AGP
-
ఏజీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న అసోం గణ పరిషత్ (ఏజీపీ) 25 మంది అభ్యర్థులతో తొలి జాబితాను గురువారం ప్రకటించింది. బీజేపీ పోటీ చేసే చోట తమ పార్టీ స్నేహపూర్వక పోటీకి దిగుతుందని ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా తెలిపారు. కాగా, తమిళనాడులో తన పొత్తు కోసం తీవ్రంగా కుస్తీలు పట్టిన డీఎంకే, బీజేపీలకు దేశీయ ద్రావిడ ముర్పోక్కు కళగం(డీఎండీకే) అధినేత విజయకాంత్ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు గురువారం చెన్నైలో స్పష్టం చేశారు. -
ఏజీపీతో బీజేపీ ఎన్నికల పొత్తు
గువాహటి: రానున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికలో కలసి పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ, అస్సాం గణపరిషత్ నిర్ణయించాయి. రాష్ట్రంలోని తరుణ్ గొగోయ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి. మాజీ సీఎం ప్రఫుల్లా కుమార్ మహంతా సహా ఏజీపీ అధినాయకత్వం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో బుధవారం ఢిల్లీలో జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఒకటి, రెండు రోజుల్లో ఇరు పార్టీలు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించి, ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసేది ప్రకటిస్తాయి. ఆ తర్వాత కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని వెల్లడిస్తాయి. చర్చల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి సర్వానంద సోనోవాల్, ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా కూడా పాల్గొన్నారు. బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సోనావాల్ను ఇదివరకే ప్రకటించింది. సోనోవాల్ గతంలో ఏజీపీలో పనిచేసి బీజేపీలోకి వచ్చినవారే. ఆయన ఏజీపీ తరఫున 2004 నుంచి 2009 వరకు ఎంపీగా కూడా పనిచేశారు. ఇరు పార్టీల మధ్య లాంఛనంగా పొత్తు కుదిరినా, సీట్ల పంపకాలు తేలాల్సి ఉందని ఏజీపీ వర్గాలు తెలిపాయి. మొత్తం 126 రాష్ట్ర అసెంబ్లీ సీట్లలో ఏజీపీ 40 సీట్లు డిమాండ్ చేస్తుండగా, 20 సీట్లకు మించి ఇవ్వమని బీజేపీ అంటోంది. ఏజీపీ, బీజేపీ ఎన్నికల్లో కలసి పోటీ చేయడం ఇదే మొదటి సారి కాదు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయగా బీజేపీకి నాలుగు సీట్లు, ఏజీపీకి ఒక్కసీటు వచ్చాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇరుపార్టీలు కలసి పోటీ చేయాలని అనుకున్నాయి. కలసి పోటీ చేయడం కలసి రావడం లేదని భావించిన ఏజీపీ చివరి నిమిషంలో బీజేపీకి దూరం జరిగింది. ఆ ఎన్నికల్లో 14 లోక్‌సభ సీట్లకుగాను బీజేపీకి ఏడు సీట్లురాగా, ఏజీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. -
పదేపదే వాయిదాలు కోరతారెందుకు?
