AIUDF
-
మరో ఐదారేళ్లలో బీజేపీ ఖేల్ ఖతం.. ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే జోస్యం
గవహటి: ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) ఎమ్మెల్యే కరీముద్దిన్ బర్భూయా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో ఐదారేళ్లలో బీజేపీ కనుమరుగు అవుతుందన్నారు. బిహార్ నుంచే ఆ పార్టీ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు. బీజేపీనీ ప్రజలు మరోసారి అంగీకరించే పరిస్థితి లేదని చెప్పారు. అలాగే కాంగ్రెస్ నాయకులు చాలా మంది తమ పార్టీలో చేరుతారని చెప్పారు ఈ అసోం ఎమ్మెల్యే. సెప్టెంబర్‌లో భారీగా చేరికలుంటాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ఓడ అని ఈ ఏడాది ఏప్రిల్‌లోనే వ్యాఖ్యానించారు కరీముద్దిన్. అసోంలో బీజేపీని గద్దె దించడం ఇక ఏఐయూడీఎఫ్‌కే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. రిపున్ బోరాను పీసీసీ చీఫ్‌గా తొలగించడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలహీనపడుతోందని అభిప్రాయపడ్డారు. మరోవైపు అసోంలో పలువురు కాంగ్రెస్ నేతలు టీఎంసీలో చేరారు. ఈ ఏడాది మేలోనే పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏఐయూడీఎఫ్ బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని కరీముద్దిన్ చెబుతున్నారు. బిహార్‌లో బీజేపీకి షాక్ ఇస్తూ ఎన్డీఏ కూటమి నుంచి సీఎం నితీశ్ కుమార్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. చదవండి: గుజరాత్లో బీజేపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి కాంగ్రెస్‌దే విజయం.. -
‘గంజ్’లో జంగ్
అసోంలో కీలక ఆర్థిక, వాణిజ్య కేంద్రం కరీంగంజ్. బ్రిటిష్ పాలకులను ఎదిరించి చరిత్రలో నిలిచిన పోరుగడ్డ. బంగ్లాదేశ్–భారత్ మధ్య వారధిగా పరిగణించే ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యమూ ఎక్కువే. ఈ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) బరిలో నిలిస్తే, అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)తో కలిసి బీజేపీ పోటీకి దిగింది. త్రిపురకు ప్రవేశ ద్వారంగా పరిగణించే కరీంగంజ్ పరిధిలో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు (కరీంగంజ్ నార్త్, కరీంగంజ్ సౌత్, కట్లిచెర్ర, పథర్‌కంజి, హయిలకంజి, బదార్పూర్, అల్గపూర్, రతబరి) ఉన్నాయి. ఏఐయూడీఎఫ్ తరఫున సిట్టింగ్ ఎంపీ రాథేశ్యామ్ బిశ్వాస్ పోటీ చేస్తున్నారు. స్వరూప్ దాస్ కాంగ్రెస్ నుంచి, కృపానాథ్ మల్ల బీజేపీ కూటమి నుంచి తలపడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చందన్‌దాస్‌కు కూడా నియోజకవర్గంలో పలుకుబడి ఉంది. అయితే, పోటీ ప్రధానంగా కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్, బీజేపీ కూటమి మధ్యే ఉండనుంది. మొత్తం 16 మంది పోటీలో ఉన్నారు. పుంజుకున్న ఏఐయూడీఎఫ్ రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు మొత్తం ఓటర్లలో 35 శాతం ఉన్నారు. కరీంగంజ్ సహా ఆరు లోక్‌సభ నియోజకవర్గాల్లో వారే నిర్ణయాత్మక శక్తి. సంప్రదాయకంగా వీరంతా కాంగ్రెస్ మద్దతుదారులు. 2005 సెప్టెంబర్‌లో జమాయిత్ ఉలేమా హింద్ అధ్యక్షుడు మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌ను ప్రారంభించడంతో ముస్లింలంతా అటు వైపు మళ్లారు. దాంతో కాంగ్రెస్ ముస్లింల ఆధిక్యత గల ప్రాంతాల్లో పట్టు కోల్పోయింది. 2009లో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌గా పేరు మార్చుకున్న అజ్మల్ పార్టీ రాష్ట్ర ఎన్నికల బరిలో అడుగుపెట్టింది. ఫలితంగా ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఏఐయూడీఎఫ్ తన అభ్యర్థులను పోటీ పెట్టడం బీజేపీకి లాభించింది. క్రమంగా ఏఐ యూడీఎఫ్ బలం పుంజుకుని కాంగ్రెస్, బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా మారింది. గత ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థి రాధేశ్యామ్ ఘన విజ యం సాధించారు. ఆయన ఏఐయూడీఎఫ్ నుంచి కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరిగింది. నాయకత్వం తీరు రాధేశ్యామ్‌కు నచ్చడం లేదని, దాంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఆయన ఏఐయూడీఎఫ్ నుంచే పోటీ చేస్తుండటంతో ఈ వార్తలన్నీ నిరాధారాలని తేలిపోయింది. కాగా, రాథేశ్యామ్‌పై మెజారిటీ ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు. నీటి సమస్యను పరిష్కరిస్తానని, సిల్చార్ నదిపై వంతెన నిర్మించేలా చూస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన నెరవేర్చలేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ తీరుకు నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు నియోజకవర్గంలోని డజనుకుపైగా పంచాయతీలు ప్రకటించాయి. దీన్నిబట్టి ఏఐయూడీఎఫ్ విజయం అనుకున్నంత సులభం కాదని పరిశీలకులు అంటున్నారు. చేజారిన ఓటు బ్యాంక్ సంప్రదాయకంగా అస్సాం కాంగ్రెస్‌కు కంచుకోట. 2005 వరకు రాష్ట్రంలోని ముస్లింలు ప్రధానంగా కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. 