నేలపై కూర్చుని పరీక్ష రాసే దుస్థితి రానివ్వం
గుంటూరు ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నేలపై కూర్చుని పరీక్ష రాయాల్సిన దుస్ధితి తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లపై డీఈవో శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం సాక్షితో మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 60,926 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 56,179 మంది, ప్రైవేటుగా హాజరయ్యే వారు 4,747 మంది ఉన్నారని వివరించారు. జిల్లా నలుమూలలా 287 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసి తాగునీరు, ఫర్నిచర్ సదుపాయాలను కల్పించామని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని, మాల్ ప్రాక్టీసులను నిరోధించేందుకు 14 ఫ్లయింగ్ స్వ్వాడ్‌లు, 34 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్టు చెప్పారు. విద్యార్థులు ఉదయం 8.30 గంటల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం ప్రారంభించి, 9.30కి పరీక్షను ప్రారంభించేలా సూపరింటెండెంట్లకు, శాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఉదయం 9.30 తరువాత పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులను లోపలికి అనుమతించడం సాధ్యం కాదన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించి, విద్యార్థులను నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి పంపేలా చూడాలని సూచించారు.
పోలీస్స్టేషన్లు, తాలూకా కార్యాలయాలకు దూరంగా ఉన్న 51కేంద్రాలను సి.సెంటర్లుగా గుర్తించి, ఆయా కేంద్రాలకు పోలీసు బందోబస్తు నడుమ ప్రశ్నపత్రాలు తీసుకెళ్లి, పరీక్ష అనంతరం తిరిగి జవాబు పత్రాలను తీసుకువచ్చే ఏర్పాట్లు చేశామని వివరించారు. ఇందుకోసం నియమించిన 34 మంది రూట్ అధికారులు ఆయా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. 10వ తరగతి పరీక్షల జిల్లా పరిశీలకుడిగా రంపచోడవరం ఐటీడీఏ ఈవో రాజీవ్‌ను ప్రభుత్వం నియమించిందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పూర్తిగా విద్యాశాఖ అధీనంలోకి తీసుకుంటామని, పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు.