‘గంజ్‌’లో జంగ్‌ | Triangular fights on Karimganj loksabha elections | Sakshi
Sakshi News home page

‘గంజ్‌’లో జంగ్‌

Published Mon, Apr 15 2019 12:53 AM | Last Updated on Mon, Apr 15 2019 1:26 AM

Triangular fights on Karimganj loksabha elections - Sakshi

రాథేశ్యామ్‌, కృపానాథ్‌, స్వరూప్‌

అసోంలో కీలక ఆర్థిక, వాణిజ్య కేంద్రం కరీంగంజ్‌. బ్రిటిష్‌ పాలకులను ఎదిరించి చరిత్రలో నిలిచిన పోరుగడ్డ. బంగ్లాదేశ్‌–భారత్‌ మధ్య వారధిగా పరిగణించే ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యమూ ఎక్కువే.  ఈ ఎస్‌సీ రిజర్వుడు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌) బరిలో నిలిస్తే, అస్సాం గణ పరిషత్‌ (ఏజీపీ), బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బీపీఎఫ్‌)తో కలిసి బీజేపీ పోటీకి దిగింది.

త్రిపురకు ప్రవేశ ద్వారంగా పరిగణించే కరీంగంజ్‌ పరిధిలో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు (కరీంగంజ్‌ నార్త్, కరీంగంజ్‌ సౌత్, కట్లిచెర్ర, పథర్‌కంజి, హయిలకంజి, బదార్‌పూర్, అల్గపూర్, రతబరి) ఉన్నాయి. ఏఐయూడీఎఫ్‌ తరఫున సిట్టింగ్‌ ఎంపీ రాథేశ్యామ్‌ బిశ్వాస్‌ పోటీ చేస్తున్నారు. స్వరూప్‌ దాస్‌ కాంగ్రెస్‌ నుంచి, కృపానాథ్‌ మల్ల బీజేపీ కూటమి నుంచి తలపడుతున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చందన్‌దాస్‌కు కూడా నియోజకవర్గంలో పలుకుబడి ఉంది. అయితే, పోటీ ప్రధానంగా కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్, బీజేపీ కూటమి మధ్యే ఉండనుంది. మొత్తం 16 మంది పోటీలో ఉన్నారు.

పుంజుకున్న ఏఐయూడీఎఫ్‌
రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు మొత్తం ఓటర్లలో 35 శాతం ఉన్నారు. కరీంగంజ్‌ సహా ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో వారే నిర్ణయాత్మక శక్తి. సంప్రదాయకంగా వీరంతా కాంగ్రెస్‌ మద్దతుదారులు. 2005 సెప్టెంబర్‌లో జమాయిత్‌ ఉలేమా హింద్‌ అధ్యక్షుడు మౌలానా బద్రుద్దీన్‌ అజ్మల్‌ యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ను ప్రారంభించడంతో ముస్లింలంతా అటు వైపు మళ్లారు. దాంతో కాంగ్రెస్‌ ముస్లింల ఆధిక్యత గల ప్రాంతాల్లో పట్టు కోల్పోయింది. 2009లో ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌గా పేరు మార్చుకున్న అజ్మల్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల బరిలో అడుగుపెట్టింది.

ఫలితంగా ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా దెబ్బతింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఏఐయూడీఎఫ్‌ తన అభ్యర్థులను పోటీ పెట్టడం బీజేపీకి లాభించింది. క్రమంగా ఏఐ యూడీఎఫ్‌ బలం పుంజుకుని కాంగ్రెస్, బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా మారింది. గత ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థి రాధేశ్యామ్‌ ఘన విజ యం సాధించారు. ఆయన ఏఐయూడీఎఫ్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరిగింది. నాయకత్వం తీరు రాధేశ్యామ్‌కు నచ్చడం లేదని, దాంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని వార్తలు కూడా వచ్చాయి.