1962 నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా పదిసార్లు ఇక్కడ నెగ్గిందంటే దానికి కారణం ముస్లింల ఓట్లేనని చెప్పవచ్చు. అయితే, 2005లో ఏఐయూడీఎఫ్ ఆవిర్భావంతో కాంగ్రెస్ ఓటుబ్యాంకుకు గండిపడింది. 2009 ఎన్నికల్లోæ యూడీఎఫ్ బరిలో దిగడంతో కాంగ్రెస్ ఓట్లు చీలిపోయాయి. మరోవైపు బీజేపీ కూడా గట్టి అభ్యర్థులను పోటీ పెట్టింది. అయినా కూడా కాంగ్రెస్ తక్కువ మెజారిటీతో గెలిచింది. 2014లో మాత్రం కాంగ్రెస్ ఏఐయూడీఎఫ్ చేతిలో పరాజయం పాలయింది. చేజారిన ముస్లింలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నం చేస్తోంది. మరోవైపు తేయాకు కార్మికుల సహాయంతో గట్టెక్కాలని కూడా పథకాలు రచిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను అనుకూలంగా మలుచుకోవడానికి చూస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప్‌దాస్ ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకోగలరనేదే విజయావకాశాలను నిర్ధారిస్తుంది. పొత్తుపై బీజేపీ ఆశ కాంగ్రెస్ విముక్త ఈశాన్య భారతం లక్ష్యంగా బీజేపీ అస్సాం గణ పరిషత్, బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఇంత వరకు జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు మాత్రమే బీజేపీ ఇక్కడ గెలిచింది. ఈ పొత్తుల సాయంతోనే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదని వారు మండిపడుతున్నారు. ఒకటి రెండు మంచి పనులు చేపట్టినా అవి పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం కూడా వారి అసంతృప్తికి కారణమవుతోంది. దీన్ని గుర్తించిన బీజేపీ ఈసారి ఎన్నికల్లో తేయాకు కార్మికుల సామాజిక వర్గానికి చెందిన కృపానాథ్ మల్లను అభ్యర్థిగా ఎంపిక చేసింది. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న తేయాకు కార్మికుల ఓట్లు రాబట్టడమే దీని ఉద్దేశం.అయితే, ఏఐయూడీఎఫ్‌ను ఎదుర్కోవడం బీజేపీకి కష్టమేనని పరిశీలకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మోదీ హవా బ్రహ్మాండంగా ఉన్నప్పుడే కరీంగంజ్‌లో ఆ పార్టీ యూడీఎఫ్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు జాతీయ రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో కమలనాధులు ఎంత వరకు నెగ్గుకు రాగలరో చూడాలి. ప్రధాన పార్టీల సంగతి ఇలా ఉంటే తృణమూల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చందన్ దాస్ కూడా పలుకుబడి ఉన్న వారే. పోటీలో ఉన్న పది మందికిపైగా ఇండిపెండెంటు అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల ఓట్లు చీల్చే అవకాశం ఉంది. -
మోదీని దేశం నుంచి తరిమేస్తాం!
న్యూఢిల్లీ : ఏఐయూడీఎఫ్ నాయకుడు బద్రుద్దీన్ అజ్మల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మహాకూటమితో కలిసి తాను నరేంద్రమోదీని దేశం నుంచి తరిమేస్తామని ఆయన పేర్కొన్నారు. అసోంలోని డుబ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మోదీ గద్దె దిగిపోతారని, ఆ తర్వాత ఆయన చాయ్ దుకాణం తెరిచి.. పకోడాలు అమ్ముకోవచ్చునని పేర్కొన్నారు. అజ్మల్ వ్యాఖ్యలపై ట్విటర్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ ప్రధానిని కించపరిచేలా మాట్లాడిన అజ్మల్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అజ్మల్ గతంలోనూ పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల పొత్తు గురించి ప్రశ్నించిన ఓ జర్నలిస్టును.. తల పగలగొడతానంటూ అజ్మల్ హెచ్చరించారు. ఎన్నికల తర్వాత మోదీని గద్దె దింపే కూటమితో తాను చేతులు కలుపుతానంటూ అజ్మల్ ప్రకటనపై ప్రశ్నిస్తూ.. ఎన్నికల తర్వాత మరో కూటమిలో జంప్ చేయబోతున్నారా? అని జర్నలిస్టు అడగడం ఆయనకు కోపం తెప్పించింది. -
'కింగ్ మేకర్' అవుతానని..!
