పాతికేళ్ల నాటి పైపులైను.. పదేపదే లీకేజిలు
కోనసీమ ప్రాంతంలో ఓఎన్జీసీ కార్యకలాపాలు దాదాపు రెండున్నర దశాబ్దాలకు ముందునుంచే ఉన్నాయి. కేజీ బేసిన్లో ఉన్న గ్యాస్ నిక్షేపాలను వెలికి తీయడానికి సుమారు 25 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పైపులైన్లు వేశారు. సాధారణంగా ప్రమాణాల ప్రకారం చూస్తే ఈ పైపులైన్ల జీవితకాలం దాదాపు 50 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ అసలు సమస్య అంతా జంక్షన్ల వద్దే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పదే పదే ఈ జంక్షన్ల వద్ద నుంచి గ్యాస్ లీకై, దానికి సంబంధించిన వాసన వచ్చేదని స్థానికులు కూడా పలుమార్లు తెలిపారు. కానీ, అధికారులు మాత్రం గతంలో జరిగిన కొన్ని చిన్న చిన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుని వారి హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు, దాని తీవ్రతను గుర్తించలేదు. ఓఎన్జీసీ వెలికితీసిన గ్యాస్‌ను తాటిపాకలోని గ్యాస్ కలెక్షన్ సెంటర్‌కు పంపుతారు. అక్కడి నుంచి గెయిల్ పైప్లైన్ల ద్వారా ఎన్ఎఫ్సీఎల్, జీఎఫ్సీఎల్, ల్యాంకో తదితర సంస్థలకు గ్యాస్ సరఫరా అవుతుంది.
ఇలా సరఫరా అయ్యే గ్యాస్ పలుమార్లు లీకవ్వడం, ఆ విషయాన్ని స్థానికులు గెయిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాళ్లు వచ్చి చూసేసరికి అంతా సర్దుమణగడం లాంటివి జరగడంతో, లీకేజి గురించి ఈ ప్రాంత వాసులు ఏం చెప్పినా దాన్ని తేలిగ్గా తీసుకోవడం అధికారులకు అలవాటైపోయింది. శుక్రవారం తెల్లవారుజామున గ్యాస్ పైపులైన్ లీకై.. భారీ ప్రమాదం సంభవించినా, ఆ విషయం తెలియజేయడానికి గెయిల్ అధికారుల కోసం ప్రయత్నిస్తే ఎవరూ స్పందించలేదని స్థానికులు చెప్పారు.
చుట్టుపక్కల ఇళ్లకు కూడా మంటలు వ్యాపించడంతో మెలకువ వచ్చి, ఇంట్లో ఉన్న పిల్లలను భుజాన వేసుకుని పరుగులు తీసిన తల్లులు.. తమ పిల్లలు బతికే ఉన్నారంటే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే, వాళ్లు బయటకు వచ్చేసిన తర్వాత ఆ ఇళ్లు పూర్తిగా కాలిపోయి.. కనీసం అక్కడో ఇల్లు ఉందనే విషయాన్ని కూడా గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారిపోయాయి. పూరిళ్లు మొత్తం మాయమైపోయాయి. పెంకుటిళ్లు కూడా కాలిపోయాయి. వాటిలో ఉన్నవారు మొత్తం మరణించారు. పక్కా డాబా ఇళ్లకు ఉన్న తలుపులు, కిటికీలు కూడా కాలిపోయాయి. 20 అంగుళాల మందం ఉన్న పైపులైన్ పగిలిపోయింది. జాయింట్ వద్ద తుక్కుతుక్కుగా మారిపోయింది. ఎట్టకేలకు ఉదయం 6.45 గంటలకు మంటలు చల్లారాయి. అయినా భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సంఘటన జరగదన్న నమ్మకం మాత్రం ఇక్కడివారికి లేదు.