ఛత్తీస్‌గఢ్, బెంగాల్, అసోంల్లో కీలక స్థానాల్లో హోరాహోరీ
ఒంటరి పోరుతో పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత ఇప్పుడు బీజేపీ నుంచి రాష్ట్రంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. మూడో విడతలో భాగంగా అక్కడ నాలుగు లోక్‌సభ స్థానాలకు, బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో ఏడింటికి, అసోంలో నాలుగింటికి మంగళవారం పోలింగ్ జరగనుంది. వాటిల్లో కీలక స్థానాలను ఓసారి చూస్తే...
జాంగీపూర్ (పశి్చమ బెంగాల్)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. 2019లో బీజేపీ అభ్యర్థి మఫుజా ఖాతూన్‌పై తృణమూల్ కాంగ్రెస్ నేత ఖలీలుర్ రెహమాన్ 2.4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. బీజేపీ ధనుంజయ్ ఘోష్‌కు
టికెటివ్వగా కాంగ్రెస్ ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ను పక్కన పెట్టి మొర్తజా హుస్సేన్‌ను పోటీకి దింపింది. దాంతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది.
దక్షిణ మాల్డా (పశి్చమ బెంగాల్)
ఉత్తర మాల్డాతో పాటు ఈ స్థానం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. జమిందారీ కుటుంబీకుడు ఘనీఖాన్ చౌదరి హవా నడిచేది. రెండు దశాబ్దాలు మాల్డా రాజకీయాలను శాసించిన ఆయన మరణానంతరం పరిస్థితి మారింది. ముస్లిం ప్రాబల్య స్థానమైన దక్షిణ మాల్డాలో ముక్కోణపు పోటీ నెలకొంది. 2009, 2014, 2019ల్లో ఘనీఖాన్ సోదరుడు అబూ హసీం ఖాన్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఈసారి ఆయన కుమారుడు ఇషా ఖాన్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి శ్రీరూప మిత్ర చౌదరి, టీఎంసీ తరఫున షానవాజ్ అలీ రెహమాన్ పోటీ చేస్తున్నారు.
ఉత్తర మాల్డా (పశి్చమ బెంగాల్)
ఇక్కడి ఓటర్లలో చైతన్యం ఎక్కువ. బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి ఖగేన్ ముర్ముకు తృణమూల్ నుంచి బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రసూన్ బెనర్జీ గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ముస్తాక్ ఆలం బరిలో ఉన్నారు. ఇక్కడ 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన మౌసమ్ నూర్ 2019లో తృణమూల్ నుంచి పోటీ చేశారు. ఖగేన్ చేతిలో 1.85 లక్షల ఓట్ల తేడాతో ఓడారు. ఇక్కడా ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది.
మాధేపుర (బిహార్)
మండల్ కమిషన్ చైర్మన్ బిందేశ్వరీ ప్రసాద్ మండల్, జేడీ(యూ) దిగ్గజం శరద్ యాదవ్, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వంటి రాజకీయ ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన స్థానమిది. ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి నుంచి ప్రొఫెసర్ కుమార్ చంద్రదీప్ యాదవ్ పోటీలో ఉన్నారు. జేడీ(యూ) నుంచి సిట్టింగ్ ఎంపీ దినేశ్ చంద్ర యాదవ్ మరోసారి పోటీకి నిలబడ్డారు.
అరారియా (బిహార్)
బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ప్రదీప్‌కుమార్ సింగ్ బరిలో ఉన్నారు. 2019లో ఆయన చేతిలో 1.37 లక్షల ఓట్ల తేడాతో ఓడిన మహమ్మద్ సర్ఫరాజ్ ఆలంకే ఆర్జేడీ మళ్లీ టికెటి చి్చంది. ఇద్దరు బలమైన స్వతంత్ర అభ్యర్థులూ బరిలో ఉన్నారు.
గువాహటి (అసోం)
ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ రెండూ మహిళలకే టికెటిచ్చాయి. బీజేపీ సిట్టింగ్ ఎంపీ క్వీన్ ఓజాను కాదని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు బిజూలి కలిత మేధిను బరిలో దింపింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బీరా బోర్తకుమార్ గోస్వామి పూర్వాశ్రమంలో బీజేపీ నేతే! పర్వత, మారుమూల ప్రాంతాల్లోనూ ఆమె సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగం, వరదలు, తాగునీరు ఇక్కడి సమస్యలు.
డుబ్రి (అసోం)
ఈ లోక్‌సభ స్థానం ఏకంగా 142 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటోంది. బ్రహ్మపుత్ర పొంగినప్పుడల్లా ఇక్కడి ప్రజలకు కష్టాలు తప్పవు. వరదలు, పేదరికం, బాల్య వివాహాలు ప్రధాన సమస్యలు. ముస్లింలు ఏకంగా 80 శాతమున్నారు. దాంతో వారి ఓట్లే ఫలితాన్ని నిర్దేశిస్తుంటాయి. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ ఇక్కడ వరుసగా నాలుగోసారి గెలిచేందుకు శ్రమిస్తున్నారు. బీజేపీ మిత్రపక్షం ఏజీపీ నుంచి జబేద్ ఇస్లాం, కాంగ్రెస్ నుంచి రకీబుల్ హుస్సేన్ పోటీలో ఉన్నారు.
రాయ్‌గఢ్ (ఛత్తీస్‌గఢ్)
ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి 1999 నుంచి 2014 దాకా ఇక్కడినుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పైగా ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కూడా రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంది. దాంతో ఇక్కడ బీజేపీని గెలిపించుకోవడం సీఎంకు ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి రాధేశ్యామ్ రతియా, కాంగ్రెస్ నుంచి మేనకాదేవి సింగ్ పోటీ చేస్తున్నారు. గోండ్ రాజ కుటుంబ వారసురాలైన మేనకాదేవి డాక్టర్ కూడా.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment