pollution control case
-
బీపీసీఎల్, ఐఓసీకి రూ.3కోట్లు ఫైన్!
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)..భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు రూ.2కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు రూ.1కోటి మేర జరిమానా విధించింది. తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు జరిమానా విధించినట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని రిటైల్ అవుట్లెట్లలో వేపర్ రికవరీ సిస్టమ్స్ (వీఆర్ఎస్) ఇన్స్టాల్ చేయనందుకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీసీబీ నుంచి ఆదేశాలు అందినట్లు ఐఓసీ తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్ స్టేషన్లలో వీఆర్ఎస్లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్ విధించలేదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో వీర్‌ఎస్‌ని అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు, సీపీసీబీ నిర్దేశించిన సమయంలో వీఆర్ఎస్ను ఇన్స్టాల్ చేయనందుకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసు అందుకున్నట్లు బీపీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. -
అప్పిలేట్ అథారిటీలు ఏర్పాటు చేయండి
ఇరు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కాలుష్య నియంత్రణ కేసులకు సంబంధించిన అప్పిలేట్ అథారిటీల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని ఇరు రాష్ట్రాల సీఎంలు, న్యాయ మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. తమ కంపెనీలు, పరిశ్రమలకు సంబంధించిన కేసుల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జారీ చేస్తున్న ఉత్తర్వులను సవాలు చేసేందుకు అప్పిలేట్ అథారిటీ లేదని, దీంతో తమకు న్యాయం జరగడం లేదంటూ పలు కంపెనీలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ఇప్పటివరకు అప్పిలేట్ అథారిటీలను ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అప్పిలేట్ అథారిటీల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.