వైద్య కోర్సుల్లో జాట్లకు రిజర్వేషన్‌పై డీయూకు నోటీస్
న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల ప్రవేశాల్లో జాట్ కేటగిరికి రిజర్వేషన్‌పై ప్రభుత్వానికి, ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ)కి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీచేసింది. వర్సిటీలో ఇప్పటికే సీట్లు పొందిన నలుగురు ఓబీసీ విద్యార్థులు వేసిన వ్యాజ్యం మంగళవారం విచారణ కు వచ్చింది. 2014 విద్యా సంవత్సరానికిగాను డీయూలో వివిధ వైద్య కోర్సులకు సంబంధించి 229 డిగ్రీ, 29 డిప్లొమా సీట్లు ఉన్నాయి.
ఈ సీట్లలో రిజ ర్వేషన్ ప్రకారం డిగ్రీలో 62, డిప్లొమాలో 8 సీట్లు ఓబీసీకి కేటాయించింది. కాగా, గత ఫిబ్రవరి 25వ తేదీన డీయూ మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించింది. ఇదిలా ఉండగా మార్చి 4వ తేదీన కేంద్ర ప్రభుత్వం జాట్లను ఓబీసీలో చేరుస్తూ జీవో జారీ చేసింది. దీనిప్రకారం డీయూ జాట్ కేటగిరిని ఓబీసీలో చేర్చి తిరిగి మెరిట్‌లిస్ట్‌ను సవరించింది.
దాంతో మొదట ప్రకటించిన మెరిట్‌లిస్ట్‌లో సీట్లు వచ్చిన నలుగురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. మొదటిసారి ప్రకటించిన మెరిట్‌లిస్ట్‌ను పక్కన బెట్టి జాట్లతో కలిపి తిరిగి మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించడం అన్యాయమని వారు వాదించారు. కాగా, దీనిపై తమ సమాధానాన్ని ఫైల్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, డీయూకు ఢిల్లీకోర్టు నోటీసులు జారీచేసింది.