అసోం ఎన్నికల్లో కింగ్ మేకర్ రోల్ ప్లే చేస్తానన్న సెంటు దిగ్గజం మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ భారతీయ జనతా పార్టీ జోరుకు నిలబడలేక పోయారు. అసోంలో పోలింగ్ పూర్తయిన తర్వాత ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫండ్ (ఏఐయూడీఎఫ్) సాయం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదని ఆయన అన్నారు. పార్టీని నిలబెట్టడం మాట అటుంచి తానే గెలవలేక చతికిలపడ్డారు. ఎన్నికల ఫలితాల్లో పార్టీ కేవలం 13 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో ఏఐయూడీఎఫ్ ఆశలు అడియాసలయ్యాయి. 2005లో పార్టీని స్థాపించిన నాటి నుంచి ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభావం చూపింది. అప్పటినుంచి ప్రతి ఎన్నికలో విజయం సాధిస్తూ వస్తోన్న అజ్మల్ ఈ ఎన్నికల్లో తొలి ఓటమి రుచి చూశారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి వాజెద్ అలీ చౌదరి చేతిలో 16,723 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన అజ్మల్ ప్రజల తీర్పును పాటిస్తామని.. ప్రతిపక్ష పాత్రలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని అన్నారు. ఏఐయూడీఎఫ్ ఓటమికి కాంగ్రెస్ పార్టీయే ముఖ్యకారణమని ఆయన ఆరోపించారు. ఏఐయూడీఎఫ్ సూచించినట్లు మహాకూటమిగా ఏర్పడి ఉంటే గెలిచి తీరేవాళ్లమని అన్నారు. -
అసోంలో గ్రాండ్ అలయెన్స్
గువాహటి: రానున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు లౌకిక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఏఐయూడీఎఫ్, ఆర్జేడీ, జడీయూలు ఇప్పటికే గ్రాండ్ అలయెన్స్‌గా ఏర్పడినట్లు ఏఐయూడీఎఫ్ చీఫ్, లోక్‌సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ ప్రకటించారు. ఈ మహా కూటమిలో చేరాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. బీహార్‌లో బీజేపీని మట్టి కరిపించిన మహా కూటమి భాగస్వాములు జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో తాము చర్చలు జరిపామని, మహా కూటమిలో చేరేందుకు వారు సమ్మతి వ్యక్తం చేశారని అజ్మల్ వివరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాటీకి కలసి రావాలని తాము కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పలికామని, ఆ పార్టీ నుంచి స్పందన రావాల్సి ఉందని అజ్మల్ తెలిపారు. అలాగే ఇప్పటికే బీజేపీతో చేతులు కలిపిన అస్సాం గన పరిషద్‌ను కూడా మనసు మార్చుకొని తమతో కలసి రావాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఈ రెండు పార్టీలు కూడా తమతో కలిసొస్తే మతవాద శక్తులను మట్టికరిపించగలమని అన్నారు. దేశంలో బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని, నరేంద్ర మోదీ ప్రతిష్టకు ఎవరూ సాటిరారని ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విర్రవీగిన బీజేపి నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని జేడీయూ ప్రధాన కార్యదర్శి, ఈశాన్య రాష్ట్రాల పార్టీ బాధ్యుడు అరుణ్ కుమార్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. తప్పుడు వాగ్దానాలు చేసిన బీజేపీ పట్ల అస్సాం ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు. -
అసోంలో ఏఐయూడీఎఫ్ ముందంజ
గౌహతి : అసోం రాష్ట్రంలో ఇటీవల జరిగిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. అయితే రెండు స్థానాలలో ఏఐయూడీఎఫ్ అభ్యర్థులు ముందంజలో ఉండగా మరో స్థానంలో బీజేపీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రాష్ట్రంలోని మూడు శాసనసభ నియోజకవర్గాలైన సిల్చెర్, జమునాముఖ్, లక్ష్మీపూర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ మూడు నియోజకవర్గాలలో మొత్తం 25 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మరికాసేపట్లో ఎవరి భవితవ్యం ఏమిటనేది తేలనుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలలోని మూడు పార్లమెంట్ స్థానాలకు, 33 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఈ నెల 13న నిర్వహించారు. అందులోభాగంగా మంగళవారం ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.