అయితే, ఈ ఎన్నికల్లో ఆయన ఏఐయూడీఎఫ్‌ నుంచే పోటీ చేస్తుండటంతో ఈ వార్తలన్నీ నిరాధారాలని తేలిపోయింది. కాగా, రాథేశ్యామ్‌పై మెజారిటీ ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు. నీటి సమస్యను పరిష్కరిస్తానని, సిల్చార్‌ నదిపై వంతెన నిర్మించేలా చూస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చలేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్‌ తీరుకు నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు నియోజకవర్గంలోని డజనుకుపైగా పంచాయతీలు ప్రకటించాయి. దీన్నిబట్టి ఏఐయూడీఎఫ్‌ విజయం అనుకున్నంత సులభం కాదని పరిశీలకులు అంటున్నారు.

చేజారిన ఓటు బ్యాంక్‌
సంప్రదాయకంగా అస్సాం కాంగ్రెస్‌కు కంచుకోట. 2005 వరకు రాష్ట్రంలోని ముస్లింలు ప్రధానంగా కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. 1962 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకంగా పదిసార్లు ఇక్కడ నెగ్గిందంటే దానికి కారణం ముస్లింల ఓట్లేనని చెప్పవచ్చు. అయితే, 2005లో ఏఐయూడీఎఫ్‌ ఆవిర్భావంతో కాంగ్రెస్‌ ఓటుబ్యాంకుకు గండిపడింది. 2009 ఎన్నికల్లోæ యూడీఎఫ్‌ బరిలో దిగడంతో కాంగ్రెస్‌ ఓట్లు చీలిపోయాయి. మరోవైపు బీజేపీ కూడా గట్టి అభ్యర్థులను పోటీ పెట్టింది. అయినా కూడా కాంగ్రెస్‌ తక్కువ మెజారిటీతో గెలిచింది. 2014లో మాత్రం కాంగ్రెస్‌ ఏఐయూడీఎఫ్‌ చేతిలో పరాజయం పాలయింది. చేజారిన ముస్లింలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్‌ విశ్వప్రయత్నం చేస్తోంది. మరోవైపు తేయాకు కార్మికుల సహాయంతో గట్టెక్కాలని కూడా పథకాలు రచిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను అనుకూలంగా మలుచుకోవడానికి చూస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి స్వరూప్‌దాస్‌ ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకోగలరనేదే విజయావకాశాలను నిర్ధారిస్తుంది.

పొత్తుపై బీజేపీ ఆశ
కాంగ్రెస్‌ విముక్త ఈశాన్య భారతం లక్ష్యంగా బీజేపీ అస్సాం గణ పరిషత్, బోడో ల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు మాత్రమే బీజేపీ ఇక్కడ గెలిచింది. ఈ పొత్తుల సాయంతోనే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదని వారు మండిపడుతున్నారు. ఒకటి రెండు మంచి పనులు చేపట్టినా అవి పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం కూడా వారి అసంతృప్తికి కారణమవుతోంది. దీన్ని గుర్తించిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో తేయాకు కార్మికుల సామాజిక వర్గానికి చెందిన కృపానాథ్‌ మల్లను అభ్యర్థిగా ఎంపిక చేసింది.

నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న తేయాకు కార్మికుల ఓట్లు రాబట్టడమే దీని ఉద్దేశం.అయితే, ఏఐయూడీఎఫ్‌ను ఎదుర్కోవడం బీజేపీకి కష్టమేనని పరిశీలకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మోదీ హవా బ్రహ్మాండంగా ఉన్నప్పుడే కరీంగంజ్‌లో ఆ పార్టీ యూడీఎఫ్‌ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు జాతీయ రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో కమలనాధులు ఎంత వరకు నెగ్గుకు రాగలరో చూడాలి. ప్రధాన పార్టీల సంగతి ఇలా ఉంటే తృణమూల్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చందన్‌ దాస్‌ కూడా పలుకుబడి ఉన్న వారే. పోటీలో ఉన్న పది మందికిపైగా ఇండిపెండెంటు అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల ఓట్లు చీల్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement