటంతో క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించే లోపే కొందరు మృత్యువాత పడుతున్నారని చెప్తున్నారు. మెబైల్ ఐసీయూ ఉంటే ఘటనాస్థలి నుంచే చికిత్స ప్రారంభమవుతుందని, ఫలితంగా మృతులు తగ్గుతారని వివరిస్తున్నారు. ప్రమాదాలకు కారణాలు ఎన్నో... ప్రమాదాలతో ఓఆర్ఆర్ రక్తసిక్తం కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని పోలీసులు తమ అధ్యయనంలో గుర్తించారు. ఈ మార్గం నిర్వహణ సక్రమంగా ఉండకపోవడం, వెలుతురు లేని, సూచికలు ఉండాల్సిన స్థాయిలో లేకపోవడం, సర్వీస్ రోడ్లపై జంతువులు తిరగడం వంటివన్నీ ప్రాణాలు హరిస్తున్నాయి. ఇప్పటికి అందుబాటులోకి వచ్చిన ఓఆర్ఆర్ మార్గంలో 12 ప్రాంతాలు మృత్యు కేంద్రాలుగా మారాయి. ఇక్కడ హెచ్ఎండీఏ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పాటు ఎక్కడికక్కడ వాహనాలు పార్క్ చేసి ఉండటం కూడా యాక్సిడెంట్స్కు ఊతం ఇస్తోంది. రోడ్డు నిర్మాణం మా బాధ్యత... అనుమతి లేని వాటిని ఆపాల్సింది మాత్రం పోలీసులే అంటూ హెచ్ఎండీఏ చేతులు దులుపుకుంటోంది. గంటకు 120 కిమీ వేగంతో ప్రయాణించేందుకు అనువుగా దీన్ని నిర్మించామని హెచ్ఎండీఏ ఊదరగొడుతోంది. అయితే వాహనం ఏ వేగంతో ప్రయాణిస్తోంది? దీని వల్ల ఆయా ప్రాంతాల్లో ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి ? అనేవి తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం లేదు. ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించేందుకు రెస్క్యూ టీమ్స్ ఎంత వెతికినా కనిపించవు. అందుబాటులో ఫైర్ ఇంజన్లు ఉండాల్సి ఉన్నా... ఇవి కిలోమీటర్ల దూరంలోనూ కానరావు. ‘కనిపించని’ మృత్యువులు... ఓఆర్ఆర్పై అనేక చోట్ల టోల్‌ప్లాజాలు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణించే వాహనాలకు తాము ఎక్కడ ఉన్నామనేది సాధారణ పరిస్థితుల్లో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఫలితంగానే ఎగ్జిట్ పాయింట్స్ గుర్తిచడంలో తికమక పడుతుంటారు. నాగారం ప్రాంతానికి చెందిన వాసు వాహనం ప్రమాదానికి గురికావడానికి ఇదే కారణం. ఈ ఎగ్జిట్ పాయింట్లతో పాటు మలుపులు, ఇతర కీలక ప్రాంతాలకు సంబంధించి నామ్‌కే వాస్తే సూచికలు కాకుండా స్పష్టంగా కనిపించేవి ఉండాల్సి ఉన్నా... దీన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మరోపక్క ఓఆర్ఆర్పై వీధి దీపాలు సైతం లేకపోవడం ప్రమాదాలకు హేతువుగా మారుతోంది. రాత్రి వేళల్లో మలుపులు తదితరాలు కనిపించక రెయిలింగ్స్‌ను వాహనాలు ఢీ కొంటున్నాయి. వీటన్నింటికీ మించి ఓఆర్ఆర్ పైనా వాటర్ లాగింగ్ ఏరియాలు ఉండటం ప్రమాద హేతువుగా మారింది.