ఇరు రాష్ట్రాల జీపీలు, ఏజీపీలపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కేసుల విచారణ సందర్భంగా ఇరురాష్ట్రాల ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదులు(ఏజీపీ) పదేపదే వాయిదాలు కోరుతుండటంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోరిన వివరాల్ని అధికారులు సకాలంలో అందించడం లేదన్న కారణాన్ని సాకుగా చూపుతూ తరచూ వాయిదాలు కోరుతుండటాన్ని తప్పుపట్టింది. విచారణకు సహకరించని కిందిస్థాయి అధికారులను బాధ్యులుగా చేస్తూ ఆయాశాఖల ముఖ్య కార్యదర్శులకు భారీ జరిమానా విధిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. చిత్తూరు జిల్లాల్లో ఓ భూవివాదానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్ గతవారం విచారణకొచ్చినప్పుడు పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు గడువుకావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఇందుకు జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం అనుమతినిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకొచ్చింది. ఈసారి కూడా ప్రభుత్వ న్యాయవాది వివరాలు సమర్పించేందుకు గడువు కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది. ఇలా పదేపదే వాయిదాలు కోరడం సరికాదని పేర్కొంది. అయితే ప్రభుత్వ న్యాయవాది, వివరాల సమర్పణకు చివరి అవకాశమివ్వాలని కోరగా, ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. -
ఏనుగు చతికిలబడిపోయింది
ఒకప్పుడు ఆ ఏనుగు కదిలితే అందరూ గడగడలాడిపోయేవారు. కానీ అదే ఏనుగు ఇప్పుడు పూర్తిగా చతికిలబడిపోయింది. ఎంత చేసినా మళ్లీ లేచి నిలబడటం లేదు. ఏనుగుని నిలబెట్టేంత బలం ఎవరికీ లేదు. ఈశాన్య భారతంలోని అసొం రాష్ట్ర రాజకీయాలను మూడు దశాబ్దాలు శాసించిన అసొం గణపరిషత్ పరిస్థితి దాని ఎన్నికల గుర్తైన ఏనుగు లాగానే ఉంది. అసొం గణపరిషత్ (ఏజీపీ) లేవలేదు. లేస్తే నడవలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు 62 ఏళ్ల ప్రఫుల్ల కుమార్ మహంత కూడా పార్టీకి కొత్త ఊపిరి నింపలేకపోతున్నారు. నింగికెగిరి.... నేలరాలిన నేత.... నిజానికి ప్రఫుల్ల కుమార్ మహంత దేశంలో చాలా విలక్షణమైన ముఖ్యమంత్రి. కాలేజీ హాస్టల్ నుంచి సరాసరి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారాయన. కనీసం వార్డు మెంబర్ గానైనా పోటీ చేయకుండా ఏకంగా సీఎం అయ్యారాయన. ముఖ్యమంత్రి అయిన తరువాత పెళ్లి చేసుకున్న ఏకైక సీఎం బహుశః ఆయనేనేమో. 1980 వ దశకంలో అసొం నుంచి విదేశీయులను తరిమేయాలన్న డిమాండ్ తో జరిగిన భారీ ఉద్యమం నుంచి ప్రఫుల్ల కుమార్ మహంత పుట్టుకొచ్చారు. గువహటి విశ్వవిద్యాలయంలో మామూలు విద్యార్థిగా ఉన్న మహంత ఈ ఉద్యమంలో అసొం విద్యార్థి సంస్థ 'ఆసు' నాయకుడిగా ఉద్యమానికి సారథ్యం వహించారు. 1985 లో అసొం ఒప్పందం తరువాత ఈ ఉద్యమసంస్థలన్నీ అసొం గణపరిషత్ గా ఏర్పడ్డాయి. 1986 లో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ అనుభవరాహిత్యం, అంతర్గత కలహాలతో ఏజీపీ కొద్ది రోజులకే అన్ పాపులర్ అయిపోయింది. ప్రఫుల్ల కుమార్ మహంత తన లెక్చరర్ జయశ్రీ గోస్వామిని వివాహం చేసుకోవడం, ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన వివాహేతర సంబంధం బట్టబయలు కావడం వంటి సంఘటనలు పార్టీని మరింత దిగజార్చాయి. అయిదేళ్ల తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 1997 లో మళ్లీ అధికారంలోకి వచ్చినా ఏజీపీ తీరు మారలేదు. పార్టీ నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరో వైపు ఉల్ఫా ఉగ్రవాదం కూడా ప్రబలింది. 