assam gana parishad
-
Lok sabha elections 2024: కజిరంగాలో సీట్ల వేట!
అసోం పేరు చెప్పగానే ఖడ్గమృగాలు, బెంగాల్ టైగర్స్, ఏనుగు సఫారీలతో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్ పార్క్ కళ్లముందు కదలాడుతుంది. బ్రహ్మపుత్ర నది పరవళ్లతో పాటు తేయాకు తోటలకు కూడా ప్రసిద్ధి. ఈశాన్య భారత్‌కు గేట్వేగా నిలుస్తున్న ఈ రాష్ట్రంలో దశాబ్దకాలంగా సమూల రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్, అసోం గణ పరిషత్ (ఏజీపీ) కంచుకోటగా ఉన్న అతిపెద్ద ఈశాన్య రాష్ట్రంలో ఇప్పుడు కాషాయజెండా రెపరెపలాడుతోంది. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్.. మూడు దేశాలతో సరిహద్దు పంచుకోవడం వల్ల కూడా అసోం దేశ రాజకీయాల్లో కీలకంగా నిలుస్తోంది. ‘సెవెన్ సిస్టర్స్’లో పెద్ద తోబుట్టువుగా.. 14 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండటంతో సార్వత్రిక సమరంలో పార్టిలన్నీ సీట్ల వేటకు సై అంటున్నాయి. గతేడాది కేంద్ర ఎన్నికల సంఘం అసోంలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను పూర్తిచేసిన నేపథ్యంలో 27 ఏళ్ల తర్వాత సీట్ల స్వరూపం స్వల్పంగా మారింది. కొలియాబార్ నియోజకవర్గానికి బదులు కొత్తగా కజిరంగా నియోజకవర్గం వచ్చి చేరింది. అలాగే, 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 స్థానాల పేర్లు మారాయి. 2009 నుంచి కమలనాథులు ఈశాన్యానికి విస్తరణ బాట పట్టారు. 2014లో అత్యధికంగా 7 సీట్లను దక్కించుకున్న బీజేపీ, 2019లో బలాన్ని మరింత పెంచుకుని 9 సీట్లు కొల్లగొట్టింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఏజీపీ 3 చోట్ల, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) ఒక స్థానంలో పోటీ చేయగా, వాటికి ఒక్క సీటు కూడా రాలేదు. మరోపక్క, కాంగ్రెస్ ఒంటరి పోరు చేసి 3 చోట్ల విజయం సాధించింది. 2014లోనూ మూడే సీట్లు దక్కాయి. ఇక రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టిగా నిలుస్తున్న ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) 3 స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోట విజేతగా నిలిచింది. 2014లో గెలిచిన 3 సీట్లలో రెండు కోల్పోయింది. మొత్తం 14 నియోజకవర్గాల్లో, 2 సీట్లను ఎస్టీలకు, 1 స్థానం ఎస్సీలకు కేటాయించారు. బీజేపీ పాగా... ఉత్తరాదిన గట్టి పట్టున్న కమలనాథులు ఈశాన్యంలో ఎలాగైనా పాగా వేయాలని 2009 నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే అక్కడ బలమైన ప్రాంతీయ పార్టిగా ఉన్న ఏజీపీలోని కీలక నాయకుడు సర్వానంద సోనోవాల్‌ను 2011లో పార్టిలో చేర్చుకుని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. 2014లో సోనోవాల్ సారథ్యంలో అసోం లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్న కమలనాథులు బంపర్ ఫలితాలను సాధించారు. బీజేపీకి ఏకంగా 7 సీట్లు (2009లో 2 సీట్లే) లభించాయి. రాష్ట్రంలో అధికార పార్టిగా ఉన్న కాంగ్రెస్ బలం 7 సీట్ల నుంచి 3 స్థానాలకు పడిపోయింది. మియా బెంగాలీ ముస్లింలకు దన్నుగా నిలుస్తున్న ఏఐయూడీఎఫ్ 2 స్థానాలను మెరుగుపరుచుకుని 3 చోట్ల విజేతగా నిలిచింది. ఇక, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ దన్నుతో బరిలోకి దిగిన కాషాయ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 126 అసెంబ్లీ సీట్లకు గాను 86 స్థానాలను ఖాతాలో వేసుకుంది. సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఈశాన్య రాష్ట్రంలో మొదటి బీజీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అసోంలో పాగా వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరింత బలం పుంజుకుంది. ఎన్డీఏ 9 సీట్లను దక్కించుకుంది. ఇవన్నీ కూడా బీజేపీకే రావడం గమనార్హం. భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటూ రాలేదు. ఈ ఘన విజయం తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ బరిలోకి దిగింది. కాంగ్రెస్ కూటమి భారీగా పుంజుకున్నప్పటికీ, మళ్లీ ఎన్డీఏ మెజారిటీ దక్కించుకుంది. అయితే, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన హిమంత బిశ్వ శర్మకు కమలనాథులు సీఎం పగ్గాలు అప్పగించి, సోనోవాల్‌ను మళ్లీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాగా, మోదీ ప్రభుత్వం రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మౌలిక సదుపాయాలపై భారీగా వెచి్చంచింది. దీన్నే ఇప్పుడు అక్కడ ప్రచారాస్త్రాలుగా చేసుకుంటోంది. మరోపక్క, ఇటీవల అమల్లోకి తెచి్చన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. పట్టుకోసం కాంగ్రెస్ ప్రయత్నం... రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ దశాబ్దకాలంగా తీవ్రంగా దెబ్బతింది. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్గజ నేత తరుణ్ గొగోయ్‌పై అసమ్మతి, హిమంత బిశ్వ శర్మ వంటి నేతలు పార్టీని వీడటంతో కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. అయితే, 2019లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు లభించిన ఓట్లలో తేడా 0.61 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2021 ఎన్నికల్లో తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ సారథ్యంలో బరిలోకి దిగిన హస్తం పార్టీ భారీగా పుంజుకుంది. అంతక్రితం ఎన్నికలతో పోలిస్తే 24 సీట్లు మెరుగుపరుచుకుని 50 స్థానాల్లో విజయం సాధించింది. మళ్లీ బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. కాగా, అతిచిన్న వయస్సులో అసోం సీఎం పగ్గాలు చేపట్టిన ప్రఫుల్ల కుమార్ మహంతి (ఏజీపీ వ్యవస్థాపకుల్లో ఒకరు) వంటి నేతలు ఎన్డీఏతో జట్టుకట్టడం కూడా కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతోంది. అయితే, ఈసారి ఇండియా కూటమితో బీజేపీని ఢీకొట్టడం ద్వారా మెజారిటీ స్థానాలను చేజక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది హస్తం పార్టీ. కాగా, సీఏఏ అంశంతో పాటు మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఇండియా కూటమి ప్రచారా్రస్తాలుగా మలచుకుంటోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో అసోం ప్రభుత్వంపై, మోదీ సర్కారు హయాంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ఎక్కుపెట్టారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మారణహోమానికి బీజేపీయే కారణమని కూడా ఇండియా కూటమి ప్రచారంలో హోరెత్తిస్తోంది. కాంగ్రెస్ వల‘సలసల‘... ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల పార్టీ ఫిరాయింపులు, వలసలు కూడా జోరందుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా రాజీనామా చేశారు. లఖీంపూర్ లోక్‌సభ సీటును తన భార్యకు ఇవ్వకపోవడమే దీనికి కారణం. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రానా గోస్వామి కూడా బీజేపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. శంకర్ ప్రసాద్ రాయ్, రతుల్ కురి్మ, కమలాఖ్య డే, బసంత దాస్ తదితర నాయకులు సైతం కాంగ్రెస్ నుంచి వలసబాట పట్టడం పార్టీని కలవరపెడుతోంది. కాగా, రాహుల్ గాంధీ అసోంలో ప్రచారానికి రావాలని కోరుకుంటున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హిమంత బిశ్వ శర్మ సిల్చార్ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. అసలు రాహుల్‌కు