వెబ్సైట్లో తప్పిపోయిన వారి వివరాలు
- ఆచూకీ కనుక్కునేందుకు కొత్తదారి
- వరంగల్ పోలీసుల వినూత్న ఆలోచన
సాక్షి, హన్మకొండ : తప్పిపోయిన వారి ఆచూకీ కనుక్కోవడానికి వరంగల్ రూరల్ పోలీసులు ఆన్లైన్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. తప్పిపోయిన వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వరంగల్ రూరల్ పోలీసుల వెబ్సైట్లో పొందుపరిచారు. అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు ఎదురైనప్పుడు సామాన్యులు తమకు తెలిసిన సమాచారాన్ని సులువుగా పోలీసులకు చేరవేయవచ్చు. గడిచిన రెండేళ్లుగా జిల్లాలో తప్పిపోయిన వ్యక్తుల వివరాలు వరంగల్ పోలీసు శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ లభించడం చాలా సందర్భాల్లో కష్టంగా మారుతుంది.
కొన్ని కేసుల్లో ఏళ్ల తరబడి ఆచూకీ లభించడం కష్టం. తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభించినా ఆ సమాచారం ఎవ్వరికి ఇవ్వాలి? ఏ పోలీస్ స్టేషన్లో సంప్రదించడం అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. కనిపించకుండా పోయినా.. తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ తెలిసినప్పటికీ, వారిని సరిపోల్చుకోవడం, నిర్ధారించడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో పోలీసుశాఖ వెబ్సైట్ www.warangalpolice. gov.inలో లాగిన్ అవ్వాలి. ఇందులో మిస్సింగ్ పర్సన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే తప్పిపోయిన వ్యక్తుల వివరాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ సదరు వ్యక్తుల ఫొటోలను చూడటం ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
ఆ తర్వాత తప్పిపోయిన లేదా కనిపిం చకుండా పోయిన వ్యక్తి ఆచూకీ విషయంలో స్పష్టత ఉంటే పోలీసులకు సమాచారం అందించవచ్చు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో 2013 నుంచి ఇప్పటి వరకు 41 మంది వ్యక్తుల ఆచూకీ కనుక్కోవాల్సి ఉంది. వీరికి సంబంధించిన సమాచారాన్ని వరంగల్ రూరల్ పోలీసుశాఖ వెబ్సైట్లో ఉన్నాయి. తప్పిపోయిన వ్యక్తి పేరు, ఫొటో, ఎత్తు, మేనిచాయ, తల్లిదండ్రుల పేర్లు, చిరునామాలు ఉన్నాయి. వీటితోపాటు సదరు వ్యక్తి ఏ రోజు, ఏ స్థలం నుంచి కనిపించకుండా పోయాడు? ఇందుకు సంబంధించి ఏ పోలీసు స్టేషన్లో ఏ సెక్షన్ ప్రకారం ఫిర్యాదు నమోదు అయ్యిందనే సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. సదరు వ్యక్తుల కదలికలు, ఆచూకీ లభిస్తే సంప్రదించాల్సిన ఫోన్నంబర్ల వివరాలు సైతం ఉన్నాయి. త తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ తెలుసుకోవడంలో ఈ వెబ్సైట్ ఉపయోకరంగా ఉంటుందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.