బతుకు చిత్రం
అందరి బతుకు కోరుకునే బతుకమ్మకు.. బతుకులో ఎదురయ్యే కష్టాల గురించి తెలుసు. ఆ బతుకమ్మ రైతుబిడ్డయితే.. పల్లెలోని ప్రతి గడప గోడు ఆమెకు ఇంకా బాగా తెలుసు. ఈ అంశాన్ని ఆధారంగా ‘బతుకమ్మ’ పేరుతో సినిమా తీసి అందరి మన్ననలు పొందిన డెరైక్టర్ తోట ప్రభాకర్. చిన్ననాటి నుంచి చూసిన కన్నఊరి కష్టాలనే కథాంశంగా.. తెలంగాణ పల్లె పొద్దు.. సద్దు.. బతుకు.. చావు అన్నీ కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆ చిత్రం గురించి ఆయన చెప్పిన విశేషాలు..
వరంగల్ దగ్గర చిట్యాల మా ఊరు. నాన్న లక్ష్మయ్య ఓ సాధారణ రైతు. నేను కూడా ఆయన వెంటే వ్యవసాయం చేసుకుంటూ బతికాను. కట్ చేస్తే.. దర్శకుడినయ్యా.. పల్లె బతుకులపై ఓ సినిమా తీయాలని చాలా కథలు తయారుచేసుకున్నాను. వాటిలో ‘బతుకమ్మ’ కథాంశం చక్కగా కుదిరింది. దీంతో 2008లో సినిమా తీశాను. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం అన్నీ నేనే అందించాను. పాటలు గోరెటి వెంకన్న, అంద్శై రాశారు. ఆరు నెలల్లో చిత్ర నిర్మాణం పూర్తయింది.
సహజత్వానికి దగ్గరగా..
టైటిల్ రోల్‌కు తెలంగాణ అమ్మాయి అయితే బాగుండని చాలా వెతికాం. ఎవరూ సూట్ అవ్వలేదు. చాలామంది సింధూతులానీ పేరు చెప్పారు. ఆమె అమెరికాలో ఉండగా నేను ఫోన్ చేసి అడిగాను. వెంట నే ఓకే చెప్పింది. మొదటి రోజు షూటింగ్లో హీరోయిన్‌కు మేకప్ వేసి షూటింగ్ చేశాం. ఎక్కడో సహజత్వానికి దూరంగా ఉన్నట్టు అనిపించింది. తర్వాత మేకప్ లేకుండా తీశాం నేచురల్ గా వచ్చింది. ఆమె కట్టే చీరలు కూడా పాతవాటిని ఎంపిక చేశాం. కొన్ని సన్నివేశాల్లో కాస్ట్యూమ్స్‌కు మట్టి పూశాం. సినిమా మొత్తం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో చిత్రీకరించాం. కొన్ని సన్నివేశాల్లో నటించడానికి లోకల్‌గా ఉన్నవాళ్లనే తీసుకున్నాం.
నందినెక్కిన బతుకమ్మ..
సినిమా రిలీజ్ తర్వాత ఓపెనింగ్స్ భారీగా లేకపోవడంతో నేను టెన్షన్ పడ్డాను. ఫస్ట్ వీక్ పొగడ్తలు లేవు.. విమర్శలు లేవు.. అసలు ఏ టాక్ లేదు. తర్వాత సీన్ మారిపోయింది. అద్భుతమైన సినిమా అని మెచ్చుకోలు వినిపించింది. ఓ రోజు వరవరరావుగారు ఫోన్ చేసి ‘సినిమా చాలా బాగా తీశారు. మీ సినిమా చూసి నేను, మా మిత్రులు రెండు గంటలు చర్చించుకున్నాం’ అన్నారు. దర్శకుడిగా ‘బతుకమ్మ’ నాకు ఎనిమిదో సినిమా. సంగీత దర్శకుడిగా రెండోది.
అన్నింటికన్నా గొప్ప విషయం.. నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా. ఒక ప్రాంత ప్రజలు పడ్డ కష్టాలను, సంప్రదాయాలను చూపించే సినిమా అంటే.. నిర్మాణానికి ముందుకొచ్చే వారు అరుదు. అలాంటిది.. నా కథ విని సినిమాను నిర్మించిన పొనుగోటి రామ్మోహన్, మక్కపాటి చంద్రశేఖర్‌రావు, రాజేశ్వరరావులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏటా ‘బతుకమ్మ’ పండుగ వచ్చినప్పుడల్లా నా సినిమా గుర్తుకువస్తుంది.. ఇంతకన్నా గుర్తింపు ఏముంటుంది చెప్పండి.
- భువనేశ్వరి