2000 లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచీ గత పదమూడేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నానాటికీ బలోపేతం అవుతున్నారు. పతనం దిశగా పరుగు 2004 నుంచి జరిగిన అన్ని లోకసభ ఎన్నికల్లో ఏజీపీ పతనం దిశగా పరుగు కొనసాగిస్తూనే వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 సీట్లలో ఏజీపీ కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకుని రాజకీయ మైదానం నుంచి దాదాపుగా వైదొలగింది. బంగ్లాదేశీ వలసదారులకు ప్రాతినిథ్యం వహించే ఆలిండియా యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్ ప్రధాన ప్రతిపక్షం అయింది. బంగ్లాదేశీ వ్యతిరేక ఉద్యమం నడిపిన అసొం లో బంగ్లాదేశీ వలసదారులే ప్రధాన రాజకీయ ప్రతిపక్షం అయి కూచోవడం విడ్డూరమే కాదు. విషాదం కూడా. మరో వైపు బిజెపి నానాటికీ బలపడుతోంది. ఇదే కొనసాగితే రాష్ట్ర రాజకీయాల్లో ఏజీపి కేవలం పేకాటలో జోకర్ గా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం లోకసభలో ఏజీపీకి ఒకే ఒక్క సీటు ఉంది. ఈ సారి ఎన్నికల్లో అది కూడా నిలబెట్టుకుంటుందా అన్నది అనుమానమే. రాజకీయంగా పరాజితుడైన నాయకుడిగా ప్రఫుల్ల మహంత నిలిచిపోతారా? దేశంలో పుట్టి, గిట్టిన అనేక పార్టీల్లో ఏజీపీ కూడా ఒకటిగా మిగిలిపోతుందా? లేక ఏదైనా అద్భుతం జరిగి ఏనుగు లేచి నిలబడి, మళ్లీ పరుగులు తీస్తుందా? జస్ట్ 40 రోజులాగండి.... తెలిసిపోతుంది. -
ఏపీని విభజించవద్దు
సాక్షి, న్యూఢి ల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దని జేడీయూ, అస్సాం గణపరిషత్(ఏజీపీ) డిమాండ్ చేశాయి. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్-సేవ్ ఇండియా’ పేరిట ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ధర్నా కు జేడీయూ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణసింగ్, అస్సాం గణపరిషత్(ఏజీపీ) ప్రధాన కార్యదర్శి, ఎంపీ జోసఫ్టోకో, నార్త్ఈస్ట్ ఫెడరల్ అధ్యక్షుడు కుమార్‌దీపక్, సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వాసిరెడ్డి కృష్ణారావు తదితరులు మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని వశిష్ట నారాయణ్ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు జోసెఫ్ టొప్పొ ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలన్నీ సమైక్య ఉద్యమానికి మద్దతిస్తాయని చెప్పారు. రాష్ట్ర విభజన ఆగేవరకు పోరాటం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరివరకు పోరాటం కొనసాగుతుందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి పునరుద్ఘాటించారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభం కాకపోయినా... విభజన జరిగిపోయిందని, ప్రాంత ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్యాకేజీల కోసం పోరాడాలంటూ పిరికిపంద కేంద్ర మంత్రులు సూచనలిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆందోళనలో విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి రవితేజ, ఢిల్లీ జేఏసీ నేతలు గల్లా సతీష్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమైక్యవాదులు, ఎస్కే వర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. సమైక్యవాదుల బస్సులను అడ్డుకున్న యూపీ పోలీసులు: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం నిర్వహించిన విశాలాంధ్ర మహాసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి 46 బస్సుల్లో సమైక్యవాదులు బయలుదేరగా, ఆగ్రా సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌హైవే వద్ద నిలిపివేశారు. తర్వాత పది బస్సులను అనుమతించడంతో వారు ధర్నాకి హారయ్యారు. -
సమైక్యాంధ్రకు ఏజీపీ, జేడీయూ మద్దతు
-
సమైక్యాంధ్రకు ఏజీపీ, జేడీయూ మద్దతు
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మరో రెండు పార్టీలు వ్యతిరేకించాయి. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని అసోం గణపరిషత్, జేడీయూ పార్టీలు డిమాండ్ చేశాయి. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వేలాదిమంది సమైక్యవాదులు శనివారం ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏజీపీ, జేడీయూ మద్దతు తెలిపాయి. మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమని అసోం గణపరిషత్ పార్టీ ఎంపీ జోసఫ్‌టోపో అన్నారు. కాంగ్రెస్ విభజించు-పాలించు సూత్రాన్ని అమలుచేస్తోందని ఆయన విమర్శించారు. సమైక్య ఉద్యమకారులకు తమ సహకారం ఉంటుందని జేడీయూ బీహార్ శాఖ అధ్యక్షుడు వశిస్టు నారాయణ్ అన్నారు. కేంద్రమంత్రులు సీమాంధ్రలో ద్రోహులపాత్ర పోషిస్తున్నారని విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ చక్రవర్తి విమర్శించారు.