Portugal Super star Cristiano Ronaldo
-
రొనాల్డో వల్ల గెలవడం కష్టమైపోయింది.. సహచరుడి సంచలన కామెంట్స్
స్టార్ ఫుట్‌బాలర్, పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోపై అతని కొత్త క్లబ్ (సౌదీకి చెందిన అల్ నస్ర్ క్లబ్) సహచరుడు, ఆ జట్టు మిడ్ ఫీల్డర్ లూయిజ్ గుస్తావో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రొనాల్డో వచ్చినప్పటి నుంచి తమ జట్టు గెలవడం కష్టంగా మారిందని లూయిజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రొనాల్డో తమ జట్టులో ఉన్నందున ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు రెండొందల శాతం ప్రదర్శన ఇస్తున్నారు.. అందువల్లే తమకు గెలవడం కష్టంగా మారిందని అన్నాడు. ఇక, తమ జట్టు విషయానికొస్తే.. రొనాల్డో తమతో చేరినప్పటి నుంచి జట్టులో చాలా మార్పులు వచ్చాయి. ఫిజికల్‌గా, టెక్నికల్‌గా బలంగా ఉన్న రొనాల్డోను చూసి తాము చాలా నేర్చుకుంటున్నామని అన్నాడు. సవాళ్లు స్వీకరించి, వాటిని అధిగమించడంలో రొనాల్డో దిట్ట, అతని సహవాసంలో తాము కూడా ఈ విషయంలో మెరుగవుతున్నామని గుస్తావో తెలిపాడు. కాగా, సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్ర్ క్లబ్ ఇటీవలే రొనాల్డోతో భారీ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అల్ నస్ర్ క్లబ్ రెండున్నరేళ్ల కాలానికి గానూ రొనాల్డోకు రూ.4400 కోట్ల భారీ మొత్తం అప్పజెప్పేందుకు డీల్ కుదుర్చుకుంది. ఈ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాక రొనాల్డో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో గోల్ చేయకుండా నిరాశ పరిచిన GOAT.. శుక్రవారం అల్ ఫతేహీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో ఓ గోల్ చేశాడు. ఫలితంగా అల్ నస్ర్ టీమ్ 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అల్ నస్ర్ తరఫున రొనాల్డో చేసిన మొదటి గోల్ ఇదే. సౌదీ ప్రో లీగ్‌లో రూడీ గార్సియా నేతృత్వంలో ఆడుతున్న రొనాల్డో.. అల్ నస్ర్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క గోల్ మాత్రమే చేశాడు. -
కన్నీళ్ల మధ్య... కల నెరవేరింది
ఇన్నేళ్లుగా అతను దేశం భారం మోశాడు. కొద్ది సేపు మేం అతడిని మోయడం గౌరవంగా భావిస్తున్నాం... ఈ మాట ఎక్కడో విన్నట్లుందా! దశాబ్ద కాలంగా దేశం తరఫున ఒక్కడే పోరాడి నిలిచాడు. ఇప్పుడు అతను నిలబడలేని స్థితిలో ఉంటే మేం చేయి అందించి నడిపించడం మాకు ఎంతో గౌరవం... మళ్లీ ఇప్పుడూ అదే మాట! అవును... మొదటిది క్రికెట్ ప్రపంచ కప్ విజయం సమయంలో సచిన్ గురించి జట్టు సభ్యులు చెబితే, ఇప్పుడు యూరో విజయంతో రొనాల్డో గురించి సహచరులు ఉద్వేగంగా చేసిన వ్యాఖ్య. ఈ రెండు దృశ్యాలు దిగ్గజ క్రీడాకారులు చిరకాలం వేచి చూసిన తర్వాత విజయం దక్కినపుడు కనిపించే భావోద్వేగాలకు అద్దం పడతాయి. యూరో విజయంతో పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అదే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా గుర్తింపు ఉన్నా దేశం తరఫున టైటిల్ గెలవలేకపోయిన లోటును అతను ఇప్పుడు తీర్చుకున్నాడు. సాక్షి క్రీడావిభాగం: సమకాలీన ఫుట్‌బాల్ ప్రపంచంలో మెస్సీ, రొనాల్డో మధ్య పోలికలతో ఎవరు అత్యుత్తమ ఆటగాడు అనే చర్చ సుదీర్ఘంగా సాగుతూనే ఉంది. ఇప్పుడు దానికి స్పష్టత వచ్చేసింది! మెస్సీ ఖాతాలో లేని మేజర్ టోర్నీ రొనాల్డో సాధించేశాడు. ఫలితం గా ఇద్దరి మధ్య అంతరం పెంచేశాడు. 2004 యూ రో ఫైనల్లో 19 ఏళ్ల టీనేజర్‌గా పోర్చుగల్ ఓటమిలో భాగమైన రొనాల్డో, పుష్కర కాలం తర్వాత జట్టు చారిత్రక విజయంలో భాగమయ్యాడు. 25 నిమిషాల్లోనే... టైటిల్ లక్ష్యంగా మైదానంలోకి అడుగు పెట్టిన రొనాల్డోకు ఫైనల్లో 9వ నిమిషంలోనే షాక్ తగిలింది. ఫ్రాన్స్ ఆటగాడు పాయెట్ అడ్డుకోవడంతో మోకాలికి గట్టి దెబ్బ తగిలింది. అయితే చికిత్స తర్వాత మరో 8 నిమిషాలు ఆడినా... నొప్పి భరించలేక ఏడుస్తూ మైదానం వీడాడు. మరో 3 నిమిషాలకు ప్లాస్టర్‌తో తిరిగొచ్చి ఆడే ప్రయత్నం చేసినా అతని వల్ల కాలేదు. ఒక వైపు జట్టును మధ్యలోనే వదిలేసి పోతున్నాననే బాధ వెంటాడుతుండగా, 25వ నిమిషంలో కన్నీళ్లతో స్ట్రెచర్‌పై అతను మళ్లీ నిష్ర్కమించాల్సి వచ్చింది. మైదానం బయటినుంచే... రెండో అర్ధ భాగంలో ఫ్రాన్స్ ఆధిక్యం ప్రదర్శిస్తుండటంతో రొనాల్డో తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఒక దశలో పక్కన కూర్చున్న సహచరుడి తొడపై బలంగా కొట్టి ఆగ్రహం ప్రదర్శించాడు! ఇక ఆగలేనంటూ ఒంటికాలితోనే లేచి వచ్చేసి బయటినుంచే ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ మేనేజర్ పాత్ర పోషించాడు. గోల్ కొట్టడానికి నాలుగు నిమిషాల ముందు ఎడెర్తో మాట్లాడి నువ్వే గెలిపిస్తున్నావంటూ స్ఫూర్తి నింపాడు. అతని మాటల మంత్రం ఏం అద్భుతం చేసిందో... ఎడెర్ గోల్‌తో పోర్చుగల్‌ను చరిత్రలో నిలిపాడు. ఇక ప్రపంచకప్ మిగిలింది మూడు సార్లు ‘ఫిఫా’ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన రొనాల్డో తొలి సారి దేశం తరఫున గర్వపడే ప్రదర్శన కనబర్చాడు. టోర్నీలో పోర్చుగల్‌ను ఫైనల్‌కు చేర్చడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా హంగేరీ, వేల్స్లపై రొనాల్డో అద్భుత ఆట జట్టును గెలిపించింది. ఫైనల్లో గెలుపు తర్వాత హద్దుల్లేని సంబరాల్లో భాగమైన రొనాల్డో తనదైన శైలిలో షర్ట్ విప్పి పోజు ఇవ్వడమే కాదు... ప్రేక్షకుల్లోకి వెళ్లి తనకు ఈ స్థాయి తెచ్చిన మాంచెస్టర్ మాజీ మేనేజర్ అలెక్స్ ఫెర్గూసన్‌ను ఆత్మీయంగా కౌగిలించుకొని కృతజ్ఞతలు చెప్పడం కూడా మరచిపోలేదు. అయితే రొనాల్డోకు ఇంకా ఓ లోటు ఉంది. ఒక్కసారి ప్రపంచకప్‌ను కూడా ముద్దాడితే... ఇక రొనాల్డో దిగ్గజాలకే దిగ్గజంగా ఎదుగుతాడు. నా జీవితంలో ఇదో అత్యుత్తమ క్షణం. అందుకే భావోద్వేగాలు ఆపుకోలేక ఏడ్చేశాను. నేను భవిష్యత్తు చెప్పేవాడిని కాదు. కానీ అదనపు సమయంలో ఎడెర్ ఆట మార్చగలడని నాకు అనిపించింది. అందుకే అతడిపై నమ్మకముంచాం. - రొనాల్డో