ప్రధాని మోదీతో పోటీ ఏంటని కూడా ఎద్దేవా చేశారు. రాహుల్ ప్రచారానికొస్తే బీజేపీకే లాభమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతుందన్నారు. మరోపక్క, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ హిమంత బాంబు పేల్చారు. అయితే, దీన్ని బోరా ఖండించడమే కాకుండా, రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేయడం విశేషం. గొగోయ్ వర్సెస్ గొగోయ్ జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇద్దరు గొగోయ్‌లు తలపడుతున్నారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్న గౌరవ్ గొగోయ్... సిట్టింగ్ బీజేపీ ఎంపీ, తపన్ కుమార్ గొగోయ్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో గౌరవ్ కలియాబోర్ నుంచి ఎంపీగా గెలిచారు. కాగా, తాను 2 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తానని తపన్ గొగోయ్ సవాలు విసిరారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్నికల్లో బూచిగా చూపిస్తున్న ప్రతిపక్షాలను ఓటర్లు పట్టించుకోవడం లేదన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న గౌరవ్ గొగోయ్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. తనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్న వారంతా ఓట్లేస్తే తపన్ ఖచి్చతంగా ఓడిపోతారని అంటున్నారు. గౌరవ్ తండ్రి, అసోం సీఎంగా సుదీర్ఘకాలం పని చేసిన తరుణ్ గొగోయ్‌కు జోర్హాట్ నియోజకవర్గం ఒకప్పుడు కంచుకోటగా ఉండేది. జోర్హాట్ ఓటర్లతో ఈ అనుబంధాన్ని గుర్తు చేయడంతో పాటు యువ ఓటర్లపై గౌరవ్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. సర్వేలు ఏమంటున్నాయి... ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్న బీజేపీ 11 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఏజీపీకి 2 సీట్లు, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్)కు 1 సీటు ఇచ్చింది. ఇటీవల వెలువడిన పలు సర్వేలు ఎన్డీఏ 12 సీట్లను (బీజేపీ 10, ఏజీపీ 1, యూపీపీఎల్ 1) దక్కించుకుంటుందని అంచనా వేశాయి. కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్లకు చెరొక స్థానం రావచ్చని అంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజ్యసభకు ఇద్దరు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం
గువాహటి: అస్సాం నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగి సింది. ఈ సీట్లను బీజేపీ, మిత్రపక్షం ఏజీపీ (అసోం గణపరిషత్) దక్కించుకున్నాయి. అసోం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కాంగ్రెస్‌కే చెందిన మరో సభ్యుడు సాంటియుస్ కుజుర్‌ల పదవీ కాలం జూన్ 14తో ముగియనుంది. ఈ 2 స్థానాలకు జూన్ 7న ఎన్నిక జరపాల్సి ఉండగా నామినేషన్ దాఖలు శుక్రవారంతో గడువు ముగిసింది. ఇద్దరే నామినేషన్లు దాఖలు చేశారని ఆర్వో తెలిపారు. దీంతో నామినేషన్ వేసిన బీజేపీ సభ్యుడు కామాఖ్య ప్రసాద్ తాసా, ఏజీపీకి చెందిన బీరేంద్ర ప్రసాద్ వైశ్య ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అసోం నుంచి 1991 నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున వరసగా ఎన్నికవుతున్నారు. ప్రస్తుతం అసోం అసెంబ్లీలో సరిపడా బలం లేకపోవడంతో కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ తమ అభ్యర్థులను బరిలో ఉంచలేదు. -
‘గంజ్’లో జంగ్
