హోలీమార్
రోజూ ఎవర్నెంత పరుగులు పెట్టించేవారైనా... హోలీ రోజున మాత్రం తాము కూడా పరుగులు పెట్టాల్సిందే! ఈ ఆటలో తన మన పర భేదాలుండవు. పొడిగానో, తడిగానో, జడిగానో.. ప్రతి ఒక్కరు తడవాల్సిందే! అయితే.. ఆ తడిసేదేదో కొంచెం స్టెయిల్‌గా, కొంచెం కంఫర్ట్‌గా ఉండేలా జాగ్రత్త పడడం మన ఛాయిసే! హ్యాపీగా హోలీ ఆడండి. ఆట అయ్యాక మళ్లీ ఒకసారి ఆ అనుభూతుల్లో తడవండి...
ఏడురంగులు! ఏ రంగు ఎటు వైపు నుంచి మనల్ని ముంచేస్తుందో తెలియదు. అందుకే తెలుపు రంగు దుస్తులను ధరించండి. అన్ని రంగుల్నీ సమానంగా ఆహ్వానించి ఆ ఆనందపు కెరటాలను ఆస్వాదించండి. తెల్లని సల్వార్, రంగుల బాందినీ ప్రింటెడ్ చున్నీ ధరిస్తే చాలు పండగ సంబరం రెట్టింపు అయినట్లే. కాలే జీ యువతులైతే షార్ట్స్, వదులుగా ఉండే టీ షర్ట్ లేదా కుర్తాను ఈ పండగకు నిరభ్యంతరంగా ధరించవచ్చు. అయితే, తప్పనిసరిగా లైట్ వెయిట్ కాటన్ మెటీరియల్ దుస్తులను ఇందుకోసం ఎంచుకోవాలి.
పోనీటెయిల్ మేలు
జుట్టును లూజ్‌గా వదిలేస్తే రంగులు అంటుకుపోయి, వెంట్రుకల ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు హోలీ ఆనందాన్ని పూర్తిగా ఎంజాయ్ చెయ్యలేరు. అందుకని ఫ్రెంచ్ పోనీటెయిల్ వేసుకుంటే స్టైల్‌గా కనిపిస్తారు, ప్లస్ జుట్టు గురించిన ఆందోళనా తగ్గుతుంది. పండగ కళ రావాలంటే పోనీటెయిల్కు పూసలు, కుందన్స్ ఉన్న క్లిప్ లేదా బ్యాండ్‌ను పెట్టుకోవచ్చు. హోలీ ఆడటానికి ముందు జుట్టుకు కండిషనర్ వాడితే రంగుల వల్ల పాడవుతుందనే బెంగ ఉండదు. లేదంటే ముందుగా వెచ్చని కొబ్బరి నూనెను తలకంతా బాగా పట్టించాలి. దీని వల్ల ఎంత గాఢమైన రంగులు మీద పడ్డా వెంట్రుకలు మాయిశ్చరైజర్‌ను కోల్పోవు.
చర్మానికీ కవచాలున్నాయ్!
కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను హోలీ ఆడటానికి ముందు శరీరానికి, ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల రంగుల వల్ల కలిగే మంట, దురద సమస్యలు ఉండవు. నూనె వల్ల కాసేపు చర్మం జిడ్డుగా అనిపిస్తుంది కానీ శుభ్రపరుచుకోవడం చాలా సులువు. చర్మకాంతి కూడా తగ్గదు. హోలీ రంగునీళ్ల నుంచి, ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ మార్కెట్లో లభిస్తుంది. దీనిని ఉపయోగించవచ్చు.
సహజత్వమే సురక్షితం
మీ మీద రంగు పడితే మరి మీరు ఊరికే ఉంటారా? మీరూ చల్లుతారు. అయితే హోలీ ఆడటానికి సహజ సిద్ధమైన పువ్వులు, ఆకులతో తయారుచేసిన రంగులను ఉపయోగించండి. దీని వల్ల చర్మానికి హాని కలగదు సరికదా కాంతి పెరుగుతుంది! అయితే, అన్ని చోట్లా ఈ సహజసిద్ధమైన రంగులు లభ్యం కావు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి.
ఆడి అలసిపోయాక...
హోలీ త ర్వాత షవర్‌బాత్ లేదా టబ్ బాత్ తప్పనిసరి. తర్వాత శరీరానికంతటికీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంగుల వల్ల పొడిబారకుండా ఉంటుంది. రంగుల్లోని సింథటిక్ కెమికల్స్‌లో చర్మసౌందర్యాన్ని దెబ్బతీసే గుణాలు ఎక్కువ. అందుకని తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగితే చర్మం కాంతి తగ్గదు.
మృదువుగా... మర్దనా...
రంగులలో ఉండే రసాయనాలు చర్మంపై అధిక ప్రభావం చూపకుండా ఉండాలంటే అవకాడో(మార్కెట్లో లభిస్తుంది) స్క్రబ్‌ని మేనికి రాసి, మృదువుగా రుద్దాలి. సబ్బుకు బదులుగా దీనిని ఉపయోగించడం వల్ల చర్మానికి అంటుకున్న రంగులు త్వరగా వదలడమే కాకుండా తగినంత మర్దనా లభించి, మృతకణాలు తొలగిపోతాయి. ఆ విధంగా రెండు రకాల ఉపయోగాలనూ పొందవచ్చు.
హోలీ పండగ సంబరాన్ని కొన్నాళ్ల వరకు మదిలో నిలుపుకోవాలంటే ఆ ఆనంద క్షణాలను ఫొటోల రూపంలో భద్రపరుచుకోవడమే కాదు, మేనికి రక్షిత చర్యలూ తీసుకోవాలి. పిల్లల విషయంలోనూ ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఎంజాయ్ హోలీ. యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్.
గోళ్లను కత్తిరించాలి
చెవులు, గోళ్లలో రంగు ఇరుక్కుపోకుండా ఉండటానికి. ఈ ప్రాంతాలలో పెట్రోలియమ్ జెల్లీ రాసుకుంటే సమస్య నుంచి నివారణ పొందవచ్చు. హోలీ ఆడిన తర్వాత ఎంత శుభ్రపరిచినా రంగు గోళ్లలో ఉండిపోతుంది. అలాగే ఆహారపదార్థాలు తినేస్తుంటారు. దీంతో రంగు గోళ్ల నుంచి పదార్థాల ద్వారా పొట్టలోకి చేరుతుంది. అందుకని తప్పనిసరిగా గోళ్లను కత్తిరించుకోవాలి.
రోజుకన్నా ఎక్కువ నీళ్లు సేవించడం వల్ల చర్మంలోని మలినాలు కూడా శుద్ధి అవుతాయి. చర్మం దురద, చిన్న చిన్న దద్దుర్లు రాకుండా ఉండాలంటే కాలమైన్ లోషన్ రాసుకోవడం మేలు. కాలమైన్ లోషన్‌ను హోలీకి ముందు, తర్వాత రాసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు.
హోలీ ఆడిన తర్వాత కొన్ని రోజుల వరకు మేకప్‌కు దూరంగా ఉండటం మేలు. చర్మానికి తగినంత గాలి, కాంతి అందాలి. ఇందుకు రిఫ్రెషింగ్ ఫేస్ ప్యాక్‌లు చర్మాన్ని యథాస్థితికి తీసుకురావడానికి ఉపయోగపడతాయి.
- డా.షాను, చర్మవైద్య నిపుణులు