Prabhat
-
ప్రభాత్ స్పిన్... శ్రీలంక విన్
గాలే: లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (4/136; 5/68) స్పిన్ మాయాజాలంతో శ్రీలంకను గెలిపించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టడంతో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై గెలిచింది. ఆఖరి రోజు లాంఛనం ముగిసేందుకు 3.4 ఓవర్లే సరిపోయాయి. ప్రభాత్ తన వరుస ఓవర్లలోనే మిగతా రెండు వికెట్లను పడేయడంతో కివీస్ ఐదోరోజు ఆటలో కేవలం 4 పరుగులే చేయగలిగింది. దీంతో ఓవర్‌నైట్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సోమవారం 207/8 ఓవర్‌నైట్ స్కోరుతో చివరిరోజు ఆటకొనసాగించిన కివీస్ ఆలౌట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. 70వ ఓవర్ వేసిన ప్రభాత్ జయసూర్య స్పిన్‌ను ఎదుర్కోలేక రచిన్ రవీంద్ర (168 బంతుల్లో 92; 9 ఫోర్లు, 1 సిక్స్) తన క్రితం రోజు స్కోరుకు కేవలం పరుగు మాత్రమే జోడించి వికెట్ల ముందు దొరికిపోయాడు. మళ్లీ తన తదుపరి ఓవర్లో ప్రభాత్... ఆఖరి వరుస బ్యాటర్ విలియమ్ ఓ రూర్కే (0)ను బౌల్డ్ చేయడంతో 71.4 ఓవర్లలో 211 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 305 పరుగులు చేయగా, కివీస్ 340 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు (309) మూడొందల పైచిలుకు పరుగులు చేయడంతో ఉపఖండపు స్పిన్ పిచ్‌లపై 275 పరుగుల లక్ష్యం న్యూజిలాండ్‌కు అసాధ్యమైంది. ఇదే వేదికపై చివరి రెండో టెస్టు ఈ నెల 26 నుంచి 30 వరకు జరుగుతుంది. -
దీని ధర కోటి రూపాయలు మాత్రమే!!
విలాసవంతమైన జీవితం అనుభవించేవారు అంతకంటే అందమైన, లగ్జరీ కారు కావాలని కోరుకుంటారు. లక్షల ఖరీదు చేసే ఏ ఆడినో, ఏ బిఎండబ్ల్యూ కారునో సొంతం చేసుకోవాలనుకుంటారు కదా...కానీ ఓ వ్యాపార వేత్త ఓ అరుదైన అశ్వరాజు మీద మోజు పడ్డాడు. రాజస్థాన్‌కు చెందిన నారాయణ్ సిన్హా ప్రభాత్ అనే గుర్రాన్ని కొనుకున్నాడు. దాని ఖరీదు ఎంతో తెలిస్తే మనం నోరెళ్ల బెట్టాల్సిందే. కోటి పదకొండు లక్షలు వెచ్చించి మరీ ఆ గుర్రాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు అంతకంటే విలాసవంతమైన మరెన్నో సౌకర్యాలు కల్పించాడు. అతి ఖరీదైన కారు ఎస్ యూవీ గ్రాండ్ చిరోకి సుమారు 94 లక్షల కంటే, ఎక్కువ ధర పలికింది ఈ ప్రభాత్. అన్నట్టు మహారాణా ప్రతాప్ ఉపయోగించిన అశ్వం చేతక్ కూడా మార్వారి జాతిదేనట. రాజస్థాన్‌లో ప్రాపర్టీ అండ్ మైనింగ్ వ్యాపారం చేసే నారాయణ్ సిన్హా ప్రఖ్యాత మార్వాడి జాతి కి చెందిన ప్రభాత్ ను (మగ గుర్రం) భవార్సిన్హ్ రాథోడ్ నుంచి ఒక కోటి 11 లక్షల రూపాయలకు కోనుగోలు చేశాడు. అంతటితో ఆయన ముచ్చట తీరలేదు. దాన్ని చూసుకునేందుకు ముగ్గురు ఉద్యోగులు. వైద్య సేవలు అందించడానికి ఓ డాక్టర్. స్నానం చేయడానికి ప్రత్యేక స్విమ్మింగ్ పూల్. ఇలాంటి ఖరీదైన సౌకర్యాలతో పాటు, ప్రత్యేక ఆహారం నియమావళి ఏర్పాటు చేశాడు. మొక్కజొన్న, గోధుమ, సోయాబీన్, పాలు, దేశీ నెయ్యి నుండి మొదలుకొని ఆహార పదార్థాలన్నీ ప్రత్యేక మైనవే. దీంతోపాటూ ఖరీదైన షాంపూలతో స్నానం, మసాజ్ తప్పనిసరి. ఇంతటి విశేషమైన గుర్రానికి శిక్షణ ఇస్తోంది మాత్రం ఫ్రాన్స్ చెందిన ఓ మహిళ. ప్రభాత్ అంటే తనకు చాలా ఇష్టంమనీ, అది కేవలంగుర్రం మాత్రమే కాదు తనకు మంచి స్నేహితుడని నారాయణ సిన్హా చెప్పారు. తన గుండె లో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు మార్వారిజాతి గుర్రాలు చాలా తెలివైనవనీ, మంచి బలిష్టంగా, సామర్థ్యంతో ఉంటాయని గుర్రం నిపుణుడు డాక్టర్ అజిత్ రావు తెలిపారు. జైపూర్ చెందిన కన్హయ్య,జోధ్‌పూర్ గాంగౌర్ కు పుట్టిన ప్రభాత్ ఎన్నో ప్రదర్శనలలో విలువైన బహుమతులు గెల్చుకుందని ఆయన తెలిపారు. -
వివేకానందునిపై తొలి తెలుగు సినిమా
ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువతరం మనకు కావాలనీ, ఆరోగ్యమే మహాభాగ్యమని జగత్తుకు చాటి, భారతీయత గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు తెలిసొచ్చేట్టు చేసిన గొప్ప తత్వవేత్త వివేకానందుడు. ఆయన జీవితం ఆధారంగా తెలుగుతెరపై ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఆ లోటును భర్తీ చేస్తూ రూపొందిన చిత్రం ‘స్వామి వివేకానంద’. వివేకానందునిగా ప్రముఖ రాజకీయ నాయకుడు కీ.శే. పీజేఆర్ మనవడు ప్రభాత్ నటించారు. సురేష్ బుజ్జి కేవీఎస్ దర్శకుడు. జి.ఆర్.రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. మా చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి, తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రశంసించిన సెన్సార్ సభ్యులకు కృతజ్ఞతలని దర్శకుడు చెప్పారు. త్వరలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకను, డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ చిత్రానికి: కథ, మాటలు: రమేశ్రాయ్, కూర్పు: నందమూరి హరి, కళ: కెవీ రమణ, నిర్మాణం: లక్ష్మీ గణేశ ఫిలిమ్స్-శ్రీఇంద్రచిత్ర.