postpartum died
-
బాలింత ప్రాణం తీసిన ఇడ్లీ
సాక్షి, కందుకూరు: వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ బాలింత మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (పీహెచ్సీ)లో చోటుచేసుకుంది. కందుకూరు మండలం ముచ్చర్లకు చెందిన షాబాద్ పరమేశ్‌కు ధన్నారం గ్రామానికి చెందిన శివాని (28)తో ఆరేళ్ల కిందట వివాహమైంది. శివాని రెండోసారి గర్భం దాల్చిన క్రమంలో ప్రతి నెలా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకుంటుంది. నెలలు నిండటంతో శనివారం రాత్రి కుటుంబ సభ్యులు శివానిని పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సు వెంకటమ్మ ఆదివారం తెల్లవారుజామున శివానికి పురుడు పోయగా..బాబు జన్మించాడు. గంట అనంతరం ఇడ్లీ తినిపించా లని నర్సు చెప్పడంతో కుటుంబీకులు ఇడ్లీ తెప్పించారు. అయితే ఆ ఇడ్లీలను శివానికి కూర్చోబెట్టకుండా మంచంపై పడుకున్న బాలింతకు అలాగే తినిపించింది. దీంతో ఇడ్లీ శివాని ఊపిరితిత్తులు, గొంతు, ముక్కులో ఇరుక్కుపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను 108 అంబులెన్స్‌లో హైదరాబాద్ కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. పీహెచ్సీ ఎదుట ఆందోళన.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శివాని మృతి చెందిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు మృతదేహాన్ని కందుకూరు పీహెచ్‌సీకి తరలించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకుని వైద్యాధికారులకు సమాచారం అం దించగా వారు అక్కడకు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇడ్లీ ఇరుక్కోవడంతోనే మృతిచెందినట్లు అంగీకరించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. -
బెడ్‌పై నుంచి పడి బాలింత మృతి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): పండంటి మగబిడ్డ పుట్టాడని ఆనందంలో ఉన్న ఓ కుటుంబాన్ని.. గంటల వ్యవధిలోనే విషాదం ముంచెత్తింది. ప్రభుత్వ, సిబ్బంది నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాలను బలితీసుకుంది. పురిటినొప్పులను భరించి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమెకు.. మరో బాలింతతో కలిపి ఓకే మంచం కేటాయించారు. రాత్రంతా పంటి బిగువున బాధను ఓర్చుకొని పడుకున్న ఆమె.. తెల్లారేసరికి మంచంపై నుంచి పడి స్పృహ కోల్పోయి ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన మంగళవారం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగింది. విజయవాడలోని కొత్తపేట శ్రీనివాస మహల్ సెంటర్‌కు చెందిన పి.స్వాతికి పురిటినొప్పులు రావడంతో సోమవారం మధ్యాహ్నం ఆమెను ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. రాత్రి 8.50 గంటల సమయంలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఉమ్మ నీరు తాగాడని శిశువును ప్రత్యేక విభాగానికి తరలించిన సిబ్బంది.. స్వాతిని ప్రసూతి వార్డుకు పంపించారు. అక్కడ పడకలు ఖాళీ లేకపోవడంతో.. మరో బాలింత ఉన్న మంచాన్నే స్వాతికి కూడా కేటాయించారు. రాత్రంతా సర్దుకొని పడుకున్న స్వాతి.. మంగళవారం ఉదయం ఉన్నట్లుండి మంచంపై నుంచి కిందపడిపోయింది. తీవ్ర బాధతో కొద్దిసేపు కాళ్లు, చేతులు కొట్టుకుంది. దీంతో సిబ్బంది ఆమెను లేబర్ వార్డుకు తరలించారు. చికిత్స అందిస్తుండగా స్వాతి మృతి చెందింది. ఈ సమాచారం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్–2 బాబూరావు, అర్బన్ తహశీల్దారు అబ్దుల్ రెహ్మాన్ మస్తాన్లు ప్రభుత్వాస్పత్రికి చేరుకొని బాధితులు, వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇద్దరు బాలింతలకు కలిపి ఒకే మంచం కేటాయించారని, దీని వల్లే స్వాతి కిందపడిపోయిందని కుటుంబ సభ్యులు వాపోయారు. తీవ్ర బాధతో అల్లాడిపోతున్నా కూడా సిబ్బంది పట్టించుకోలేదని బాధితురాలి మరిది నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాము గట్టిగా నిలదీయడంతో చాలాసేపటి తర్వాత చికిత్స కోసమంటూ తీసుకెళ్లారని తెలిపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి స్వాతి మృతి చెందిందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితురాలి భర్త కామేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారని, పోస్టుమార్టం