గరీబ్ యోజన డిపాజిట్ల గడువు పెంపు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ డిపాజిట్ స్కీమ్ గడువును ప్రభుత్వం, ఆర్‌బీఐలు బుధవారం ఏప్రిల్ 30వ తేదీ వరకూ పొడిగించాయి. ఈ మేరకు రెండు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. ఇంతక్రితం ఈ గడువు మార్చి 31. ఈ పథకం కింద తమ నల్లధనాన్ని వెల్లడించిన వ్యక్తులు అందులో 25 శాతాన్ని ఎటువంటి వడ్డీలేకుండా నాలుగేళ్లపాటు డిపాజిట్ చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ డిపాజిట్లకు సంబంధించి ఏప్రిల్ 30 తరువాత మాత్రం గడువు పొడిగించేది లేదని ఒక ప్రకటనలో ఆర్‌బీఐ పేర్కొంది.
తాజా నిర్ణయానికి అనుగుణంగా ఆర్‌బీఐ ఈ–కుబేర్ సిస్టమ్‌లో వివరాలను పొందుపరచడానికి గడువును బ్యాంకులకు సైతం ఏప్రిల్ 30 వరకూ పొడిగించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. నవంబర్ 8 డీమోనిటైజేషన్ అనంతరం డిసెంబర్ 17న గరీబ్ యోజన పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని వినియోగించుకుని పన్ను చెల్లింపు, జరిమానాల (మొత్తం కలిపి ప్రకటించిన నల్లధనం మొత్తంలో 49.9 శాతం వరకూ) ద్వారా నల్లధనానికి సంబం ధించి ప్రాసిక్యూషన్ ఎదుర్కొనకుండా బయట పడవచ్చని కేంద్రం ప్రకటించింది.