ఏజీపీతో బీజేపీ ఎన్నికల పొత్తు
గువాహటి: రానున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికలో కలసి పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ, అస్సాం గణపరిషత్ నిర్ణయించాయి. రాష్ట్రంలోని తరుణ్ గొగోయ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి. మాజీ సీఎం ప్రఫుల్లా కుమార్ మహంతా సహా ఏజీపీ అధినాయకత్వం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో బుధవారం ఢిల్లీలో జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఒకటి, రెండు రోజుల్లో ఇరు పార్టీలు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించి, ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసేది ప్రకటిస్తాయి. ఆ తర్వాత కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని వెల్లడిస్తాయి.
చర్చల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి సర్వానంద సోనోవాల్, ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా కూడా పాల్గొన్నారు. బీజేపీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సోనావాల్ను ఇదివరకే ప్రకటించింది. సోనోవాల్ గతంలో ఏజీపీలో పనిచేసి బీజేపీలోకి వచ్చినవారే. ఆయన ఏజీపీ తరఫున 2004 నుంచి 2009 వరకు ఎంపీగా కూడా పనిచేశారు. ఇరు పార్టీల మధ్య లాంఛనంగా పొత్తు కుదిరినా, సీట్ల పంపకాలు తేలాల్సి ఉందని ఏజీపీ వర్గాలు తెలిపాయి. మొత్తం 126 రాష్ట్ర అసెంబ్లీ సీట్లలో ఏజీపీ 40 సీట్లు డిమాండ్ చేస్తుండగా, 20 సీట్లకు మించి ఇవ్వమని బీజేపీ అంటోంది.
ఏజీపీ, బీజేపీ ఎన్నికల్లో కలసి పోటీ చేయడం ఇదే మొదటి సారి కాదు. 2009 లోక్సభ ఎన్నికల్లో కలసి పోటీ చేయగా బీజేపీకి నాలుగు సీట్లు, ఏజీపీకి ఒక్కసీటు వచ్చాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇరుపార్టీలు కలసి పోటీ చేయాలని అనుకున్నాయి. కలసి పోటీ చేయడం కలసి రావడం లేదని భావించిన ఏజీపీ చివరి నిమిషంలో బీజేపీకి దూరం జరిగింది. ఆ ఎన్నికల్లో 14 లోక్సభ సీట్లకుగాను బీజేపీకి ఏడు సీట్లురాగా, ఏజీపీకి ఒక్క సీటు కూడా రాలేదు.