అసోంలో కీలక ఆర్థిక, వాణిజ్య కేంద్రం కరీంగంజ్. బ్రిటిష్ పాలకులను ఎదిరించి చరిత్రలో నిలిచిన పోరుగడ్డ. బంగ్లాదేశ్–భారత్ మధ్య వారధిగా పరిగణించే ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యమూ ఎక్కువే. ఈ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) బరిలో నిలిస్తే, అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)తో కలిసి బీజేపీ పోటీకి దిగింది. త్రిపురకు ప్రవేశ ద్వారంగా పరిగణించే కరీంగంజ్ పరిధిలో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు (కరీంగంజ్ నార్త్, కరీంగంజ్ సౌత్, కట్లిచెర్ర, పథర్‌కంజి, హయిలకంజి, బదార్పూర్, అల్గపూర్, రతబరి) ఉన్నాయి. ఏఐయూడీఎఫ్ తరఫున సిట్టింగ్ ఎంపీ రాథేశ్యామ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. స్వరూప్ దాస్ కాంగ్రెస్ నుంచి, కృపానాథ్ మల్ల బీజేపీ కూటమి నుంచి తలపడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చందన్‌దాస్‌కు కూడా నియోజకవర్గంలో పలుకుబడి ఉంది. అయితే, పోటీ ప్రధానంగా కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్, బీజేపీ కూటమి మధ్యే ఉండనుంది. మొత్తం 16 మంది పోటీలో ఉన్నారు. పుంజుకున్న ఏఐయూడీఎఫ్ రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు మొత్తం ఓటర్లలో 35 శాతం ఉన్నారు. కరీంగంజ్ సహా ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో వారే నిర్ణయాత్మక శక్తి. సంప్రదాయకంగా వీరంతా కాంగ్రెస్ మద్దతుదారులు. 2005 సెప్టెంబర్‌లో జమాయిత్ ఉలేమా హింద్ అధ్యక్షుడు మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌ను ప్రారంభించడంతో ముస్లింలంతా అటు వైపు మళ్లారు. దాంతో కాంగ్రెస్ ముస్లింల ఆధిక్యత గల ప్రాంతాల్లో పట్టు కోల్పోయింది. 2009లో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌గా పేరు మార్చుకున్న అజ్మల్ పార్టీ రాష్ట్ర ఎన్నికల బరిలో అడుగుపెట్టింది. ఫలితంగా ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఏఐయూడీఎఫ్ తన అభ్యర్థులను పోటీ పెట్టడం బీజేపీకి లాభించింది. క్రమంగా ఏఐ యూడీఎఫ్ బలం పుంజుకుని కాంగ్రెస్, బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా మారింది. గత ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థి రాధేశ్యామ్ ఘన విజ యం సాధించారు. ఆయన ఏఐయూడీఎఫ్ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరిగింది. నాయకత్వం తీరు రాధేశ్యామ్‌కు నచ్చడం లేదని, దాంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఆయన ఏఐయూడీఎఫ్ నుంచే పోటీ చేస్తుండటంతో ఈ వార్తలన్నీ నిరాధారాలని తేలిపోయింది. కాగా, రాథేశ్యామ్‌పై మెజారిటీ ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు. నీటి సమస్యను పరిష్కరిస్తానని, సిల్చార్ నదిపై వంతెన నిర్మించేలా చూస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చలేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ తీరుకు నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు నియోజకవర్గంలోని డజనుకుపైగా పంచాయతీలు ప్రకటించాయి. దీన్నిబట్టి ఏఐయూడీఎఫ్ విజయం అనుకున్నంత సులభం కాదని పరిశీలకులు అంటున్నారు. చేజారిన ఓటు బ్యాంక్ సంప్రదాయకంగా అస్సాం కాంగ్రెస్‌కు కంచుకోట. 2005 వరకు రాష్ట్రంలోని ముస్లింలు ప్రధానంగా కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. 1962 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా పదిసార్లు ఇక్కడ నెగ్గిందంటే దానికి కారణం ముస్లింల ఓట్లేనని చెప్పవచ్చు. అయితే, 2005లో ఏఐయూడీఎఫ్ ఆవిర్భావంతో కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు గండిపడింది. 2009 ఎన్నికల్లోæ యూడీఎఫ్ బరిలో దిగడంతో కాంగ్రెస్ ఓట్లు చీలిపోయాయి. మరోవైపు బీజేపీ కూడా గట్టి అభ్యర్థులను పోటీ పెట్టింది. అయినా కూడా కాంగ్రెస్ తక్కువ మెజారిటీతో గెలిచింది. 