ఎన్నిసార్లయినా డిపాజిట్ చేయొచ్చు
• దానికి రెట్టింపు మొత్తం పన్నుగా చెల్లిస్తే చాలు
• దాన్ని గరీబ్ కల్యాణ్ డిపాజిట్‌గా పరిగణిస్తాం
• నల్లధనం వెల్లడికి చివరి అవకాశమిదే: ఆర్థికశాఖ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ డిపాజిట్ స్కీమ్ (పీఎంజీకేడీఎస్)– 2016 కింద ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా దఫాలుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. నల్లడబ్బును వెలికితీయడంలో భాగంగా– పెద్ద నోట్ల రద్దు తరవాత బ్యాంకుల్లో నోట్లు డిపాజిట్ చేయటానికిచ్చిన గడువు మధ్యలో... అంటే డిసెంబర్ 16న ప్రభుత్వం తాజా క్షమాభిక్ష పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ఎవరైనా... లెక్కచూపని ఆదాయంగా ప్రకటించినదానిలో కనీసం 25% మొత్తాన్ని 2016 డిసెంబర్ 17 – 2017 మార్చి 31 మధ్య బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని నాలుగేళ్ల వరకూ వడ్డీలేని డిపాజిట్‌గా అలాగే ఉంచుతారు. ఇప్పటిదాకా ఈ 25% మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాలన్న నిబంధన ఉండగా... దీన్ని ప్రభుత్వం సవరించింది. దఫదఫాలుగా చేసిన డిపాజిట్లనూ ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేసింది.
ఇదీ పథకం...
⇔ ఎవరైనా లెక్క చూపని ఆదాయంగా ప్రకటించాలనుకున్న మొత్తంలో 50% మొదట పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ రసీదు చూపించిన తర్వాతే వారు ఈ పథకం పరిధిలోకి వస్తారు.
⇔ 50 శాతాన్ని పన్నుగా చెల్లించాక... మొత్తం సొమ్ములో మరో 25 శాతాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది నాలుగేళ్ల పాటు అలా డిపాజిట్ రూపంలోనే ఉంటుంది. దీనిపై ఎలాంటి వడ్డీ ఉండదు.
⇔ తన దగ్గరుండే మిగిలిన 25 శాతాన్ని పన్ను చెల్లించిన ఆదాయంగా పరిగణిస్తారు. దానికి ఎలాంటి లెక్కలూ అడగరు.
⇔ ఈ పథకం కింద పన్ను చెల్లించిన, డిపాజిట్ చేసిన వారి పేర్లను ఎక్కడా బయటపెట్టబోమని కేంద్రం చెబుతోంది.
తాజా సవరణ ప్రకారం...
⇔ ఈ పథకం కింద డిపాజిట్ చేయటానికి గడువింకా ఉంది. కాకపోతే కొందరు ఇప్పటికే డిపాజిట్ చేసి ఉండొచ్చు.
⇔ అలాంటి వారు మరిన్ని దఫాలుగా కూడా డిపాజిట్ చేసుకోవచ్చని... అలా డిపాజిట్లు చేశాక... దానికి రెట్టింపు మొత్తాన్ని (50 శాతం) తమకు పన్నుగా చెల్లించాల్సి ఉంటుందనేది కేంద్రం తాజాగా చేసిన ప్రకటన సారాంశం.
⇔ అలా పన్నుగా చెల్లించాక... అందులో సగం మొత్తాన్ని (25 శాతం) వారు తమ దగ్గర పన్ను చెల్లించేసిన ఆదాయంగా ఉంచుకోవచ్చు.
⇔ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తం... నాలుగేళ్ల తరవాత వడ్డీ లేకుండా చేతికొస్తుంది.
23 లక్షల మందికి సీబీడీటీ ప్రశంసలు..
సకాలంలో పన్ను చెల్లింపులు, రిటర్న్స్ దాఖలు చేసిన 3.74 లక్షల మందికి తాజాగా ఐటీ శాఖ ప్రశంసలు లభించాయి. వీరికి ప్రశంసా పత్రాలను పంపినట్లు సీబీడీటీ పేర్కొంది. దీనితో ఈ తరహా ప్రశంసంలు అందుకున్న వారి సంఖ్య 2016–17 అసెస్మెంట్ ఇయర్లో 23 లక్షలకు చేరినట్లు తెలి పింది. పన్ను చెల్లింపుల ప్రాతిపదికన ప్లాటినం, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీల్లో ఈ–మెయిల్ ప్రసంశా పత్రాలను పంపినట్లు తెలిపారు.