కన్నీళ్ల మధ్య... కల నెరవేరింది | It was Cristiano Ronaldo who won Portugal the Euro 2016 | Sakshi
Sakshi News home page

కన్నీళ్ల మధ్య... కల నెరవేరింది

Published Tue, Jul 12 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

కన్నీళ్ల మధ్య... కల నెరవేరింది

కన్నీళ్ల మధ్య... కల నెరవేరింది

ఇన్నేళ్లుగా అతను దేశం భారం మోశాడు. కొద్ది సేపు మేం అతడిని మోయడం గౌరవంగా భావిస్తున్నాం... ఈ మాట ఎక్కడో విన్నట్లుందా! దశాబ్ద కాలంగా దేశం తరఫున ఒక్కడే పోరాడి నిలిచాడు. ఇప్పుడు అతను నిలబడలేని స్థితిలో ఉంటే మేం చేయి అందించి నడిపించడం మాకు ఎంతో గౌరవం... మళ్లీ ఇప్పుడూ అదే మాట!
 
అవును... మొదటిది క్రికెట్ ప్రపంచ కప్ విజయం సమయంలో సచిన్ గురించి జట్టు సభ్యులు చెబితే, ఇప్పుడు యూరో విజయంతో రొనాల్డో గురించి సహచరులు ఉద్వేగంగా చేసిన వ్యాఖ్య. ఈ రెండు దృశ్యాలు దిగ్గజ క్రీడాకారులు చిరకాలం వేచి చూసిన తర్వాత విజయం దక్కినపుడు కనిపించే భావోద్వేగాలకు అద్దం పడతాయి.
 
యూరో విజయంతో పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో  అదే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడిగా గుర్తింపు ఉన్నా దేశం తరఫున టైటిల్ గెలవలేకపోయిన లోటును అతను ఇప్పుడు తీర్చుకున్నాడు.

 
సాక్షి క్రీడావిభాగం: సమకాలీన ఫుట్‌బాల్ ప్రపంచంలో మెస్సీ, రొనాల్డో మధ్య పోలికలతో ఎవరు అత్యుత్తమ ఆటగాడు అనే చర్చ సుదీర్ఘంగా సాగుతూనే ఉంది. ఇప్పుడు దానికి స్పష్టత వచ్చేసింది! మెస్సీ ఖాతాలో లేని మేజర్ టోర్నీ రొనాల్డో సాధించేశాడు. ఫలితం గా ఇద్దరి మధ్య అంతరం పెంచేశాడు. 2004 యూ రో ఫైనల్లో 19 ఏళ్ల టీనేజర్‌గా పోర్చుగల్ ఓటమిలో భాగమైన రొనాల్డో, పుష్కర కాలం తర్వాత జట్టు చారిత్రక విజయంలో భాగమయ్యాడు.
 
25 నిమిషాల్లోనే...
టైటిల్ లక్ష్యంగా మైదానంలోకి అడుగు పెట్టిన రొనాల్డోకు ఫైనల్లో 9వ నిమిషంలోనే షాక్ తగిలింది. ఫ్రాన్స్ ఆటగాడు పాయెట్ అడ్డుకోవడంతో మోకాలికి గట్టి దెబ్బ తగిలింది. అయితే చికిత్స తర్వాత మరో 8 నిమిషాలు ఆడినా... నొప్పి భరించలేక ఏడుస్తూ మైదానం వీడాడు. మరో 3 నిమిషాలకు ప్లాస్టర్‌తో తిరిగొచ్చి ఆడే ప్రయత్నం చేసినా అతని వల్ల కాలేదు. ఒక వైపు జట్టును మధ్యలోనే వదిలేసి పోతున్నాననే బాధ వెంటాడుతుండగా, 25వ నిమిషంలో కన్నీళ్లతో స్ట్రెచర్‌పై అతను మళ్లీ నిష్ర్కమించాల్సి వచ్చింది.
 
మైదానం బయటినుంచే...
రెండో అర్ధ భాగంలో ఫ్రాన్స్ ఆధిక్యం ప్రదర్శిస్తుండటంతో రొనాల్డో తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఒక దశలో పక్కన కూర్చున్న సహచరుడి తొడపై బలంగా కొట్టి ఆగ్రహం ప్రదర్శించాడు! ఇక ఆగలేనంటూ ఒంటికాలితోనే లేచి వచ్చేసి బయటినుంచే ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ మేనేజర్ పాత్ర పోషించాడు. గోల్ కొట్టడానికి నాలుగు నిమిషాల ముందు ఎడెర్‌తో మాట్లాడి నువ్వే గెలిపిస్తున్నావంటూ స్ఫూర్తి నింపాడు. అతని మాటల మంత్రం ఏం అద్భుతం చేసిందో... ఎడెర్ గోల్‌తో పోర్చుగల్‌ను చరిత్రలో నిలిపాడు.
 
ఇక ప్రపంచకప్ మిగిలింది
మూడు సార్లు ‘ఫిఫా’ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచిన రొనాల్డో తొలి సారి దేశం తరఫున గర్వపడే ప్రదర్శన కనబర్చాడు. టోర్నీలో పోర్చుగల్‌ను ఫైనల్‌కు చేర్చడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా హంగేరీ, వేల్స్‌లపై రొనాల్డో అద్భుత ఆట జట్టును గెలిపించింది. ఫైనల్లో గెలుపు తర్వాత హద్దుల్లేని సంబరాల్లో భాగమైన రొనాల్డో తనదైన శైలిలో షర్ట్ విప్పి పోజు ఇవ్వడమే కాదు... ప్రేక్షకుల్లోకి వెళ్లి తనకు ఈ స్థాయి తెచ్చిన మాంచెస్టర్ మాజీ మేనేజర్ అలెక్స్ ఫెర్గూసన్‌ను ఆత్మీయంగా కౌగిలించుకొని కృతజ్ఞతలు చెప్పడం కూడా మరచిపోలేదు. అయితే రొనాల్డోకు ఇంకా ఓ లోటు ఉంది. ఒక్కసారి ప్రపంచకప్‌ను కూడా ముద్దాడితే... ఇక రొనాల్డో దిగ్గజాలకే దిగ్గజంగా ఎదుగుతాడు.
 
నా జీవితంలో ఇదో అత్యుత్తమ క్షణం. అందుకే భావోద్వేగాలు ఆపుకోలేక ఏడ్చేశాను. నేను భవిష్యత్తు చెప్పేవాడిని కాదు. కానీ అదనపు సమయంలో ఎడెర్ ఆట మార్చగలడని నాకు అనిపించింది. అందుకే అతడిపై నమ్మకముంచాం.    - రొనాల్డో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement