Lok sabha elections 2024: కజిరంగాలో సీట్ల వేట! | Lok sabha elections 2024: Surveys say BJP is dominant again in Kaziranga | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: కజిరంగాలో సీట్ల వేట!

Published Sun, Apr 7 2024 4:07 AM | Last Updated on Sun, Apr 7 2024 11:41 AM

Lok sabha elections 2024: Surveys say BJP is dominant again in Kaziranga - Sakshi

అసోంలో పదేళ్లుగా కాషాయ రెపరెపలు

లోక్‌సభ సీట్లతో పాటు అసెంబ్లీలోనూ పాగా

పూర్వ వైభవం కోసం కాంగ్రెస్‌ కసరత్తు..

మళ్లీ బీజేపీదే ఆధిపత్యం అంటున్న సర్వేలు

అసోం పేరు చెప్పగానే ఖడ్గమృగాలు, బెంగాల్‌ టైగర్స్, ఏనుగు సఫారీలతో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కజిరంగా నేషనల్‌ పార్క్‌ కళ్లముందు కదలాడుతుంది. బ్రహ్మపుత్ర నది పరవళ్లతో పాటు తేయాకు తోటలకు కూడా ప్రసిద్ధి. ఈశాన్య భారత్‌కు గేట్‌వేగా నిలుస్తున్న ఈ రాష్ట్రంలో దశాబ్దకాలంగా సమూల రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఒకప్పుడు కాంగ్రెస్, అసోం గణ పరిషత్‌ (ఏజీపీ) కంచుకోటగా ఉన్న అతిపెద్ద ఈశాన్య రాష్ట్రంలో ఇప్పుడు కాషాయజెండా రెపరెపలాడుతోంది. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్‌.. మూడు దేశాలతో సరిహద్దు పంచుకోవడం వల్ల కూడా అసోం దేశ రాజకీయాల్లో కీలకంగా నిలుస్తోంది. ‘సెవెన్‌ సిస్టర్స్‌’లో పెద్ద తోబుట్టువుగా.. 14 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండటంతో సార్వత్రిక సమరంలో పార్టిలన్నీ సీట్ల వేటకు సై అంటున్నాయి.

గతేడాది కేంద్ర ఎన్నికల సంఘం అసోంలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను పూర్తిచేసిన నేపథ్యంలో 27 ఏళ్ల తర్వాత సీట్ల స్వరూపం స్వల్పంగా మారింది. కొలియాబార్‌ నియోజకవర్గానికి బదులు కొత్తగా కజిరంగా నియోజకవర్గం వచ్చి చేరింది. అలాగే, 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 స్థానాల పేర్లు మారాయి. 2009 నుంచి కమలనాథులు ఈశాన్యానికి విస్తరణ బాట పట్టారు. 2014లో అత్యధికంగా 7 సీట్లను దక్కించుకున్న బీజేపీ, 2019లో బలాన్ని మరింత పెంచుకుని 9 సీట్లు కొల్లగొట్టింది.

ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన ఏజీపీ 3 చోట్ల, బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌) ఒక స్థానంలో పోటీ చేయగా, వాటికి ఒక్క సీటు కూడా రాలేదు. మరోపక్క, కాంగ్రెస్‌ ఒంటరి పోరు చేసి 3 చోట్ల విజయం సాధించింది. 2014లోనూ మూడే సీట్లు దక్కాయి. ఇక రాష్ట్రంలో మూడో అతిపెద్ద పార్టిగా నిలుస్తున్న ఆలిండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌) 3 స్థానాల్లో పోటీ చేసి ఒక్క చోట విజేతగా నిలిచింది. 2014లో గెలిచిన 3 సీట్లలో రెండు కోల్పోయింది. మొత్తం 14 నియోజకవర్గాల్లో, 2 సీట్లను ఎస్‌టీలకు, 1 స్థానం ఎస్‌సీలకు కేటాయించారు.

