అసోంలో గ్రాండ్ అలయెన్స్
గువాహటి: రానున్న అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు లౌకిక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ఏఐయూడీఎఫ్, ఆర్జేడీ, జడీయూలు ఇప్పటికే గ్రాండ్ అలయెన్స్‌గా ఏర్పడినట్లు ఏఐయూడీఎఫ్ చీఫ్, లోక్‌సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ ప్రకటించారు. ఈ మహా కూటమిలో చేరాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. బీహార్‌లో బీజేపీని మట్టి కరిపించిన మహా కూటమి భాగస్వాములు జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో తాము చర్చలు జరిపామని, మహా కూటమిలో చేరేందుకు వారు సమ్మతి వ్యక్తం చేశారని అజ్మల్ వివరించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాటీకి కలసి రావాలని తాము కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానం పలికామని, ఆ పార్టీ నుంచి స్పందన రావాల్సి ఉందని అజ్మల్ తెలిపారు. అలాగే ఇప్పటికే బీజేపీతో చేతులు కలిపిన అస్సాం గన పరిషద్‌ను కూడా మనసు మార్చుకొని తమతో కలసి రావాలని కోరుతున్నామని ఆయన చెప్పారు. ఈ రెండు పార్టీలు కూడా తమతో కలిసొస్తే మతవాద శక్తులను మట్టికరిపించగలమని అన్నారు.
దేశంలో బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయం లేదని, నరేంద్ర మోదీ ప్రతిష్టకు ఎవరూ సాటిరారని ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విర్రవీగిన బీజేపి నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని జేడీయూ ప్రధాన కార్యదర్శి, ఈశాన్య రాష్ట్రాల పార్టీ బాధ్యుడు అరుణ్ కుమార్ శ్రీవాత్సవ వ్యాఖ్యానించారు. తప్పుడు వాగ్దానాలు చేసిన బీజేపీ పట్ల అస్సాం ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు.