PM Relief Fund
-
కరోనా: హిట్ మ్యాన్ భారీ విరాళం!
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో లాక్డౌన్లోకి వెళ్లిపోయిన భారత్ మళ్లీ మునుపటి స్థితికి చేరుకోవాలని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆకాంక్షించారు. కష్టకాలంలో ఉన్న మన దేశానికి సేవ చేసే బాధ్యత అందరిపైనా ఉందని ట్విటర్లో పేర్కొన్నారు. కోవిడ్-19 బాధితులను, పేదలను ఆదుకునేందుకు తన వంతుగా రూ.80 లక్షలు విరాళం ఇచ్చినట్టు తెలిపారు. పీఎం కేర్స్‌కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు, ఫ్రీ ఇండియా స్వచ్ఛంద సంస్థకు, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్‌కు రూ. 5 లక్షల చొప్పున రోహిత్ సాయం చేశారు. (‘పీఎం కేర్స్’కు విరాళాలివ్వండి) ఇక భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. పీఎం–కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం తామిద్దరం నిధులు అందించనున్నట్లు ప్రకటించారు. అయితే తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నది మాత్రం వారిద్దరు గోప్యంగా ఉంచారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.50 లక్షల చొప్పున పీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. (చదవండి: విరుష్క జోడీ విరాళం రూ. 3 కోట్లు!) -
కరోనాపై కార్పొరేట్ల యుద్ధం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ అనే ప్రత్యేక నిధికి కార్పొరేట్లు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. దేశంలోనే సంపన్నుడైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.500 కోట్లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అలాగే, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ.5 కోట్లను కేటాయించింది. ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ కూడా పీఎం కేర్స్‌కు రూ.150 కోట్లను ప్రకటించింది. అలాగే, లౌక్‌డౌన్ సమయంలో ఎల్అండ్టీ తన కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించనుంది. ఇందు కోసం ప్రతి నెలా రూ.500 కోట్లను పక్కన పెట్టనున్నట్టు ఎల్అండ్టీ గ్రూపు చైర్మన్ ఏఎం నాయక్ తెలిపారు. ఇప్పటికే టాటాసన్స్, టాటా గ్రూపు కలసి రూ.1,500 కోట్లను పీఎంకేర్స్ కోసం ప్రకటించాయి. ఇక హీరో గ్రూపు సైతం కరోనా వైరస్ నివారణ చర్యల కోసం రూ.100 కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ఇందులో రూ.50 కోట్లను పీఎం కేర్స్‌కు, మరో రూ.50 కోట్లను నివారణ చర్యలకు ఖర్చు చేయనుంది. పేటీఎం సైతం రూ.500 కోట్లు: పేటీఎం సైతం పీఎం కేర్స్ సహాయనిధికి రూ.500 కోట్లు అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తోటి పౌరుల నుంచి విరాళాలు అందించాలని ఈ సంస్థ కోరింది. యూజర్లు ఇచ్చే ప్రతీ రూ.10కి అదనంగా తాను రూ.10కూడా కలిపి పీఎం కేర్స్‌కు అందించనున్నట్టు ప్రకటించింది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రూ.100 కోట్లు... కరోనా సహాయ చర్యల్లో భాగంగా పీఎం కేర్స్ నిధికి రూ.50 కోట్లను విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరో రూ.50 కోట్లను సొంతంగా ఖర్చుచేయనుంది. ఎన్ఎండీసీ రూ.150 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా వైరస్ మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి మద్ధతుగా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.150 కోట్లు విరాళంగా అందించింది. దేశంలోని ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఇదే అతిపెద్ద సహాయమని ఈ మేరకు ఎన్ఎండీసీ సీఎండీ బైజేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అమర్‌రాజా గ్రూప్ రూ.6 కోట్లు..: బ్యాటరీ తయారీ సంస్థ అమర్‌రాజా గ్రూప్ కరోనా నియంత్రణకు రూ.6 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇందులో కంపెనీ ఉద్యోగుల ఒక రోజు వేతనం కూడా కలిపి ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 కోట్లు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సిగ్నిటీ రూ.50 లక్షలు..: హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్ తెలంగాణ ప్రభుత్వ కోవిడ్ సహాయ నిధికి రూ.50 లక్షల విరాళంగా అందించింది. ఈ మేరకు సిగ్నిటీ సీఎండీ సీవీ సుబ్రహ్మణ్యం మంత్రి కేటీ రామారావుకు చెక్‌ను అందజేశారు. మ్యాన్‌కైండ్ రూ. 51 కోట్లు..: న్యూఢిల్లీకి చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ మ్యాన్‌కైండ్ కరోనా వైరస్ మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న యుద్దానికి మద్దతుగా రూ.51 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఇం దులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.కోటి అందిస్తున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్సీ జునెజా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీసీ రూ.కోటి..: కన్స్ట్రక్షన్స్ ఇంజనీరింగ్ కంపెనీ ఎన్సీసీ లిమిటెడ్ కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి నిధులను అందజేసింది. ఈ మేరకు కంపెనీ ఎండీ రంగరాజు సీఎం కే చంద్రశేఖర్ రావుకు చెక్‌ను అందజేశారు. పరిష్కారాలకు రూ. 2.5 కోట్లు పారిశ్రామిక దిగ్గజం హర్ష మారివాలా ఆఫర్ ముంబై: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వచ్చే నెల రోజుల్లో వినూత్న పరిష్కారమార్గాలు కనుగొనే వారికి రూ. 2.5 కోట్ల బహుమతి ఇవ్వనున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికో అధినేత, పారిశ్రామికవేత్త హర్‡్ష మారివాలా ప్రకటించారు. రెండు లాభాపేక్షరహిత సంస్థలతో కలిసి వ్యక్తిగత హోదాలో తాను ఇందుకోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఇన్నోవేట్2బీట్కోవిడ్ పేరిట నిర్వహిస్తున్న పోటీలో మెడ్–టెక్ ఎంటర్‌ప్రెన్యూర్స్, కార్పొరేటర్లు, నూతన ఆవిష్కర్తలు పాల్గొనాలంటూ మారికో ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆహ్వానించింది. స్వల్ప సమయంలోనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు అనువైన సొల్యూషన్స్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు మారివాలా తెలిపారు. -
మోదీపై ఉల్లి రైతు వినూత్న ఆగ్రహం
ముంబై: పండించిన ఉల్లి పంటకు కనీస మద్దతుధర రాకపోవడంపై మహారాష్ట్రకు చెందిన ఓ రైతు వినూత్నంగా నిరసన తెలిపాడు. నాసిక్ జిల్లాలోని నిఫద్‌కు చెందిన సంజయ్ సాథే తన పొలంలో ఉల్లి పంట వేయగా 750 కేజీల దిగుబడి వచ్చింది. దీన్ని మార్కెట్‌కు తీసుకెళ్లగా కిలో రూ.1.40 చొప్పున రూ.1,064 వచ్చాయి. నెలల పాటు కష్టపడి వ్యవసాయం చేసినప్పటికీ కనీస పెట్టుబడి దక్కకపోవడంతో సంజయ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఉల్లి అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రధాని విపత్తు సహాయ నిధికి పోస్ట్‌ద్వారా పంపాడు. రైతుల కష్టాలపై కేంద్రం వైఖరికి నిరసనగానే ప్రధానికి రూ.1,064 పంపాననీ, మనీఆర్డర్ కోసం మరో రూ.54 ఖర్చు అయ్యాయని సంజయ్ వెల్లడించాడు. సాగులో సరికొత్త పద్ధతులతో భారీ దిగుబడి సాధించినందుకు 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాను సంజయ్ ఢిల్లీలో కలుసుకున్నాడు. -
విమర్శలతో జీతమంతా ఇచ్చేసిన సచిన్
