పోప్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు
వచ్చే వారం న్యూయార్క్ రానున్న పోప్
న్యూయార్క్: వచ్చేవారం పోప్ ఫ్రాన్సిస్-1 రానున్న నేపథ్యంలో అమెరికాలో ఆయన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన అమెరికా రానున్న పోప్.. వాషింగ్టన్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా నగరాల్లో పలు సభలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. 27వ తేదీ వరకు అమెరికాలో బిజీబిజీగా గడపనున్నారు. మరోపక్క ఇదే సమయంలో ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 25న 170 మంది ప్రపంచ నాయకులు న్యూయార్క్ రానున్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచంలోని 120 కోట్ల మంది క్యాథలిక్కులకు ఆరాధ్యుడైన పోప్‌కు భద్రతా ఏర్పాట్లు చేయడం యూఎస్ అధికార వర్గాలకు సవాలుగా మారింది.
మోదీ- షరీఫ్ భేటీ ఉండదు!
ఇస్లామాబాద్: వచ్చేవారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా భారత్, పాక్ ప్రధానుల భేటీ ఉండకపోవచ్చని సమాచారం. అమెరికాతో పాటు ఇతర ఐరాస భద్రతామండలి శాశ్వత సభ్యదేశాలు భారత్, పాక్ నేతలు సంయమనం పాటించాలని కోరుకుంటున్నా యి. నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్‌లు ఐరాస సమావేశాల్లో చేసే ప్రసంగాలు ఘర్షణాత్మకంగా ఉండకూడదని ఈ దేశాలు భావిస్తున్నాయంటూ డాన్ పత్రిక తెలిపింది. ఇరువురి భేటీకి అవకాశాలు కనిపించడం లేదంది.