స్మార్ట్‌ఫోన్‌కూ బీమా ధీమా..
అనధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 20 లక్షల పైచిలుకు ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. అందుకే, వాహనాలకు, ఇంటికి, జీవితానికి ఉన్నట్లే మొబైల్ ఫోన్లకు కూడా ప్రస్తుతం బీమా పాలసీలు లభిస్తున్నాయి. బీమా కంపెనీలే కాకుండా ఫోన్లు విక్రయించే స్టోర్లు కూడా ఈ పాలసీలను అందిస్తున్నాయి.
పాలసీకి సంబంధించి ఒక్కో కంపెనీ వసూలు చేసే ప్రీమియం ఒక్కో రకంగా ఉంటోంది. సాధారణంగా ప్రతి రూ.1,000 కవరేజీకి ప్రీమియం సుమారు రూ. 15-20 దాకా ఉంటోంది. ఉదాహరణకు రూ. 40,000 ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్ బీమా కవరేజీ కోసం ప్రీమియం దాదాపు రూ. 600 - 800 దాకా ఉంటుంది. మొబైల్‌ఫోన్ చోరీకి గురైనా లేదా పోయినా.. క్లెయిమ్ పొందాలంటే ముందుగా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి.
ఆ తర్వాత మొబైల్‌ను కొన్న బిల్లు, పోలీస్ ఎఫ్ఐఆర్ను.. బీమా కంపెనీకి గానీ లేదా గ్రూప్ పాలసీ ఇచ్చిన మొబైల్ స్టోర్‌కి గానీ అందజేయాలి. ఫోన్ పోయిన 48 గంటల్లోగా క్లెయిమ్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. క్లెయిము విషయంలో ఫోన్ విలువ తరుగుదల కూడా కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా కొన్న 90 రోజుల్లోగా ఫోన్ పోయి, క్లెయిమ్ కోసం దాఖలు చేస్తే బీమా కంపెనీలు తరుగుదలను లెక్కకట్టవు.
అదే 91 రోజుల నుంచి 180 రోజుల మధ్య కాలం అయితే ఫోన్ ఖరీదులో 25 శాతం మేర, 181 రోజులు గడిచిన తర్వాత 50 శాతం తరుగుదలను లెక్కగట్టి ఆ మేరకు క్లెయిమ్ మొత్తం ఇస్తాయి. అగ్నిప్రమాదం, దొంగతనం, ఇతరత్రా కొన్ని కారణాల వల్ల ఫోన్ దెబ్బతిన్నా ఫోన్‌కు పాలసీ రక్షణ ఉంటుంది. అయితే, వ్యక్తిగత నిర్లక్ష్యం కారణంగా పోగొట్టుకుంటే మాత్రం కవరేజీ ఉండదు. కాబట్టి పాలసీ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి అంశాలన్నీ చూసుకుని మాత్రమే తీసుకోవాలి.