సరిహద్దులో ఉద్రిక్తత
దాచేపల్లి: ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన పొందుగల వద్ద ప్రయాణికులు గురువారం తెల్లవారుజాము నుంచి ఆందోళనకు దిగారు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో తెలంగాణలో హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు తమ స్వస్థలాలకు వచ్చేందుకు కార్లు, ద్విచక్రవాహనాలపై పొందుగల సమీపంలోని కృష్ణానది బ్రిడ్జి మీదకు చేరుకున్నారు. వీరితో పాటుగా ఏపీకి చెందిన పలువురు ప్రయాణికులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ బాలనాగిరెడ్డి కరోనా వైరస్ తీవ్రత దృష్ణ్యా ప్రభుత్వం సూచనల మేరకు ఏపీలోకి వచ్చేందుకు అనుమతి లేదని, ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే తప్ప తమేమీ చేయలేమని తేల్చి చెప్పారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అడిషనల్ ఎస్పీ చక్రవర్తి, గురజాల ఆర్డీవో జె.పార్థసారథి, తహసీల్దార్ గర్నేపూడి లెవీలు పలుమార్లు ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. తిరిగి తెలంగాణకు వెళ్లాలని పోలీసులు తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఏపీలోకి రావాల్సిందేనని ప్రయాణికులు పట్టుబట్టటంతో పోలీసులు అంగీకరించలేదు. ఏపీలోకి వచ్చేందుకు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏపీలోకి వచ్చేందుకు పోలీసులు ససేమిరా అంగీకరించకపోవటంతో ప్రయాణికులు గురువారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో తిరిగి తెలంగాణ వైపునకు వెళ్లారు. స్థానిక పోలీసులతో పాటుగా ప్రత్యేక పోలీస్ బలగాలతో రాష్ట్ర సరిహద్దు గ్రామమైన పొందుగలలో బందోబస్తును ఏర్పాటు చేశారు. అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై వాహనాల రాకపోకలను పూర్తిగా ఆపేశారు. అదే విధంగా శ్రీనగర్ దగ్గర ఏర్పాటు చేసిన చెక్పొస్ట్ వద్ద ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తున్న వారిని కూడా పోలీసులు నిలిపివేశారు.
భయపడవద్దు.. ఇంట్లోనే ఉండండి
కరోనా వైరస్‌ను నియంత్రించే అవకాశం మన చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరు కరోనా వైరస్ పట్ల భయపడకుండా భరోసాగా ఇంట్లోనే ఉండాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి అత్యవసరంగా గుంటూరుకు వెళ్లుతూ మార్గమధ్యలో దాచేపల్లి మండలం పొందుగల బ్రిడ్జి వద్ద ఏపీలోకి అనుమతించాలని కోరుతూ చేస్తున్న ఆందోళనకారులతో మంత్రి గౌతంరెడ్డి మాట్లాడారు. తెలంగాణ నుంచి ఏపీలోని స్వగ్రామాలకు వెళ్తూ ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల క్షేమం కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాక్‌డౌన్‌ను ప్రకటించారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండటం మంచిదని ఆయన చెప్పారు. తెలంగాణలోని పోలీసులు అధికారులు అనుమతులు ఇవ్వటం వలనే ఏపీలోని తమ స్వగ్రామాలకు వెళ్తున్నామని ఆందోళనకారులు మంత్రికి వివరించారు. ఈ విషయంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటిఆర్‌తో మంత్రి గౌతంరెడ్డి ఫోన్లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండటం వలన ఎక్కడివారు అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని కేటిఆర్‌ను కోరారు. ఇదే అంశంపై ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌తో కూడా మంత్రి గౌతంరెడ్డి ఫోన్లో మాట్లాడి పరిస్థితిని చెప్పారు.
రెచ్చిపోయిన ఆందోళనకారులు
పొందుగల వద్ద బుధవారం రాత్రి 7.40 సమయంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీసులపై మూకుమ్మడిగా రాళ్లదాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
వదంతులు నమ్మవద్దు
పొందుగల చెక్పొస్ట్ వద్ద ఆగిపోయిన ప్రయాణికులందరికీ వైద్య పరీక్షలు చేయించి రాష్ట్రంలోకి అనుమతించాలని, అవసరాన్ని బట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించాలని మంత్రి గౌతంరెడ్డి చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఆదేశించారు. ఇకపై ఎవరు ఎక్కడికి ప్రయాణాలు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏ లోటురాకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూస్తున్నారని, కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తమ కుటుంబాలు, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులకు సహకరించాలని ఆయన తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న సంకల్పంకు ప్రతి ఒక్కరు సహకరించాలని మంత్రి కోరారు. యువత నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండాలని, నేటి సమాజంలో ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా యువత వ్యవహరించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో కరోనా వైరస్‌పై వస్తున్న వదంతులను నమ్మవద్దని, సామాజిక దూరం తప్పకుండా పాటించి భరోసాగా ఉండాలని మంత్రి గౌతంరెడ్డి చెప్పారు.