prafulla kumar mahanta
-
Assam: ఎగసిపడిన కెరటం.. అస్సాం గణ పరిషత్!
అస్సాం రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం అస్సాం గణ పరిషత్ (ఏజీపీ). ఒకప్పుడు అస్సాం అంటే ఏజీపీ అనే స్థాయి నుండి ఇప్పుడు ఆ పార్టీ ఉనికి కోసం పోరాడే పరిస్థితికి చేరుకుంది. ఆ పార్టీ ప్రస్థానం ఎన్నో ప్రాంతీయ పార్టీలకు పాఠాలు నేర్పుతుంది. అస్సాం గణ పరిషత్ సాధారణ రాజకీయ పార్టీ కాదు. ఇది ఒక సుదీర్ఘ పోరాటం నుంచి పుట్టిన పార్టీ. 1979 నుంచి 1985 వరకు అస్సాంలో అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన భారీ ఉద్యమం దీనికి పునాది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటం ఫలితంగా అస్సాం ఒప్పందం కుదిరింది. ఆ వెంటనే విద్యార్థి నేతలు ప్రఫుల్ల కుమార్ మహంత నాయకత్వంలో ఏజీపీని స్థాపించారు. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించింది. కేవలం 32 ఏళ్ల వయసులోనే ప్రఫుల్ల కుమార్ మహంత ముఖ్యమంత్రి కావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఉద్యమ ఆకాంక్షలతో అధికారంలోకి వచ్చిన ఏజీపీ ప్రజల ఆశలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ముఖ్యంగా ఏ అక్రమ వలసల అంశంపై అయితే పార్టీ పుట్టిందో ఆ సమస్యను పరిష్కరించడంలో పాలకులు చొరవ చూపలేకపోయారు. దీనికి తోడు పార్టీ అంతర్గత కుమ్ములాటలు అవినీతి ఆరోపణలు పాలనా వైఫల్యాలు పార్టీని బలహీనపరిచాయి. నేతల మధ్య పెరిగిన ఆధిపత్య పోరు కారణంగా కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన నేతలు క్రమంగా పదవుల కోసం పాకులాడటం ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసింది.దెబ్బతీసిన స్నేహం..ఏజీపీ పతనానికి ప్రధాన కారణం జాతీయ పార్టీలతో అది చేసిన స్నేహమనే చెప్పొచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఈ ప్రాంతీయ పార్టీ కాలక్రమేణా తన ప్రత్యేకతను కోల్పోయింది. అస్సాంలో బీజేపీ బలోపేతం కావడం ఏజీపీకి శాపంగా మారింది. బీజేపీ జాతీయవాదం ముందు ఏజీపీ ప్రాంతీయ వాదం వెలవెలబోయింది. చివరకు అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి రావడం ఆ పార్టీకి మరింత నష్టాన్ని మిగిల్చింది. పౌరసత్వ సవరణ చట్టం వంటి కీలక అంశాల్లో ఏజీపీ ద్వంద్వ వైఖరి అవలంబించడం వల్ల తన సంప్రదాయ ఓటు బ్యాంకును పూర్తిగా కోల్పోయింది.ఏజీపీలో మొదటి నుండి సామూహిక నాయకత్వం కొరవడింది. ప్రఫుల్ల కుమార్ మహంత వంటి సీనియర్ నేతలను పక్కన పెట్టడం పార్టీలో చీలికలకు దారితీసింది. సరైన రెండో శ్రేణి నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడింది. సమర్థులైన నాయకులు చాలా మంది బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. పార్టీ కేడర్ సైతం తమ భవిష్యత్తు కోసం జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపారు. నేడు ఏజీపీ కేవలం ఒక జూనియర్ భాగస్వామిగా మాత్రమే మిగిలిపోయింది. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే శక్తిని ఆ పార్టీ కోల్పోయింది. ఏజీపీ పతనం ఒక హెచ్చరిక..ఏజీపీ పతనం దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక హెచ్చరిక. కేవలం భావోద్వేగపూరిత ఉద్యమాలతో అధికారంలోకి రావడం సులభమే కానీ ఆ భావజాలాన్ని పాలనలో చూపిస్తూ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం కష్టమని ఈ పార్టీ నిరూపించింది. సిద్ధాంతాల కంటే అధికారమే ముఖ్యం అనుకున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయని ఏజీపీ చరిత్ర చెబుతోంది. అస్సాం ప్రజలు ఇప్పుడు ప్రాంతీయ అస్తిత్వం కోసం సరికొత్త వేదికలను వెతుక్కుంటున్నారు. ఏజీపీ మాత్రం తన గత వైభవం వైపు దీనంగా చూస్తోంది. ప్రస్తుతం అస్సాం అసెంబ్లీలో ఏజీపీ సంఖ్య నామమాత్రంగా మారింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే స్థాయిని కూడా ఆ పార్టీ కోల్పోయింది. బీజేపీ వేవ్ లో తనను తాను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు ఆ పార్టీ దయనీయ స్థితిని సూచిస్తున్నాయి. మళ్లీ పుంజుకోవాలంటే పార్టీ మూలాల్లోకి వెళ్లి ఉద్యమ స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంగానే కనిపిస్తోంది. -
డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె!
