
మొత్తం 9 వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్
తొలి టెస్టులో 63 పరుగులతో కివీస్‌పై గెలుపు
26 నుంచి చివరి టెస్టు
గాలే: లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (4/136; 5/68) స్పిన్ మాయాజాలంతో శ్రీలంకను గెలిపించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టడంతో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై గెలిచింది. ఆఖరి రోజు లాంఛనం ముగిసేందుకు 3.4 ఓవర్లే సరిపోయాయి. ప్రభాత్ తన వరుస ఓవర్లలోనే మిగతా రెండు వికెట్లను పడేయడంతో కివీస్ ఐదోరోజు ఆటలో కేవలం 4 పరుగులే చేయగలిగింది. దీంతో ఓవర్‌నైట్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సోమవారం 207/8 ఓవర్‌నైట్ స్కోరుతో చివరిరోజు ఆటకొనసాగించిన కివీస్ ఆలౌట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. 70వ ఓవర్ వేసిన ప్రభాత్ జయసూర్య స్పిన్‌ను ఎదుర్కోలేక రచిన్ రవీంద్ర (168 బంతుల్లో 92; 9 ఫోర్లు, 1 సిక్స్) తన క్రితం రోజు స్కోరుకు కేవలం పరుగు మాత్రమే జోడించి వికెట్ల ముందు దొరికిపోయాడు. మళ్లీ తన తదుపరి ఓవర్లో ప్రభాత్... ఆఖరి వరుస బ్యాటర్ విలియమ్ ఓ రూర్కే (0)ను బౌల్డ్ చేయడంతో 71.4 ఓవర్లలో 211 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది.
తొలి ఇన్నింగ్స్‌లో లంక 305 పరుగులు చేయగా, కివీస్ 340 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు (309) మూడొందల పైచిలుకు పరుగులు చేయడంతో ఉపఖండపు స్పిన్ పిచ్‌లపై 275 పరుగుల లక్ష్యం న్యూజిలాండ్‌కు అసాధ్యమైంది. ఇదే వేదికపై చివరి రెండో టెస్టు ఈ నెల 26 నుంచి 30 వరకు జరుగుతుంది.