లోక్‌సభ బరిలో ‘ఆప్’ వీరులెవరో..
Published Mon, Jan 6 2014 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నగరంలో ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాల్లో ‘ఆప్’ ఎవరెవరిని నిలబెట్టనుందోననే దానిపై ఇప్పటినుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. విధానసభ ఎన్నికల్లో ‘ఆప్’ అనూహ్య విజయం సాధించడంతో ప్రజలకు ఆ పార్టీ పట్ల ఆసక్తి పెరిగింది. విధానసభ ఎన్నికల్లో మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించాలని ఆప్ ఆశిస్తోంది. విధానసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా నిలబడిన వారిలో కొందరు సామాన్యులే అయినా పార్టీ పేరుపైనే ఎన్నికల్లో నెగ్గారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకుండా గట్టి అభ్యర్థులను బరిలోకి దింపి తన సత్తా చాటుకోవాలని పార్టీ యోచిస్తోంది. జనవరి 20లోగా పార్టీ జారీ చేసే లోక్‌సభఅభ్యర్థుల జాబితాలోనే ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసే వ్యక్తుల పేర్లను ప్రకటించవచ్చని రాజకీయపండితులు అంటున్నారు.
ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ లోక్‌భ ఎన్నికలలో పోటీచేయబోనని ఇప్పటికే ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో మరో నేత మనీష్ సిసోడియా ఇప్పటికే ఢిల్లీ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. యోగేంద్ర యాదవ్ హర్యానాలోనూ సంజయ్ సింగ్ యూపీలోనూ పోటీచేయవచ్చని అంటున్నారు. కుమార్ విశ్వాస్ అమేథీ నుంచి పోటీచేసే అవకాశముంది.ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏడు స్థానాల నుంచి పోటీచేసేందుకు షాజియా ఇల్మీ, గోపాల్ రాయ్‌లకు అవకాశం లభించవచ్చని అంటున్నారు, షాజియా ఇల్మీ విధానసభ ఎన్నికల్లో ఆర్‌కె పురం నుంచి పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమెను దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నా యి. గోపాల్‌రాయ్ చాందినీ చౌక్ నుంచి పోటీచేయవచ్చని అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో తెరవెనుక వ్యవహారాలు చక్కబెడ్తున్న ఆశిష్ తల్వార్, దిలీప్ పాండే లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. చాందినీచౌక్ ఎంపీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కాగా, దక్షిణ ఢిల్లీకి సజ్జన్‌కుమార్ సోదరుడు రమేష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Advertisement
Advertisement