గౌహతి: ఓ ఆటోడ్రైవర్‌ను మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హై సెక్యూరిటీ మధ్య డ్రైవర్‌ను మొకాళ్లపై కూర్చొబెట్టి మాజీ సీఎం కుమార్తె చెప్పుతో కొడుతున్న దృశ్యాల్ని స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.అస్సాం రాజధాని గౌహతిలోని శివారు ప్రాంతమైన డిస్పూర్లోని రాష్ట్ర ప్రజాప్రతినిధులు నివాసం ఉండే ఎమ్మెల్యే హాస్టల్లో మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ప్రజోయితా కశ్యప్ ఆటోడ్రైవర్‌ను దుర్భాషలాడుతూ చితక బాదారు.A video of an incident allegedly involving former Assam CM Prafulla Kumar Mahanta's daughter, has gone viral on social media.The footage purportedly shows her thrashing the driver and making him hold his ear, leading to accusations of mental harassment. The incident reportedly… pic.twitter.com/ibx9EKoReV— India Today NE (@IndiaTodayNE) March 3, 2025ఈ ఘటన వెలుగులోకి ప్రజోయితా కశ్యప్ స్పందించారు. బాధితుడు తన ఇంట్లో సుదీర్ఘకాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పుడూ తాగుతూ ఉంటాడు. తాగిన ప్రతీసారి నా గురించి చెడుగా మాట్లాడేవాడు. ఇది సరైన పద్దతి కాదని పలు మార్లు చెప్పా.ఈ విషయం అందరికి తెలుసు.ఈ రోజు మద్యం మత్తులో మా ఇంటి బాదాడు. అందుకే కొట్టా’నని తెలిపారు. అయితే, అసభ్యంగా ప్రవర్తించే డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారా? బాధితుడు ప్రభుత్వ డ్రైవరా? ప్రైవేట్ డ్రైవరా? అని ప్రశ్నిస్తే ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్లకుమార్ మహంత రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
మాజీ సీఎంకు గాయాలు
గువాహటి: అసోం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంతా రోడ్డు ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రయాణిస్తున్న కారు నాగాన్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. నిలిపివుంచిన ట్రక్కును కారు ఢీకొనడంతో ఈ దర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రపుల్లకుమార్ కుమారుడితో పాటు ముగ్గురు గాయపడ్డారు. వీరందరినీ నాగాన్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని సన్నిహితులు తెలిపారు. ప్రపుల్ల కుమార్... గువాహటి నుంచి తన నియోజకవర్గం బర్హంపూర్ కు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలు వెంటనే వెల్లడి కాలేదు. -
'1950 నుంచి నిర్లక్ష్యం చేశారు'
గౌహతి: ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులకు కాంగ్రెస్ నిర్లక్ష్యపు విధానాలే కారణమని అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్లా కుమార్ మహంతా మండిపడ్డారు. ఈ విధానం 1950 నుంచి కొనసాగుతుండటం వల్లే రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. అస్సోం గణపరిషత్ (ఏజీపీ) 30 వ వార్షికోత్సవంలో భాగంగా ఆరంభ వేడుకలకు విచ్చేసిన మహంతా.. రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో నేటి పరిస్ధితులకు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కారణమన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అంధఃపాతాళానికి నెట్టేశాయని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు కేంద్ర ఏమి అడిగినా ఇస్తుందన్న ముఖ్యమంత్రి తరుణ్ గోగయ్.. వరదల సమయంలో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లభించడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అస్సాంలో శాంతి యుత వాతావరణంతో పాటు అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీలు ఆసక్తి కనబరచలేదని ఆయన స్పష్టం చేశారు. -
ఏనుగు చతికిలబడిపోయింది
ఒకప్పుడు ఆ ఏనుగు కదిలితే అందరూ గడగడలాడిపోయేవారు. కానీ అదే ఏనుగు ఇప్పుడు పూర్తిగా చతికిలబడిపోయింది. ఎంత చేసినా మళ్లీ లేచి నిలబడటం లేదు. ఏనుగుని నిలబెట్టేంత బలం ఎవరికీ లేదు. ఈశాన్య భారతంలోని అసొం రాష్ట్ర రాజకీయాలను మూడు దశాబ్దాలు శాసించిన అసొం గణపరిషత్ పరిస్థితి దాని ఎన్నికల గుర్తైన ఏనుగు లాగానే ఉంది. అసొం గణపరిషత్ (ఏజీపీ) లేవలేదు. లేస్తే నడవలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు 62 ఏళ్ల ప్రఫుల్ల కుమార్ మహంత కూడా పార్టీకి కొత్త ఊపిరి నింపలేకపోతున్నారు. నింగికెగిరి.... నేలరాలిన నేత.... నిజానికి ప్రఫుల్ల కుమార్ మహంత దేశంలో చాలా విలక్షణమైన ముఖ్యమంత్రి. కాలేజీ హాస్టల్ నుంచి సరాసరి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారాయన. కనీసం వార్డు మెంబర్ గానైనా పోటీ చేయకుండా ఏకంగా సీఎం అయ్యారాయన. ముఖ్యమంత్రి అయిన తరువాత పెళ్లి చేసుకున్న ఏకైక సీఎం బహుశః ఆయనేనేమో. 1980 వ దశకంలో అసొం నుంచి విదేశీయులను తరిమేయాలన్న డిమాండ్ తో జరిగిన భారీ ఉద్యమం నుంచి ప్రఫుల్ల కుమార్ మహంత పుట్టుకొచ్చారు. గువహటి విశ్వవిద్యాలయంలో మామూలు విద్యార్థిగా ఉన్న మహంత ఈ ఉద్యమంలో అసొం విద్యార్థి సంస్థ 'ఆసు' నాయకుడిగా ఉద్యమానికి సారథ్యం వహించారు. 1985 లో అసొం ఒప్పందం తరువాత ఈ ఉద్యమసంస్థలన్నీ అసొం గణపరిషత్ గా ఏర్పడ్డాయి. 1986 లో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ అనుభవరాహిత్యం, అంతర్గత కలహాలతో ఏజీపీ కొద్ది రోజులకే అన్ పాపులర్ అయిపోయింది. ప్రఫుల్ల కుమార్ మహంత తన లెక్చరర్ జయశ్రీ గోస్వామిని వివాహం చేసుకోవడం, ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన వివాహేతర సంబంధం బట్టబయలు కావడం వంటి సంఘటనలు పార్టీని మరింత దిగజార్చాయి. అయిదేళ్ల తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 1997 లో మళ్లీ అధికారంలోకి వచ్చినా ఏజీపీ తీరు మారలేదు. పార్టీ నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరో వైపు ఉల్ఫా ఉగ్రవాదం కూడా ప్రబలింది. 2000 లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచీ గత పదమూడేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నానాటికీ బలోపేతం అవుతున్నారు. పతనం దిశగా పరుగు 2004 నుంచి జరిగిన అన్ని లోకసభ ఎన్నికల్లో ఏజీపీ పతనం దిశగా పరుగు కొనసాగిస్తూనే వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 సీట్లలో ఏజీపీ కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకుని రాజకీయ మైదానం నుంచి దాదాపుగా వైదొలగింది. బంగ్లాదేశీ వలసదారులకు ప్రాతినిథ్యం వహించే ఆలిండియా యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్ ప్రధాన ప్రతిపక్షం అయింది. బంగ్లాదేశీ వ్యతిరేక ఉద్యమం నడిపిన అసొం లో బంగ్లాదేశీ వలసదారులే ప్రధాన రాజకీయ ప్రతిపక్షం అయి కూచోవడం విడ్డూరమే కాదు. విషాదం కూడా. మరో వైపు బిజెపి నానాటికీ బలపడుతోంది. ఇదే కొనసాగితే రాష్ట్ర రాజకీయాల్లో ఏజీపి కేవలం పేకాటలో జోకర్ గా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం లోకసభలో ఏజీపీకి ఒకే ఒక్క సీటు ఉంది. ఈ సారి ఎన్నికల్లో అది కూడా నిలబెట్టుకుంటుందా అన్నది అనుమానమే. రాజకీయంగా పరాజితుడైన నాయకుడిగా ప్రఫుల్ల మహంత నిలిచిపోతారా? దేశంలో పుట్టి, గిట్టిన అనేక పార్టీల్లో ఏజీపీ కూడా ఒకటిగా మిగిలిపోతుందా? లేక ఏదైనా అద్భుతం జరిగి ఏనుగు లేచి నిలబడి, మళ్లీ పరుగులు తీస్తుందా? జస్ట్ 40 రోజులాగండి.... తెలిసిపోతుంది.