బీజేపీ పాగా...
ఉత్తరాదిన గట్టి పట్టున్న కమలనాథులు ఈశాన్యంలో ఎలాగైనా పాగా వేయాలని 2009 నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే అక్కడ బలమైన ప్రాంతీయ పార్టిగా ఉన్న ఏజీపీలోని కీలక నాయకుడు సర్వానంద సోనోవాల్‌ను 2011లో పార్టిలో చేర్చుకుని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. 2014లో సోనోవాల్‌ సారథ్యంలో అసోం లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్న కమలనాథులు బంపర్‌ ఫలితాలను సాధించారు. బీజేపీకి ఏకంగా 7 సీట్లు (2009లో 2 సీట్లే) లభించాయి.

రాష్ట్రంలో అధికార పార్టిగా ఉన్న కాంగ్రెస్‌ బలం 7 సీట్ల నుంచి 3 స్థానాలకు పడిపోయింది. మియా బెంగాలీ ముస్లింలకు దన్నుగా నిలుస్తున్న ఏఐయూడీఎఫ్‌ 2 స్థానాలను మెరుగుపరుచుకుని 3 చోట్ల విజేతగా నిలిచింది. ఇక, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్‌ దన్నుతో బరిలోకి దిగిన కాషాయ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 126 అసెంబ్లీ సీట్లకు గాను 86 స్థానాలను ఖాతాలో వేసుకుంది.

సోనోవాల్‌ ముఖ్యమంత్రిగా ఈశాన్య రాష్ట్రంలో మొదటి బీజీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, అసోంలో పాగా వేసింది.  2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరింత బలం పుంజుకుంది. ఎన్‌డీఏ 9 సీట్లను దక్కించుకుంది. ఇవన్నీ కూడా బీజేపీకే రావడం గమనార్హం. భాగస్వామ్య పక్షాలకు ఒక్క సీటూ రాలేదు. ఈ ఘన విజయం తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ బరిలోకి దిగింది. కాంగ్రెస్‌ కూటమి భారీగా పుంజుకున్నప్పటికీ, మళ్లీ ఎన్‌డీఏ మెజారిటీ దక్కించుకుంది.

అయితే, కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి జంప్‌ చేసిన హిమంత బిశ్వ శర్మకు కమలనాథులు సీఎం పగ్గాలు అప్పగించి, సోనోవాల్‌ను మళ్లీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాగా, మోదీ ప్రభుత్వం రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మౌలిక సదుపాయాలపై భారీగా వెచి్చంచింది. దీన్నే ఇప్పుడు అక్కడ ప్రచారాస్త్రాలుగా చేసుకుంటోంది. మరోపక్క, ఇటీవల అమల్లోకి తెచి్చన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది.

పట్టుకోసం కాంగ్రెస్‌ ప్రయత్నం...
రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ దశాబ్దకాలంగా తీవ్రంగా దెబ్బతింది. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్గజ నేత తరుణ్‌ గొగోయ్‌పై అసమ్మతి, హిమంత బిశ్వ శర్మ వంటి నేతలు పార్టీని వీడటంతో కష్టాలు చుట్టుముట్టాయి. దీంతో అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. అయితే, 2019లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు లభించిన ఓట్లలో తేడా 0.61 శాతం మాత్రమే కావడం గమనార్హం.

2021 ఎన్నికల్లో తరుణ్‌ గొగోయ్‌ కుమారుడు గౌరవ్‌ గొగోయ్‌ సారథ్యంలో బరిలోకి దిగిన హస్తం పార్టీ భారీగా పుంజుకుంది. అంతక్రితం ఎన్నికలతో పోలిస్తే 24 సీట్లు మెరుగుపరుచుకుని 50 స్థానాల్లో విజయం సాధించింది. మళ్లీ బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది.  కాగా, అతిచిన్న వయస్సులో అసోం సీఎం పగ్గాలు చేపట్టిన ప్రఫుల్ల కుమార్‌ మహంతి (ఏజీపీ వ్యవస్థాపకుల్లో ఒకరు) వంటి నేతలు ఎన్‌డీఏతో జట్టుకట్టడం కూడా కాంగ్రెస్‌పై ప్రభావం చూపుతోంది.

అయితే, ఈసారి ఇండియా కూటమితో బీజేపీని ఢీకొట్టడం ద్వారా మెజారిటీ స్థానాలను చేజక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది హస్తం పార్టీ. కాగా, సీఏఏ అంశంతో పాటు మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఇండియా కూటమి ప్రచారా్రస్తాలుగా మలచుకుంటోంది. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో అసోం ప్రభుత్వంపై, మోదీ సర్కారు హయాంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ఎక్కుపెట్టారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మారణహోమానికి బీజేపీయే కారణమని కూడా ఇండియా కూటమి ప్రచారంలో హోరెత్తిస్తోంది.

కాంగ్రెస్‌ వల‘సలసల‘...
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల పార్టీ ఫిరాయింపులు, వలసలు కూడా జోరందుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భరత్‌ చంద్ర నారా రాజీనామా చేశారు. లఖీంపూర్‌ లోక్‌సభ సీటును తన భార్యకు ఇవ్వకపోవడమే దీనికి కారణం. రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రానా గోస్వామి కూడా బీజేపీలోకి జంప్‌ చేసిన సంగతి తెలిసిందే. శంకర్‌ ప్రసాద్‌ రాయ్, రతుల్‌ కురి్మ, కమలాఖ్య డే, బసంత దాస్‌ తదితర నాయకులు సైతం కాంగ్రెస్‌ నుంచి వలసబాట పట్టడం పార్టీని కలవరపెడుతోంది.

కాగా, రాహుల్‌ గాంధీ అసోంలో ప్రచారానికి రావాలని కోరుకుంటున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌ హిమంత బిశ్వ శర్మ సిల్చార్‌ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు. అసలు రాహుల్‌కు ప్రధాని మోదీతో పోటీ ఏంటని కూడా ఎద్దేవా చేశారు. రాహుల్‌ ప్రచారానికొస్తే బీజేపీకే లాభమని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఖాళీ అవుతుందన్నారు. మరోపక్క, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు భూపేన్‌ కుమార్‌ బోరా కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ హిమంత బాంబు పేల్చారు. అయితే, దీన్ని బోరా ఖండించడమే కాకుండా, రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేయడం విశేషం.
     

గొగోయ్‌ వర్సెస్‌ గొగోయ్‌
జోర్హాట్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఇద్దరు గొగోయ్‌లు తలపడుతున్నారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం కోసం శ్రమిస్తున్న గౌరవ్‌ గొగోయ్‌... సిట్టింగ్‌ బీజేపీ ఎంపీ,  తపన్‌ కుమార్‌ గొగోయ్‌ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో గౌరవ్‌ కలియాబోర్‌ నుంచి ఎంపీగా గెలిచారు. కాగా, తాను 2 లక్షల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తానని తపన్‌ గొగోయ్‌ సవాలు విసిరారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్నికల్లో బూచిగా చూపిస్తున్న ప్రతిపక్షాలను ఓటర్లు పట్టించుకోవడం లేదన్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న గౌరవ్‌ గొగోయ్‌ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. తనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్న వారంతా ఓట్లేస్తే తపన్‌ ఖచి్చతంగా ఓడిపోతారని అంటున్నారు. గౌరవ్‌ తండ్రి, అసోం సీఎంగా సుదీర్ఘకాలం పని చేసిన తరుణ్‌ గొగోయ్‌కు జోర్హాట్‌ నియోజకవర్గం ఒకప్పుడు కంచుకోటగా ఉండేది. జోర్హాట్‌ ఓటర్లతో ఈ అనుబంధాన్ని గుర్తు చేయడంతో పాటు యువ ఓటర్లపై గౌరవ్‌ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

సర్వేలు ఏమంటున్నాయి...
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిగా పోటీ చేస్తున్న బీజేపీ 11 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఏజీపీకి 2 సీట్లు, యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌ (యూపీపీఎల్‌)కు 1 సీటు ఇచ్చింది. ఇటీవల వెలువడిన పలు సర్వేలు ఎన్‌డీఏ 12 సీట్లను (బీజేపీ 10, ఏజీపీ 1, యూపీపీఎల్‌ 1) దక్కించుకుంటుందని అంచనా వేశాయి. కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌లకు చెరొక స్థానం రావచ్చని అంటున్నాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement