సాక్షి, న్యూఢి ల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దని జేడీయూ, అస్సాం గణపరిషత్(ఏజీపీ) డిమాండ్ చేశాయి. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్-సేవ్ ఇండియా’ పేరిట ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ధర్నా కు జేడీయూ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణసింగ్, అస్సాం గణపరిషత్(ఏజీపీ) ప్రధాన కార్యదర్శి, ఎంపీ జోసఫ్‌టోకో, నార్త్‌ఈస్ట్ ఫెడరల్ అధ్యక్షుడు కుమార్‌దీపక్, సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వాసిరెడ్డి కృష్ణారావు తదితరులు మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని వశిష్ట నారాయణ్ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు జోసెఫ్ టొప్పొ ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలన్నీ సమైక్య ఉద్యమానికి మద్దతిస్తాయని చెప్పారు.
రాష్ట్ర విభజన ఆగేవరకు పోరాటం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు చివరివరకు పోరాటం కొనసాగుతుందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి పునరుద్ఘాటించారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభం కాకపోయినా... విభజన జరిగిపోయిందని, ప్రాంత ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్యాకేజీల కోసం పోరాడాలంటూ పిరికిపంద కేంద్ర మంత్రులు సూచనలిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఆందోళనలో విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి రవితేజ, ఢిల్లీ జేఏసీ నేతలు గల్లా సతీష్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమైక్యవాదులు, ఎస్‌కే వర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.
సమైక్యవాదుల బస్సులను అడ్డుకున్న యూపీ పోలీసులు: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం నిర్వహించిన విశాలాంధ్ర మహాసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి 46 బస్సుల్లో సమైక్యవాదులు బయలుదేరగా, ఆగ్రా సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌హైవే వద్ద నిలిపివేశారు. తర్వాత పది బస్సులను అనుమతించడంతో వారు ధర్నాకి హారయ్యారు.