ప్రత్యేక బెయిల్ చట్టంపై యోచన
న్యూఢిల్లీ: నిందితులకు బెయిల్ జారీ చేసే విషయంలో కోర్టులకున్న విచక్షణాధికారాలకు అంతం పలికే దిశగా.. సమగ్ర, స్పష్టమైన బెయిల్ చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దాంతో సంపన్న నిందితులే బెయిల్ సౌకర్యం పొందగలుగుతున్నారని సమాజంలో నెలకొన్న అభిప్రాయాన్ని కూడా తొలగించవచ్చని భావిస్తోంది. ‘బెయిల్ జారీ విషయంలో లోపాలున్నాయి. డబ్బున్నవారు సులభంగా బెయిల్ సౌకర్యం పొందుతుండగా.. పేదవారు జైళ్లలో మగ్గుతున్నారు’ అని కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ న్యాయశాఖ కార్యదర్శి పీకే మల్హోత్రకు పంపిన శాఖాంతర్గత లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుత బెయిల్ వ్యవస్థను సమూలంగా మార్చేలా.. ప్రత్యేక బెయిల్ చట్టం రూపకల్పనకు గల అవకాశాలను అధ్యయనం చేయాలని అందులో సూచించారు. ‘నిందితులు సాక్ష్యులను ప్రభావితం చేస్తాడనో, సాక్ష్యాలను నాశనం చేస్తాడనో, లేక బెయిల్పై బయట ఉంటే మరిన్ని నేరాలకు పాల్పడుతాడనో కోర్టు భావిస్తే తప్ప.. నిందితులకు ఒక హక్కుగా బెయిల్ ఇవ్వాల్సి ఉండగా.. వాస్తవానికి అలా జరగడం లేదు. బెయిల్ దరఖాస్తు విచారణకు రావడానికే చాలా సమయం పట్టడం, విచారణ ప్రక్రియలో విపరీత జాప్యం, నిందితులు పూచీకత్తులను సమర్పించలేకపోవడం, వారికి అవగాహన లేకపోవడం..
తదితర కారణాల వల్ల అనేకమంది పేద నిందితులు జైళ్లలోనే మగ్గిపోతున్నారు’ అని గౌడ పేర్కొన్నారు. గౌడ సూచనలను పీకే మల్హోత్ర లా కమిషన్ను పంపించారు. హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు ఇటీవల బాంబే హైకోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించినప్పుడు.. ఆ నటుడు వెంటనే బెయిల్ పొందడంపై వివాదం, బెయిల్ జారీ ప్రక్రియపై చర్చ ప్రారంభమైన నేపథ్యంలో గౌడ ఈ లేఖ రాశారు.