న్యూఢిల్లీ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపీగా తాను అందుకున్న పూర్తి జీతాన్ని, అలవెన్స్‌లను ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. ఇటీవలె సచిన్ రాజ్యసభ ఎంపీ పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆరేళ్లుగా సచిన్ ఎంపీగా అలవెన్స్లతో కలిపి సుమారు రూ. 90 లక్షలు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని పీఎం రీలీఫ్ ఫండ్‌కు అందజేసినట్లు పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యసభ హాజరు విషయంలో నటి రేఖతో పాటు సచిన్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సచిన్ తన జీతాన్ని పీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. సచిన్ ఆఫీస్ పేర్కొన్న వివరాల ప్రకారం తన రూ.30 కోట్ల ఎంపీ ల్యాడ్స్‌ను దేశ వ్యాప్తంగా 185 ప్రాజెక్టులకు ఉపయోగించారు. సుమారు రూ.7.5 కోట్లు విద్యా సంబంధిత అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చు చేశారు. ఇక సచిన్ ఆదర్శ్ గ్రామ యోజన కింద రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ గ్రామం ఉండగా మరొకటి మహారాష్ట్రలో ఉంది. -
పదవీకాలంలో జీతమంతా విరాళంగా ఇచ్చారు
న్యూఢిల్లీ: హరియాణాకు చెందిన రాజ్యసభ సభ్యుడు, మీడియా టైకూన్ డాక్టర్ సుభాష్ చంద్ర.. ఎంపీగా తన పదవీకాలంలో తీసుకునే మొత్తం జీతాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. తాను నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని, మిగిలిన మొత్తాన్ని ప్రధాని సహాయ నిధికి అందజేస్తానని చెప్పారు. సుభాష్ చంద్ర.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చెక్ అందజేశారు. హరియాణాలోని హిసార్‌లో జన్మించిన సుభాష్ చంద్ర తన 20వ ఏట 17 రూపాయలతో ఢిల్లీకి వచ్చారు. మీడియా రంగంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. భారత టెలివిజన్ రంగంలో తొలిసారిగా 1992లో ఉపగ్రహ టీవీ చానెల్ జీ టీవీని ప్రారంభించారు. ఆ తర్వాత తొలి ప్రైవేట్ న్యూస్ చానెల్ జీ న్యూస్‌ను స్థాపించారు. -
పీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి కవలలకు సాయం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని సహాయ నిధి నుంచి హైదరాబాద్ ఎ.ఎస్.రావునగర్ ప్రాంతంలోని గీతానగర్‌కు చెందిన కవలలకు కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స కోసం రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం సంబంధిత ఆసుపత్రికి లేఖ రాసింది. గీతానగర్ నివాసి ఎం.వి.ఎల్.నారాయణ తన ఆరేళ్ల కవల పిల్లలు సిరి తాన్సీ, కార్తికేయలకు కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్స అందించాల్సి ఉందని మల్కాజిగిరి ఎంపీ సి.హెచ్.మల్లారెడ్డికి విన్నవించారు. దీంతో ప్రధాన మంత్రి జాతీయ రిలీఫ్ ఫండ్ నుంచి సాయం కోరుతూ ఎంపీ మల్లారెడ్డి ప్రధానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో వీరికి చికిత్స నిమిత్తం రూ.3 లక్షల చొప్పున సాయం చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలుపుతూ జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి ప్రధాన మంత్రి కార్యాలయం లేఖ రాసింది. -
ప్రధాని సహాయనిధికి 'ఓటుకు కోటి' సొమ్ము
సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్, బీజేపీకి చెందిన ముగ్గురు మాజీ ఎంపీల నుంచి 2008లో 'ఓటుకు కోటి' స్కాంలో స్వాధీనం చేసుకున్న కోటి రూపాయల సొమ్మును ప్రధాన మంత్రి సహాయనిధికి జమ చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఆ సొమ్ము తమదని ఎవరూ చెప్పకపోవడంతో సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకుని ప్రధాని సహాయనిధికి పంపాలని తెలిపింది. నాటి బీజేపీ ఎంపీ అశోక్ అర్గల్ ఇంటి సమీపంలో అమర్ సింగ్ మాజీ సహచరుడు సంజీవ్ సక్సేనా ఈ సొమ్ము పంచుతుండగా పోలీసులు పట్టుకున్నట్లు ప్రాసిక్యూషన్ వర్గాలు వాదించాయి. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులపైన ఛార్జిషీటు దాఖలుచేశారని, ఇక ఈ కేసులో పెండింగు అంశమంటూ ఏమీ లేదని కోర్టు తెలిపింది. ఈ సొమ్ము ఏం చేయాలన్న విషయమై కూడా ఏమీ తేలకపోవడంతో.. మొత్తం కోటి రూపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి పంపాలని ఆదేశించింది.