2014లో మాత్రం కాంగ్రెస్ ఏఐయూడీఎఫ్ చేతిలో పరాజయం పాలయింది. చేజారిన ముస్లింలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తోంది. మరోవైపు తేయాకు కార్మికుల సహాయంతో గట్టెక్కాలని కూడా పథకాలు రచిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను అనుకూలంగా మలుచుకోవడానికి చూస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప్‌దాస్ ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకోగలరనేదే విజయావకాశాలను నిర్ధారిస్తుంది. పొత్తుపై బీజేపీ ఆశ కాంగ్రెస్ విముక్త ఈశాన్య భారతం లక్ష్యంగా బీజేపీ అస్సాం గణ పరిషత్, బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు మాత్రమే బీజేపీ ఇక్కడ గెలిచింది. ఈ పొత్తుల సాయంతోనే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదని వారు మండిపడుతున్నారు. ఒకటి రెండు మంచి పనులు చేపట్టినా అవి పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం కూడా వారి అసంతృప్తికి కారణమవుతోంది. దీన్ని గుర్తించిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో తేయాకు కార్మికుల సామాజిక వర్గానికి చెందిన కృపానాథ్ మల్లను అభ్యర్థిగా ఎంపిక చేసింది. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న తేయాకు కార్మికుల ఓట్లు రాబట్టడమే దీని ఉద్దేశం.అయితే, ఏఐయూడీఎఫ్‌ను ఎదుర్కోవడం బీజేపీకి కష్టమేనని పరిశీలకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మోదీ హవా బ్రహ్మాండంగా ఉన్నప్పుడే కరీంగంజ్‌లో ఆ పార్టీ యూడీఎఫ్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు జాతీయ రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో కమలనాధులు ఎంత వరకు నెగ్గుకు రాగలరో చూడాలి. ప్రధాన పార్టీల సంగతి ఇలా ఉంటే తృణమూల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చందన్ దాస్ కూడా పలుకుబడి ఉన్న వారే. పోటీలో ఉన్న పది మందికిపైగా ఇండిపెండెంటు అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల ఓట్లు చీల్చే అవకాశం ఉంది. -
‘మోదీని అడుగుపెట్టనివ్వం’
గువహటి: పౌరసత్వ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై అస్సాంలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. అనేక చోట్ల ప్రజలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేధావులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న అస్సాం గణపరిషత్ (ఏజీపీ)కి చెందిన మంత్రులు బుధవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వం నుంచి ఏజీపీ రెండ్రోజుల క్రితమే బయటకు రావడం తెలిసిందే. బుధవారం పలుచోట్ల ఆందోళనకారులు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి సోనోవాల్ తదితరుల దిష్టిబొమ్మలను కాల్చారు. సచివాలయాన్ని ముట్టడించారు. మోదీ, ఇతర కేంద్ర మంత్రులను అస్సాంలో అడుగుపెట్టనివ్వబోమనీ, అలాగే ముఖ్యమంత్రి, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్రంలో ఎక్కడా సభలు, ర్యాలీలు నిర్వహించకుండా అడ్డుకుంటామని కృషక్ ముక్తి సంగ్రామ సమితి అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ ప్రకటించారు. 70 సంస్థలు సచివాలయం వద్ద ఆందోళనలు చేశాయి. -
ఏజీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
గువాహటి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న అసోం గణ పరిషత్ (ఏజీపీ) 25 మంది అభ్యర్థులతో తొలి జాబితాను గురువారం ప్రకటించింది. బీజేపీ పోటీ చేసే చోట తమ పార్టీ స్నేహపూర్వక పోటీకి దిగుతుందని ఏజీపీ అధ్యక్షుడు అతుల్ బోరా తెలిపారు. కాగా, తమిళనాడులో తన పొత్తు కోసం తీవ్రంగా కుస్తీలు పట్టిన డీఎంకే, బీజేపీలకు దేశీయ ద్రావిడ ముర్పోక్కు కళగం(డీఎండీకే) అధినేత విజయకాంత్ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు గురువారం చెన్నైలో స్పష్టం చేశారు. -
