లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించారు. గత ఏడాది మే నుంచి జాతి కలహాలు జరుగుతున్న మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించకపోవడంపై ఆయన మండిపడ్డారు.
ఇక్కడ విలేకరుల సమావేశంలో ఖేరా మాట్లాడుతూ, "1971 కటాఫ్ తేదీ అస్సాంకు పవిత్రమైనది. కానీ సీఏఏ దాన్ని తొలగిస్తుంది. 2014 కొత్త కట్-ఆఫ్ తేదీ అవుతుంది. ఇది అస్సాం ఆందోళనలో అమరవీరుల త్యాగాలను అగౌరవపరుస్తుంది " అన్నారు. అస్సాం ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ప్రవేశించే వ్యక్తులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి మార్చి 25, 1971 నాటి కటాఫ్ తేదీని ఆయన ప్రస్తావించారు.
పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA) బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి 2014 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడ కనీసం ఐదేళ్లు నివాసం ఉన్న హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వాన్ని అందిస్తుంది.
ఇటీవల అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ పొరుగున ఉన్న మణిపూర్‌ను సందర్శించలేదని పవన్ ఖేరా విమర్శించారు. "మణిపూర్‌ను సందర్శించడానికి ప్రధానమంత్రి ఎందుకు భయపడుతున్నారు? దయచేసి మణిపూర్‌ను సందర్శించండి, అది కూడా మన దేశంలో భాగమే. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం అరగంటైనా ఆ రాష్ట్రాన్ని సందర్శించాలని కోరుతున్నాం" అన్నారాయన.
ఇక లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలో కాంగ్రెస్ మంచి పనితీరు కనబరుస్తుందని ఖేరా పేర్కొన్నారు. "కాంగ్రెస్ సర్వే ప్రకారం మేము ఈసారి ఎక్కువ సీట్లు సాధిస్తున్నాం. అస్సాం రికార్డులను బద్దలు కొడుతుంది. మా విజయం ఖాయం. అందుకే హిమంత బిస్వా శర్మ ప్రధానమంత్రిని క్రమం తప్పకుండా రాష్ట్రాన్ని సందర్శించాలని పిలుస్తున్నారు" అని ఖేరా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment