ఏనుగు చతికిలబడిపోయింది
ఒకప్పుడు ఆ ఏనుగు కదిలితే అందరూ గడగడలాడిపోయేవారు. కానీ అదే ఏనుగు ఇప్పుడు పూర్తిగా చతికిలబడిపోయింది. ఎంత చేసినా మళ్లీ లేచి నిలబడటం లేదు. ఏనుగుని నిలబెట్టేంత బలం ఎవరికీ లేదు.
ఈశాన్య భారతంలోని అసొం రాష్ట్ర రాజకీయాలను మూడు దశాబ్దాలు శాసించిన అసొం గణపరిషత్ పరిస్థితి దాని ఎన్నికల గుర్తైన ఏనుగు లాగానే ఉంది. అసొం గణపరిషత్ (ఏజీపీ) లేవలేదు. లేస్తే నడవలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు 62 ఏళ్ల ప్రఫుల్ల కుమార్ మహంత కూడా పార్టీకి కొత్త ఊపిరి నింపలేకపోతున్నారు.
నింగికెగిరి.... నేలరాలిన నేత....
నిజానికి ప్రఫుల్ల కుమార్ మహంత దేశంలో చాలా విలక్షణమైన ముఖ్యమంత్రి. కాలేజీ హాస్టల్ నుంచి సరాసరి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారాయన. కనీసం వార్డు మెంబర్ గానైనా పోటీ చేయకుండా ఏకంగా సీఎం అయ్యారాయన. ముఖ్యమంత్రి అయిన తరువాత పెళ్లి చేసుకున్న ఏకైక సీఎం బహుశః ఆయనేనేమో.
1980 వ దశకంలో అసొం నుంచి విదేశీయులను తరిమేయాలన్న డిమాండ్ తో జరిగిన భారీ ఉద్యమం నుంచి ప్రఫుల్ల కుమార్ మహంత పుట్టుకొచ్చారు. గువహటి విశ్వవిద్యాలయంలో మామూలు విద్యార్థిగా ఉన్న మహంత ఈ ఉద్యమంలో అసొం విద్యార్థి సంస్థ 'ఆసు' నాయకుడిగా ఉద్యమానికి సారథ్యం వహించారు. 1985 లో అసొం ఒప్పందం తరువాత ఈ ఉద్యమసంస్థలన్నీ అసొం గణపరిషత్ గా ఏర్పడ్డాయి. 1986 లో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
కానీ అనుభవరాహిత్యం, అంతర్గత కలహాలతో ఏజీపీ కొద్ది రోజులకే అన్ పాపులర్ అయిపోయింది. ప్రఫుల్ల కుమార్ మహంత తన లెక్చరర్ జయశ్రీ గోస్వామిని వివాహం చేసుకోవడం, ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన వివాహేతర సంబంధం బట్టబయలు కావడం వంటి సంఘటనలు పార్టీని మరింత దిగజార్చాయి.
అయిదేళ్ల తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 1997 లో మళ్లీ అధికారంలోకి వచ్చినా ఏజీపీ తీరు మారలేదు. పార్టీ నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరో వైపు ఉల్ఫా ఉగ్రవాదం కూడా ప్రబలింది. 2000 లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచీ గత పదమూడేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నానాటికీ బలోపేతం అవుతున్నారు.
పతనం దిశగా పరుగు
2004 నుంచి జరిగిన అన్ని లోకసభ ఎన్నికల్లో ఏజీపీ పతనం దిశగా పరుగు కొనసాగిస్తూనే వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 సీట్లలో ఏజీపీ కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకుని రాజకీయ మైదానం నుంచి దాదాపుగా వైదొలగింది. బంగ్లాదేశీ వలసదారులకు ప్రాతినిథ్యం వహించే ఆలిండియా యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్ ప్రధాన ప్రతిపక్షం అయింది. బంగ్లాదేశీ వ్యతిరేక ఉద్యమం నడిపిన అసొం లో బంగ్లాదేశీ వలసదారులే ప్రధాన రాజకీయ ప్రతిపక్షం అయి కూచోవడం విడ్డూరమే కాదు. విషాదం కూడా.
మరో వైపు బిజెపి నానాటికీ బలపడుతోంది. ఇదే కొనసాగితే రాష్ట్ర రాజకీయాల్లో ఏజీపి కేవలం పేకాటలో జోకర్ గా మారిపోయే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం లోకసభలో ఏజీపీకి ఒకే ఒక్క సీటు ఉంది. ఈ సారి ఎన్నికల్లో అది కూడా నిలబెట్టుకుంటుందా అన్నది అనుమానమే. రాజకీయంగా పరాజితుడైన నాయకుడిగా ప్రఫుల్ల మహంత నిలిచిపోతారా? దేశంలో పుట్టి, గిట్టిన అనేక పార్టీల్లో ఏజీపీ కూడా ఒకటిగా మిగిలిపోతుందా? లేక ఏదైనా అద్భుతం జరిగి ఏనుగు లేచి నిలబడి, మళ్లీ పరుగులు తీస్తుందా?
జస్ట్ 40 రోజులాగండి.... తెలిసిపోతుంది.