ఏనుగు చతికిలబడిపోయింది
ఒకప్పుడు ఆ ఏనుగు కదిలితే అందరూ గడగడలాడిపోయేవారు. కానీ అదే ఏనుగు ఇప్పుడు పూర్తిగా చతికిలబడిపోయింది. ఎంత చేసినా మళ్లీ లేచి నిలబడటం లేదు. ఏనుగుని నిలబెట్టేంత బలం ఎవరికీ లేదు. ఈశాన్య భారతంలోని అసొం రాష్ట్ర రాజకీయాలను మూడు దశాబ్దాలు శాసించిన అసొం గణపరిషత్ పరిస్థితి దాని ఎన్నికల గుర్తైన ఏనుగు లాగానే ఉంది. అసొం గణపరిషత్ (ఏజీపీ) లేవలేదు. లేస్తే నడవలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు 62 ఏళ్ల ప్రఫుల్ల కుమార్ మహంత కూడా పార్టీకి కొత్త ఊపిరి నింపలేకపోతున్నారు. నింగికెగిరి.... నేలరాలిన నేత.... నిజానికి ప్రఫుల్ల కుమార్ మహంత దేశంలో చాలా విలక్షణమైన ముఖ్యమంత్రి. కాలేజీ హాస్టల్ నుంచి సరాసరి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారాయన. కనీసం వార్డు మెంబర్ గానైనా పోటీ చేయకుండా ఏకంగా సీఎం అయ్యారాయన. ముఖ్యమంత్రి అయిన తరువాత పెళ్లి చేసుకున్న ఏకైక సీఎం బహుశః ఆయనేనేమో. 1980 వ దశకంలో అసొం నుంచి విదేశీయులను తరిమేయాలన్న డిమాండ్ తో జరిగిన భారీ ఉద్యమం నుంచి ప్రఫుల్ల కుమార్ మహంత పుట్టుకొచ్చారు. గువహటి విశ్వవిద్యాలయంలో మామూలు విద్యార్థిగా ఉన్న మహంత ఈ ఉద్యమంలో అసొం విద్యార్థి సంస్థ 'ఆసు' నాయకుడిగా ఉద్యమానికి సారథ్యం వహించారు. 1985 లో అసొం ఒప్పందం తరువాత ఈ ఉద్యమసంస్థలన్నీ అసొం గణపరిషత్ గా ఏర్పడ్డాయి. 1986 లో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ అనుభవరాహిత్యం, అంతర్గత కలహాలతో ఏజీపీ కొద్ది రోజులకే అన్ పాపులర్ అయిపోయింది. ప్రఫుల్ల కుమార్ మహంత తన లెక్చరర్ జయశ్రీ గోస్వామిని వివాహం చేసుకోవడం, ఆ తరువాత కొద్ది రోజులకే ఆయన వివాహేతర సంబంధం బట్టబయలు కావడం వంటి సంఘటనలు పార్టీని మరింత దిగజార్చాయి. అయిదేళ్ల తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 1997 లో మళ్లీ అధికారంలోకి వచ్చినా ఏజీపీ తీరు మారలేదు. పార్టీ నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరో వైపు ఉల్ఫా ఉగ్రవాదం కూడా ప్రబలింది. 2000 లో జరిగిన ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచీ గత పదమూడేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నానాటికీ బలోపేతం అవుతున్నారు. పతనం దిశగా పరుగు 2004 నుంచి జరిగిన అన్ని లోకసభ ఎన్నికల్లో ఏజీపీ పతనం దిశగా పరుగు కొనసాగిస్తూనే వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 సీట్లలో ఏజీపీ కేవలం 10 సీట్లు మాత్రమే గెలుచుకుని రాజకీయ మైదానం నుంచి దాదాపుగా వైదొలగింది. బంగ్లాదేశీ వలసదారులకు ప్రాతినిథ్యం వహించే ఆలిండియా యునైటెడ్ డెమాక్రటిక్ ఫ్రంట్ ప్రధాన ప్రతిపక్షం అయింది. బంగ్లాదేశీ వ్యతిరేక ఉద్యమం నడిపిన అసొం లో బంగ్లాదేశీ వలసదారులే ప్రధాన రాజకీయ ప్రతిపక్షం అయి కూచోవడం విడ్డూరమే కాదు. విషాదం కూడా. మరో వైపు బిజెపి నానాటికీ బలపడుతోంది. ఇదే కొనసాగితే రాష్ట్ర రాజకీయాల్లో ఏజీపి కేవలం పేకాటలో జోకర్ గా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం లోకసభలో ఏజీపీకి ఒకే ఒక్క సీటు ఉంది. ఈ సారి ఎన్నికల్లో అది కూడా నిలబెట్టుకుంటుందా అన్నది అనుమానమే. రాజకీయంగా పరాజితుడైన నాయకుడిగా ప్రఫుల్ల మహంత నిలిచిపోతారా? దేశంలో పుట్టి, గిట్టిన అనేక పార్టీల్లో ఏజీపీ కూడా ఒకటిగా మిగిలిపోతుందా? లేక ఏదైనా అద్భుతం జరిగి ఏనుగు లేచి నిలబడి, మళ్లీ పరుగులు తీస్తుందా? జస్ట్ 40 రోజులాగండి.... తెలిసిపోతుంది.