ఇరు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కాలుష్య నియంత్రణ కేసులకు సంబంధించిన అప్పిలేట్ అథారిటీల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని ఇరు రాష్ట్రాల సీఎంలు, న్యాయ మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.
తమ కంపెనీలు, పరిశ్రమలకు సంబంధించిన కేసుల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జారీ చేస్తున్న ఉత్తర్వులను సవాలు చేసేందుకు అప్పిలేట్ అథారిటీ లేదని, దీంతో తమకు న్యాయం జరగడం లేదంటూ పలు కంపెనీలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు వేశాయి. వీటిని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ఇప్పటివరకు అప్పిలేట్ అథారిటీలను ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అప్పిలేట్ అథారిటీల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
అప్పిలేట్ అథారిటీలు ఏర్పాటు చేయండి
Published Sat, Jan 31 2015 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM
Advertisement