కంపెనీల చట్టంలో సవరణలకు ఓకే
- లోక్‌సభలో ఆమోదముద్ర
- పోంజీ స్కీమ్‌లకు అడ్డుకట్ట
- కొన్ని నిబంధనల తొలగింపు
న్యూఢిల్లీ: కంపెనీల చట్టం-2013లో సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలిపింది. పెట్టుబడులను ఆకర్షించడం... వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం కోసం చట్టంలోని కొన్ని అసంబద్ధ నిబంధనలను తొలగించినట్లు బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇలాంటి నిబంధనల కారణంగా దేశంలో వ్యాపారాలను ప్రారంభించేందుకు ఎవరూ ముందుకురారని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపాదిత కంపెనీల చట్టం సవరణ బిల్లు-2014కు సభలో మూజువాణి ఓటుతో అమోదం లభించినప్పటికీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బిల్లును స్థాయీ సంఘానికి పంపాలంటూ కాంగ్రెస్ పట్టుపట్టగా.. స్పీకర్ నిరాకరించారు. మొత్తంమీద కంపెనీల చట్టానికి 14 సవరణలు చేశారు. ఇందులో పోంజీ స్కీమ్‌ల అడ్డుకట్టకూడా ప్రధానమైనది. లక్షలాది మంది చిన్న ఇన్వెస్టర్లను ముంచేసిన శారదా చిట్‌ఫండ్ స్కామ్ నేపథ్యంలో చట్టవిరుద్ధంగా అధిక వడ్డీలను ఆశజూపి ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించేవారికి తీవ్రమైన శిక్షలను విధించేలా చట్టంలో మార్పులు చేశారు.
కంపెనీలు ప్రారంభించాలంటే చాలా కష్టం: ఎంపీ వి.వరప్రసాద్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కంపెనీలు ప్రారంభించాలంటే కనీసం 40 చట్టాల నిబంధనలు పాటించాలని, అదే విదేశాల్లో అయితే ఈ ప్రక్రియ చాలా సులువని వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్‌రావు పేర్కొన్నారు. కంపెనీల చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఈ చట్ట సవరణలను చాలావరకు వైఎస్సార్సీపీ స్వాగతిస్తోంది. అయితే కంపెనీల బోర్డుల పలు తీర్మానాలు రహస్యంగా ఉంచుతారు.
రిజిస్టర్లో నమోదు చేశాక రహస్యంగా ఉంచాల్సిన అవసరమేముంది? అంతర్జాతీయ ప్రక్రియలను అమల్లో పెడతామని మంత్రి చెప్పారు. కానీ అవి సవరణల్లో కనిపించలేదు. ఆడిటర్లు, చార్టెడ్ అకౌంటెంట్ల ప్రయోజనాలనూ కాపాడాలి. సత్యం స్కామ్ తర్వాత ఆడిటర్లందరినీ అనుమానాస్పదంగా చూడడం మొదలైంది. కంపెనీలు దేశ సహజ సంపదను వినియోగించుకున్నప్పుడు వాటి లాభాలు ఈ దేశ సామాజిక రంగాలపై ఖర్చు చేసేలా చూడాలి’ అని పేర్కొన్నారు.