వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి
పార్వతీపురం టౌన్: పట్టణంలోని జయశ్రీ ఆస్పత్రిలో శనివారం ఓ బాలింత మృతి తీవ్ర ఆందోళనకు దారి తీసింది. తమ గ్రామానికి చెందిన బాలింత మృతికి డాక్టర్ పద్మజే కారణమని పార్వతీపురం మండలంలోని పెదమరికి గ్రామస్తులు ఆరోపించారు. ఆపరేషన్ చేసి కనీసం పట్టించుకోకుండా సిబ్బందికి అప్పగించేసి తన భార్య ప్రాణాలు తీశారని మృతురాలి భర్త వాపోయారు. బాలింత మృతి విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేశారు. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి...పెదమరికి గ్రామానికి చెందిన పైల శారద(28)కు శనివారం ఉదయం పురిటి నొప్పులొచ్చాయి. వెంటనే పట్టణంలోని డాక్టర్ వై.వి.పద్మజకు చెందిన జయశ్రీ ఆస్పత్రికి సుమారు ఉదయం 10 గంటల ప్రాంతంలో తీసుకొచ్చా రు. పేషెంట్‌ను చూసిన డాక్టర్ పద్మజ ఆపరేషన్ చేయాలని, రూ.12వేలు ఖర్చవుతుందని చెప్పారు.
దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో సుమారు 3.25 గంటలప్రాతంలో ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయగా ఆడపిల్ల పుట్టింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ కనీసం పేషెంట్‌ను పట్టించుకోకుండా, సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయారు. కొద్దిసేపటికే పేషెంట్‌కు బ్లీడింగ్ ప్రారంభమైంది. విషయం తెలుసుకున్న డాక్టర్ ‘ఓ-నెగిటివ్’ రక్తం అర్జెంట్‌గా కావాలని కోరడంతో తొలుత మజ్జి పద్మావతి, ఆ తర్వాత మరో ముగ్గురు రక్తాన్నిచ్చారు. అయితే రక్తం ఇచ్చిన వారి నుంచి ఎలాంటి పరీక్షలూ జరపలేదు. దీంతో రక్తం ఎక్కించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి ఏడు గంటలకు విశాఖపట్నం తీసుకెళ్లాలని సూచించారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఆమెను విశాఖపట్నానికి తరలిస్తుండగా మృతి చెందినట్లు మార్గమధ్యలో గుర్తించారు. దీంతో గ్రామస్తులంతా ఆస్పత్రి వద్దకు చేరుకొని మృతదేహంతో ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ పద్మజ భర్త వివేక్‌తో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రి బయట మెయిన్ రోడ్డుపై బైఠాయించి, డాక్టర్‌ను అరెస్ట్ చేసి, న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ లోపు పట్టణానికి చెందిన కొంతమంది వైద్యులు, పట్టణ ఎస్సైలు వి.అశోక్ కుమార్, బి.సురేంద్రనాయుడులు తమ సిబ్బందితో ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని వారించేందుకు యత్నించారు. అయినా వారు ససేమిరా అనడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ గది తలుపు అద్దం ముక్కలైంది. ఈ సందర్భంగా బంధువులు మాట్లాడుతూ, ఆస్పత్రిలోనే బాలింత చనిపోయినప్పటికీ ఏమీ ఎరగనట్లు తమను మోసం చేసి విశాఖపట్నం తీసుకెళ్లాలని చెప్పారని ఆరోపించారు. అలాగే ఎనస్తీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేశారన్నారు.
‘బిడ్డ సంచి ముడుచుకుపోకపోవడం వల్లే’
ఈ విషయమై డాక్టర్ పద్మజ వద్ద ప్రస్తావించగా ‘డెలివరీ తర్వాత బిడ్డ సంచి ముడుచుకుపోకపోవడం, రక్తం గడ్డ కట్టకపోవడం, వల్ల అధికంగా రక్త స్రావం అయ్యింది. రక్తం అవసరమంటే రక్తం ఇచ్చారు. 3 ప్యాకెట్లు ఎక్కించాం. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో తర్వాత ప్రయత్నానికి ఇక్కడ వసతులు లేకపోవడంతో విశాఖ రిఫర్ చేశాం. ఎనస్తీయన్ రామారావు సమక్షంలోనే ఆపరేషన్ చేశాం. కొన్ని వేల కేసుల్లో అరుదుగా ఇలాంటివి చోటు చేసుకుంటుంటాయి’ అని తెలిపారు.