అనంతరం చర్యలు తీసుకుంటామని జేసీ బాబూరావు చెప్పారు. ఫిట్స్ రావడంతోనే: స్వాతి ఫిట్స్ వల్లే మృతి చెందిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. మంగళవారం ఫిట్స్ రావడంతో బెడ్‌పై నుంచి కిందపడిపోయిందని చెప్పారు. సిబ్బంది ఆమెను లేబర్‌వార్డుకు తరలించారని, సిబ్బంది నిర్లక్ష్యమేమీ లేదన్నారు. ఉమ్మనీరు రక్తంలోకి చేరడం వల్లే.. సాక్షి, అమరావతి: ఉమ్మ నీరు రక్తంలోకి చేరడం వల్లే సమస్య తలెత్తి బాలింత మృతి చెందిందని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ బాబ్జీ తెలిపారు. ఆమె రక్తహీనతతో బాధపడుతోందని, డాక్టర్లు సాధారణ ప్రసవమే చేశారని చెప్పారు. అయితే మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఆమె స్పృహ తప్పి బెడ్ మీద నుంచి కింద పడిందని చెప్పారు. -
వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి
పార్వతీపురం టౌన్: పట్టణంలోని జయశ్రీ ఆస్పత్రిలో శనివారం ఓ బాలింత మృతి తీవ్ర ఆందోళనకు దారి తీసింది. తమ గ్రామానికి చెందిన బాలింత మృతికి డాక్టర్ పద్మజే కారణమని పార్వతీపురం మండలంలోని పెదమరికి గ్రామస్తులు ఆరోపించారు. ఆపరేషన్ చేసి కనీసం పట్టించుకోకుండా సిబ్బందికి అప్పగించేసి తన భార్య ప్రాణాలు తీశారని మృతురాలి భర్త వాపోయారు. బాలింత మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి...పెదమరికి గ్రామానికి చెందిన పైల శారద(28)కు శనివారం ఉదయం పురిటి నొప్పులొచ్చాయి. వెంటనే పట్టణంలోని డాక్టర్ వై.వి.పద్మజకు చెందిన జయశ్రీ ఆస్పత్రికి సుమారు ఉదయం 10 గంటల ప్రాంతంలో తీసుకొచ్చా రు. పేషెంట్‌ను చూసిన డాక్టర్ పద్మజ ఆపరేషన్ చేయాలని, రూ.12వేలు ఖర్చవుతుందని చెప్పారు. దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో సుమారు 3.25 గంటలప్రాతంలో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయగా ఆడపిల్ల పుట్టింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ కనీసం పేషెంట్‌ను పట్టించుకోకుండా, సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయారు. కొద్దిసేపటికే పేషెంట్‌కు బ్లీడింగ్ ప్రారంభమైంది. విషయం తెలుసుకున్న డాక్టర్ ‘ఓ-నెగిటివ్’ రక్తం అర్జెంట్‌గా కావాలని కోరడంతో తొలుత మజ్జి పద్మావతి, ఆ తర్వాత మరో ముగ్గురు రక్తాన్నిచ్చారు. అయితే రక్తం ఇచ్చిన వారి నుంచి ఎలాంటి పరీక్షలూ జరపలేదు. దీంతో రక్తం ఎక్కించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి ఏడు గంటలకు విశాఖపట్నం తీసుకెళ్లాలని సూచించారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను విశాఖపట్నానికి తరలిస్తుండగా మృతి చెందినట్లు మార్గమధ్యలో గుర్తించారు. దీంతో గ్రామస్తులంతా ఆస్పత్రి వద్దకు చేరుకొని మృతదేహంతో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మజ భర్త వివేక్‌తో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రి బయట మెయిన్ రోడ్డుపై బైఠాయించి, డాక్టర్‌ను అరెస్ట్ చేసి, న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ లోపు పట్టణానికి చెందిన కొంతమంది వైద్యులు, పట్టణ ఎస్సైలు వి.అశోక్ కుమార్, బి.సురేంద్రనాయుడులు తమ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని వారించేందుకు యత్నించారు. అయినా వారు ససేమిరా అనడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ గది తలుపు అద్దం ముక్కలైంది. ఈ సందర్భంగా బంధువులు మాట్లాడుతూ, ఆస్పత్రిలోనే బాలింత చనిపోయినప్పటికీ ఏమీ ఎరగనట్లు తమను మోసం చేసి విశాఖపట్నం తీసుకెళ్లాలని చెప్పారని ఆరోపించారు. అలాగే ఎనస్తీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేశారన్నారు. ‘బిడ్డ సంచి ముడుచుకుపోకపోవడం వల్లే’ ఈ విషయమై డాక్టర్ పద్మజ వద్ద ప్రస్తావించగా ‘డెలివరీ తర్వాత బిడ్డ సంచి ముడుచుకుపోకపోవడం, రక్తం గడ్డ కట్టకపోవడం, వల్ల అధికంగా రక్త స్రావం అయ్యింది. రక్తం అవసరమంటే రక్తం ఇచ్చారు. 3 ప్యాకెట్లు ఎక్కించాం. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో తర్వాత ప్రయత్నానికి ఇక్కడ వసతులు లేకపోవడంతో విశాఖ రిఫర్ చేశాం. ఎనస్తీయన్ రామారావు సమక్షంలోనే ఆపరేషన్ చేశాం. కొన్ని వేల కేసుల్లో అరుదుగా ఇలాంటివి చోటు చేసుకుంటుంటాయి’ అని తెలిపారు.